Share News

మండలాలకు పాఠ్య పుస్తకాలు

ABN , Publish Date - May 22 , 2026 | 12:25 AM

వచ్చే విద్యా సంవత్సరానికిగాను జిల్లాలో ప్రభుత్వ, జడ్పీ, మునిసిపల్‌, ఎయిడెడ్‌ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం, పాఠ్య పుస్తకాలను మండల పాయింట్లకు పంపించారు.

మండలాలకు పాఠ్య పుస్తకాలు

యూనిఫాం క్లాత్‌ కూడా...

ఒక్కొక్కరికి మూడేసి జతలు

త్వరలో బూట్లు, బ్యాగులు సరఫరా

జిల్లాలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 69,279 విద్యార్థులు

పాఠశాలల పునఃప్రారంభం రోజునే పంపిణీ చేస్తామన్న డీఈవో

విశాఖపట్నం, మే 21 (ఆంధ్రజ్యోతి):

వచ్చే విద్యా సంవత్సరానికిగాను జిల్లాలో ప్రభుత్వ, జడ్పీ, మునిసిపల్‌, ఎయిడెడ్‌ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం, పాఠ్య పుస్తకాలను మండల పాయింట్లకు పంపించారు. గత విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యామిత్ర కిట్లు అందజేస్తారు. దీని ప్రకారం జిల్లాలో 69,279 మంది విద్యార్థులకు యూనిఫాం, బూట్లు, బ్యాగులు సరఫరా కానున్నాయి. అలాగే ఒకటి నుంచి ఐదు తరగతి వరకూ బాలికలు, ఒకటి నుంచి పదో తరగతి వరకు బాలురు...మొత్తం 45,360 మందికి బెల్టులు, ఆరో తరగతి చదివే 7,879 మంది విద్యార్థులకు ఆక్స్‌ఫర్డు నిఘంటువు, అన్ని సబ్జెక్టులకు కలిపి 4,57,996 పాఠ్య పుస్తకాలు కేటాయించారు. గాజువాకలో గల జిల్లా స్థాయి డిపో నుంచి 11 మండల పాయింట్లకు పాఠ్య పుస్తకాలు పంపించారు. నెలాఖరుకు మొత్తం కిట్లు జిల్లాకు చేరతాయని విద్యాశాఖాధికారి ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రతి పాఠశాల పాయింట్‌కు కిట్లు పంపిణీ చేపడతామన్నారు. జూన్‌ 12 (పాఠశాలల పునఃప్రారంభం రోజు)న విద్యార్థులకు కిట్లు అందజేస్తామన్నారు. యూనిఫాం ప్రతి విద్యార్థికి మూడు జతలు అందజేస్తామని, కుట్టు మజూరీ కోసం జతకు రూ.60 తల్లుల ఖాతాకు జమ చేస్తామని వివరించారు. కాగా చినగదిలి మండలానికి సంబంధించి కిట్లు తోటగరువు జడ్పీ ఉన్నతపాఠశాలలో భద్రపరుస్తున్నారు. వచ్చిన యూనిఫాం, పుస్తకాలను విద్యార్థుల సంఖ్య మేరకు ప్యాకింగ్‌ చేసి సిద్ధం చేస్తున్నామని ఎంఈవో రవీంద్రబాబు తెలిపారు.

Updated Date - May 22 , 2026 | 12:25 AM