Share News

తల్లికి వందనం ఈకేవైసీ చకచకా

ABN , Publish Date - Jul 16 , 2026 | 11:31 PM

రాష్ట్ర ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌లో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంలో జిల్లాలో లక్షా 5 వేల మంది తల్లులను లబ్ధిదారులుగా ప్రాథమికంగా గుర్తించారు.

తల్లికి వందనం ఈకేవైసీ చకచకా
ఏజెన్సీలోని ఒక సచివాలయంలో తల్లికి వందనం లబ్ధిదారుల ఈకేవైసీ చేస్తున్న దృశ్యం (ఫైల్‌)

జిల్లాలో లక్షా 5 వేల మంది లబ్ధిదారులు

ప్రాథమికంగా గుర్తించిన అధికారులు

ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలున్నా పథకం వర్తింపు

22న తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాలని ప్రభుత్వ నిర్ణయం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌లో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంలో జిల్లాలో లక్షా 5 వేల మంది తల్లులను లబ్ధిదారులుగా ప్రాథమికంగా గుర్తించారు. ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న వారితో పాటు ఇంటర్మీడియట్‌ విద్యార్థుల తల్లులకు ఈ పథకం కింద రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం అందించనుంది.

ప్రస్తుతం జిల్లాలోని 2,051 పాఠశాలల్లో చదువుతున్న ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థులు లక్షా 23 వేల 107 మంది, ఇంటర్మీడియట్‌ విద్యార్థులు 5,600 మంది ఉంటారని అధికారులు అంచనా వేశారు. అలాగే వారిలో ఈ పథకానికి అర్హులైన తల్లులు మాత్రం ప్రస్తుతానికి లక్షా 5 వేల మంది ఉంటారని గుర్తించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అమ్మఒడి పథకం పేరిట రూ.15 వేలు అందించగా, కూటమి ప్రభుత్వం కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుతున్నా వారందరికీ తల్లికి వందనం పథకం ద్వారా రూ.15 వేలు చొప్పున అందిస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన రూ.15 వేలులో రూ.2 వేలు పాఠశాల అభివృద్ధికి కేటాయించగా, తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు చొప్పున జమ కానున్నాయి.

జోరుగా ఈకేవైసీ ప్రక్రియ

తల్లికి వందనం పథకం లబ్ధిదారుల పరిశీలన ప్రక్రియలో భాగంగా పిల్లులు, తల్లుల ఈకేవైసీ ముమ్మరంగా జరుగుతున్నది. తల్లికి వందనం పథకానికి సంబంధించి గ్రామ సచివాలయాల వారీగా అర్హులైన విద్యార్థులు, వారి తల్లుల వివరాలను ఈకేవైసీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గత కొన్ని రోజులుగా తల్లికి వందనం పథకం లబ్ధిదారులైన విద్యార్థి, తల్లికి సంబంధించిన వివరాలను పరిశీలించి, వారిని బయోమెట్రిక్‌(ఈకేవైసీ) నమోదు ద్వారా నిర్ధారణ చేస్తున్నారు. ఈ క్రమంలో వాటిలో ఏర్పడిన తప్పొప్పులను సరి చేసి ఈ నెల 22న విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో తల్లికి వందనం పథకం సొమ్మును జమ చేయనున్నారు. ఈ ఏడాది ఒకటో తరగతిలో చేరే విద్యార్థులు, ఇంటర్‌లో చేరే విద్యార్థులను గుర్తించి, ఆగస్టు 30న వారికి తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం సొమ్మును జమచేయనున్నారు. అర్హులైనా ఏదైనా కారణంతో తల్లికి వందనం పథకం వర్తించకపోతే ఈ నెల 22 నుంచి ఆగస్టు 3వ తేదీ లోపు తమ పరిధిలోని సచివాలయాల్లో లబ్ధిదారులు ఫిర్యాదులు చేయవచ్చునని విద్యాశాఖాధికారులు సూచించారు.

తల్లికి వందనం పథకానికి అర్హతలివీ..

- విద్యార్థి కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో రూ.లక్షా 20 వేలు, పట్టణాల్లో రూ.లక్షా 44 వేల లోపు ఉండాలి.

- కుటుంబానికి విధిగా బియ్యం కార్డు ఉండాలి, 10 ఎకరాల్లోపు మాత్రమే భూమి ఉండాలి.

- బియ్యం కార్డులో ఉన్న వారి పేరిట నాలుగు చక్రాల వాహనాలుండకూడదు.

- విద్యార్థి వార్షిక హాజరు 75 శాతానికి తగ్గకూడదు.

- సదరు కుటుంబం విద్యుత్‌ వాడకం నెలకు 300 యూనిట్లు దాటకూడదు.

Updated Date - Jul 16 , 2026 | 11:31 PM