నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
ABN , Publish Date - May 24 , 2026 | 11:29 PM
జిల్లాలోని 24 కేంద్రాల్లో ఈ నెల 25 నుంచి పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని, అందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ టి.నిషాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
24 కేంద్రాల్లో నిర్వహణ
ఏర్పాట్లు పూర్తి
కలెక్టర్ టి.నిషాంతి
పాడేరు రూరల్, మే 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 24 కేంద్రాల్లో ఈ నెల 25 నుంచి పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని, అందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ టి.నిషాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 158 పాఠశాలల నుంచి 4,341 మంది విద్యార్థినీ, విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. వారిలో 3,941 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 400 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారన్నారు. ఈ పరీక్షలు ఈ నెల 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు అర్ధగంట ముందుగానే చేరాలని, ఎటువంటి ఎలక్ర్టానిక్ వస్తువులను అనుమతించబోమన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఓఎస్‌ఎస్) ఎస్‌ఎస్‌సీ పరీక్షలను జిల్లాలో ఆరు కేంద్రాల్లో ఏర్పాటు చేశామన్నారు. ఏపీఓఎస్‌ఎస్ ఇంటర్మీడియట్ పరీక్షలకు రెండు కేంద్రాలు కేటాయించామని చెప్పారు.