Share News

అక్రమాల జాతర! నిబంధనలకు పాతర!!

ABN , Publish Date - Nov 28 , 2026 | 01:25 AM

జీవీఎంసీ ప్రజారోగ్య విభాగంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, హెల్త్‌ అసిస్టెంట్ల కొరతను సొమ్ము చేసుకునేందుకు కొందరు అధికారులు తహతహలాడుతున్నారు.

అక్రమాల జాతర! నిబంధనలకు పాతర!!

  • జీవీఎంసీ ప్రజారోగ్య విభాగంలో అడ్డగోలుగా ఇన్‌చార్జి పోస్టులు

  • అవుట్‌సోర్సింగ్‌ మేస్త్రి, హెల్త్‌అసిస్టెంట్ల పేర్లు సిఫారసు

  • కొన్నిజోన్‌ల కమిషనర్లు, ఏఎంహెచ్‌ఓల పాత్రపై ఆరోపణ

  • ఒక్కొక్కరి నుంచి రూ.రెండు లక్షలు వసూలుచేశారని ఆరోపణలు

  • కమిషనర్‌ ను కలిసి ఫిర్యాదుచేయాలనే యోచనలో నేతలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ ప్రజారోగ్య విభాగంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, హెల్త్‌ అసిస్టెంట్ల కొరతను సొమ్ము చేసుకునేందుకు కొందరు అధికారులు తహతహలాడుతున్నారు. అర్హులైన వారికి కాకుండా అనర్హులకు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌లుగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. డబ్బుల కోసం కొందరు జోనల్‌ కమిషనర్లు, ఏఎంహెచ్‌ఓలే అడ్డదారులు తొక్కుతున్నారని యూనియన్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు చెబుతున్నారు.

ప్రజారోగ్య విభాగంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, హెల్త్‌ అసిస్టెంట్లు కీలకం. వీధుల్లో పారిశుధ్య నిర్వహణ, డ్రైనేజీల్లో పూడిక తీయించడం, డీఅండ్‌ఓ ట్రేడ్‌ లైసెన్స్‌ల జారీ, బర్త్‌ అండ్‌ డెత్‌ సర్టిఫికెట్ల జారీ, క్లాప్‌ వాహనాల పర్యవేక్షణ వంటి బాధ్యతలను శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నిర్వర్తిస్తుంటారు. సీజన్‌ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడం, ఫాగింగ్‌ చేయించడం, జ్వరాలతో బాధపడేవారి నుంచి రక్తనమూనాలు తీయించి పరీక్షలకు పంపడం, జనన, మరణాల నమోదు వంటివి హెల్త్‌ అసిస్టెంట్లు చూస్తుంటారు. అయితే జీవీఎంసీలో వార్డుల సంఖ్య క్రమంగా పెరగడం, ఉద్యోగ విరమణ చేస్తున్నా వారి స్థానంలో కొత ్త నియామకాలు జరగకపోవడం వల్ల శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, హెల్త్‌ అసిస్టెంట్ల కొరత నెలకొంది. దీంతో ఉన్నవారికే అదనంగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ నెట్టుకొస్తున్నారు. అయితే ఈ ఇబ్బందిని అధిగమించేందుకు మలేరియా విభాగంలోని హెల్త్‌ అసిస్టెంట్లలో అర్హత ఉన్నవారికి శానిటరీ ఇన్‌స్పెక్టర్లుగా ఇన్‌చార్జి బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికోసం తమ జోన్‌లో అర్హులైన వారిని గుర్తించి ఉన్నతాధికారులకు పది జోన్లలోని జోనల్‌ కమిషనర్లు, అసిస్టెంట్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఆఫీసర్లు (ఏఎంహెచ్‌ఓ) సిఫారసు చేయాలి. కానీ కొందరు జెడ్సీలు, ఏఎంహెచ్‌లు అర్హత కంటే తమ డబ్బులు ఇచ్చే వారిని (రూ.2 లక్షల వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి) ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుకు సిఫారసు చేయాలని భావించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించాలంటే సదరు ఉద్యోగి శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్నవారై ఉండడంతోపాటు కచ్చితంగా శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ కోర్సు పూర్తిచేయాలి. అదే హెల్త్‌ అసిస్టెంట్‌ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తించాలంటే సదరు ఉద్యోగి తప్పనిసరిగా ఎంపీహెచ్‌ఏ కోర్సు పూర్తిచేసి ఉండాలి. కానీ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుకు సచివాలయ కార్యదర్శులు, అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్న హెల్త్‌ అసిస్టెంట్లు, మేస్త్రిల పేర్లను జాబితాలో పొందుపరచడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలాగే హెల్త్‌ అసిస్టెంట్‌ ఇన్‌చార్జి పోస్టులకు ఎలాంటి ప్రత్యేక కోర్సు చేయని అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను సిఫారసు చేసినట్టు కార్మికసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించేందుకు సుమారు 35 మంది పేర్లతో ఫైల్‌ తయారుచేసిన అధికారులు కమిషనర్‌కు పంపించినట్టు యూనియన్‌ నేతలు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.

Updated Date - Nov 28 , 2026 | 01:25 AM