Share News

టెట్‌ టెన్షన్‌

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:51 AM

ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్‌ (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

టెట్‌ టెన్షన్‌

సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులు కూడా అర్హత సాధించాల్సిందే

సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు

ఐదేళ్ల కంటే తక్కువ సర్వీస్‌ ఉన్నవారికి మినహాయింపు

ఉమ్మడి జిల్లాలో పది వేల మందిపై ప్రభావం

సమస్య పరిష్కారానిక పాలకులు చొరవ తీసుకోవాలని టీచర్ల డిమాండ్‌

విశాఖపట్నం, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్‌ (టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌)లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులు టెట్‌ అర్హత సాధించాలని విద్యా శాఖ ఆదేశించింది. ఉపాధ్యాయ నియామకాల కోసం బీఈడీ/డీఈడీ అభ్యర్థులకు టెట్‌ నిర్వహణకు తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇదే నోటిఫికేషన్‌ ప్రకారం ఇన్‌సర్వీస్‌ టీచర్లు కూడా టెట్‌ కోసం సిద్ధమవుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2028 ఆగస్టు 31వ తేదీలోగా ఉపాధ్యాయులు టెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. అయితే ఐదేళ్ల సర్వీస్‌ అంటే 2030 సెప్టెంబరు ఒకటో తేదీలోగా పదవీ విరమణ చేయనున్న టీచర్లకు టెట్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఐదేళ్ల సర్వీస్‌ కంటే ఎక్కువ సర్వీస్‌ ఉన్న టీచర్లు విధిగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) రాసి ఉత్తీర్ణత సాధించాలి.

ఉమ్మడి జిల్లాలో ఐదేళ్లకు మించి సర్వీస్‌ ఉన్న టీచర్లు సుమారు పది వేల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. ఎస్జీటీ నుంచి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, చివరకు ఎంఈవోలు టెట్‌ రాసి పాసవ్వాల్సిందే. ఐదేళ్ల కంటే తక్కువ సర్వీస్‌ ఉండి పదోన్నతి కోరుకుంటే మాత్రం సదరు టీచరు టెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) 2016లో అమలులోకి వచ్చిన తరువాత జరిగిన డీఎస్సీల ద్వారా ఎంపికైన టీచర్లకు అవసరం లేదు. అయితే టెట్‌పై ఉపాధ్యాయుల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. ప్రభుత్వంలో ఏ శాఖకు చివరకు జూనియర్‌, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, వర్సిటీల ఆచార్యులకు ఈ నిబంధన లేదని, ఒక్క పాఠశాల విద్యాశాఖలోని టీచర్లకు మాత్రమే ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తున్నారు. ఇన్‌సర్వీస్‌ టీచర్లకు టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి కాదంటూ తమిళనాడుతోపాటు కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే టీచర్లకు స్పష్టంచేశాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ తప్పనిసరి చేశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మరోసారి రివ్యూ పిటిషన్‌ వేయడం లేదా పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం చేసి ఇన్‌సర్వీస్‌ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. తెలంగాణలో ఇన్‌సర్వీస్‌ టీచర్లకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అది కూడా వారు బోధించే సబ్జెక్టుపై మాత్రం ప్రశ్నపత్రం రూపొందించాలని, అన్ని కేడర్‌లలో ఒకే మాదిరిగా అర్హత మార్కులు నిర్ణయించాలని కోరుతున్నారు.

ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలి

ఇమంది పైడిరాజు, ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ, విశాఖ జిల్లా

ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి. సుమారు మూడు దశాబ్దాలుగా బోధన చేస్తున్న టీచర్లు ఇప్పుడు టెట్‌ రాయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ వేయాలి. లేకపోతే పార్లమెంటులో చట్టం తీసుకురావాలి. ఏ మాత్రం బోధనా అనుభవం లేని నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌నకు టెట్‌ ఉత్తీర్ణత లేకుండా జూనియర్‌ లెక్చరర్‌గా పదోన్నతి ఇస్తున్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న టీచర్లకు టెట్‌ తప్పనిసరి చేయడం బాధాకరం. ప్రభుత్వంలో ఏ ఉద్యోగానికి లేని అర్హత పరీక్షలు కేవలం టీచర్లకు పెట్టడం శోచనీయం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలి.


నేటి నుంచి జూనియర్‌ కళాశాలలు పునఃప్రారంభం

ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తరగతులు

మద్దిలపాలెం, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో శనివారం నుంచి జూనియర్‌ కళాశాలలు తెరుచుకోనున్నాయి. ఇంటర్మీడియట్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. గతంలో విద్యా సంవత్సరాన్ని జూన్‌లో ప్రారంభించిన ఇంటర్‌ బోర్డు గత ఏడాది నుంచి ఏప్రిల్‌లోనే మొదలెట్టింది. ఈ మేరకు ఏప్రిల్‌ ఒకటి నుంచి 23 వరకు ద్వితీయ సంవత్సరం క్లాసులు నిర్వహించిన అనంతరం మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటించింది. కాగా జూన్‌ ఒకటో తేదీ నుంచి క్లాసులు ప్రారంభించాల్సి ఉండగా ఎండల తీవ్రతతో ప్రభుత్వం ఐదో తేదీ వరకు సెలవులు పొడిగించింది. మరోవైపు ప్రథమ సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. పదో తరగతి ఫలితాలు వెలువడినప్పటి నుంచి ప్రైవేటు, ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరం ఆంగ్ల మాధ్యమం విద్యార్థులకు ఇప్పటికే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయగా, ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు పూర్తిచేసిన తరువాత వారికి కూడా ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందిస్తారు.

జిల్లాలో 226 జూనియర్‌ కళాశాలలున్నాయి. ఇందులో ప్రైవేటు కళాశాలలు 168, ప్రభుత్వ కళాశాలలు 10, జెడ్పీ హైస్కూల్స్‌లో ప్లస్‌ టూ 9, సోషల్‌ వెల్ఫేర్‌ మూడు, కేజీబీవీ మూడు, బీసీ వెల్ఫేర్‌, ఎయిడెడ్‌, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఒక్కో జూనియర్‌ కళాశాల ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ఏడాదికి సుమారు 40 వేల మంది విద్యార్థులు చేరుతుంటారు.


నిప్పుల కొలిమి

నగరంలో ఉదయం నుంచే వడగాడ్పులు

పద్మనాభంలో 41.6 డిగ్రీలు నమోదు

మరో రెండు, మూడు రోజులు గాడ్పులు

విశాఖపట్నం, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి):

ఎండ తీవ్రతకు శుక్రవారం జిల్లా మండిపోయింది. ఈ వేసవిలోనే అత్యంత వేడి వాతావరణం నెలకొంది. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండ చుర్రుమనిపించింది. ఆ తరువాత గంట గంటకూ వేడి పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నానికి నిప్పుల కొలిమిలా మారిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వడగాడ్పులు వీచాయి. బయటకు రావడానికి చాలామంది వెనుకంజ వేశారు. ఇళ్లలో ఉన్నవారు కూడా ఫ్యాన్ల కింద ఉండలేని పరిస్థితి తలెత్తింది. సాయంత్రం మేఘాలు ఆవరించినా కొద్ది సమయంలో మాయమయ్యాయి. రాత్రి పదకొండు గంటలకు కూడా వాతావరణం చల్లబడలేదు. శుక్రవారం పద్మనాభంలో 41.6, పెందుర్తిలో 41.5, విశాఖ రూరల్‌, ఆనందపురం, గోపాలపట్నంలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు, మూడు రోజుల వరకు వడగాడ్పుల ప్రభావం, వేడి వాతావరణం కొనసాగుతాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. మధ్యాహ్న సమయంలో ప్రయాణాలు చేయవద్దని, ఎక్కువగా నీళ్లు, మజ్జిగ తీసుకోవాలని సూచించారు.

Updated Date - Jun 06 , 2026 | 12:51 AM