Share News

నేటి నుంచే టెన్త్‌ పరీక్షలు

ABN , Publish Date - Mar 16 , 2026 | 12:11 AM

జిల్లాలో పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి జరగనున్నాయి. జిల్లాలోని 102 పరీక్షా కేంద్రాల్లో జరిగే పరీక్షలకు 20,577 మంది విద్యార్థులు హాజరవుతారని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

నేటి నుంచే టెన్త్‌ పరీక్షలు
కె.కోటపాడు మండలం ఏ.కోడూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బెంచీలపై హాల్‌ టికెట్‌ నంబర్లు వేస్తున్న దృశ్యం

102 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి

పకడ్బందీగా నిర్వహణకు చర్యలు

28 సిట్టింగ్‌, 5 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లతో పర్యవేక్షణ

కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

అనకాపల్లి రూరల్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి జరగనున్నాయి. జిల్లాలోని 102 పరీక్షా కేంద్రాల్లో జరిగే పరీక్షలకు 20,577 మంది విద్యార్థులు హాజరవుతారని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

పదవ తరగతి వార్షిక పరీక్షలకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థుల కోసం పరీక్షా కేంద్రాల బయట హాల్‌ టికెట్ల నంబర్ల బోర్డును ఏర్పాటు చేశారు. అలాగే కేంద్రాల్లోని తరగతి గదుల్లో బెంచీలపై హాల్‌ టికెట్ల నంబర్లు వేయించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బదులు లేకుండా అన్ని వసతులు కల్పించారు. కాగా ప్రభుత్వ పాఠశాలల నుంచి 14,309 మంది, ప్రైవేట్‌ పాఠశాలల నుంచి 6,268 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు 28 సిట్టింగ్‌, 5 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లను నియమించారు. అలాగే 1,079 మంది ఇన్విజిలేటర్లు, 58 కస్టోడియన్‌ అధికారులు, 102 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 102 మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులను నియమించారు. విద్యార్థులకు పరీక్షలకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా, సమస్యలు ఎదురైనా సంప్రతించేందుకు జిల్లా స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్లు: 9963299492, 9246666525, 6304444980, 9866095364, 9705143380 అందుబాటులో ఉంచారు.

విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం

అనకాపల్లి టౌన్‌: జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్టు ఆర్టీసీ డీపీటీవో వి.ప్రవీణ తెలిపారు. పల్లె వెలుగు, ఆలా్ట్ర డీలక్స్‌, సిటీ ఆర్డనరీ బస్సుల్లో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునన్నారు. విద్యార్థులు బస్సు కండక్టర్‌కు విధిగా పదవ తరగతి హాల్‌ టికెట్‌ను చూపించాలని ఆమె పేర్కొన్నారు.

Updated Date - Mar 16 , 2026 | 12:11 AM