తెరుచుకున్న ప్రభుత్వ పాఠశాలలు
ABN , Publish Date - Jun 19 , 2026 | 10:35 PM
మండలంలోని ఉపాధ్యాయులు లేక మూతబడిన ఐదు పాఠశాలలు తెరుచుకున్నాయి.
డిప్యూటేషన్‌పై ఉపాధ్యాయుల నియామకం
విద్యా బోధన ప్రారంభం
‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్
గూడెంకొత్తవీధి, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఉపాధ్యాయులు లేక మూతబడిన ఐదు పాఠశాలలు తెరుచుకున్నాయి. పొరుగు పాఠశాలల నుంచి డిప్యూటేషన్‌పై విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులను నియమించడంతో శుక్రవారం విద్యాబోధన ప్రారంభమైంది. మండలంలోని కొండపల్లిపాడు, వలసపల్లి, గూడెం తీములబంద, చిన్న అగ్రహారం, రాసకోట ప్రాథమిక పాఠశాలలకు ఈ ఏడాది ఉపాధ్యాయులను నియమించలేదు. దీంతో పాఠశాల పునఃప్రారంభమై ఏడు రోజులు గడిచినా విద్యాబోధన ప్రారంభంకాలేదు. ప్రతి రోజు విద్యార్థులు ఉపాధ్యాయుల కోసం నిరీక్షించి మధ్యాహ్న భోజనం అనంతరం వెళ్లిపోతున్నారు. విద్యార్థుల విద్యకు దూరం కావడంతో తల్లిదండ్రుల ఆవేదనను వివరిస్తూ శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ ‘చదువుకోవాలని ఉంది సారూ!’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన ఎంఈవో యూఏ నరసింగరావు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. మొండికోట పాఠశాల నుంచి ఉపాధ్యాయుడు సీహెచ్‌ఈబీఎల్ స్వామిని కొండపల్లిపాడుకి, చింతపల్లి క్యాంప్ నుంచి ఎస్. ప్రసాద్‌ని వలసపల్లి పాఠశాలకు, యర్రగెడ్డ నుంచి డీఎన్‌డీ స్వాతిని గూడెంతీములబందకు, కుంకుంపూడి నుంచి ఎన్.విజయగోపాల్‌ని చిన్నఅగ్రహారం, వి.కొత్తపాలెం నుంచి ఉపాధ్యాయుడు ఆర్. శ్రీరామ్‌ని రాసకోటకు డిప్యూటేషన్‌పై బదిలీ చేశారు. ఈమేరకు శుక్రవారం ఐదు పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యాబోధన ప్రారంభించారు. పాఠశాలల్లో విద్యాబోధన ప్రారంభానికి చొరవ తీసుకున్న ‘ఆంధ్రజ్యోతి’కి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.