నేటి నుంచి టెన్త్ పరీక్షలు
ABN , Publish Date - Mar 15 , 2026 | 10:52 PM
ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 14,187 మంది విద్యార్థులు హాజరు
72 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ
8 సమస్యాత్మక పరీక్షా కేంద్రాల గుర్తింపు
ప్రతి కేంద్రం పరిధిలో 144 సెక్షన్ అమలు
పరీక్షల సంబంధ సమస్యలు తెలిపేందుకు సెల్ నంబర్ 9110564541
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆధ్వర్యంలో అధికారులు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలోని 264 పాఠశాలలకు చెందిన 11,988 మంది రెగ్యులర్ విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరవుతారు. అలాగే సార్వత్రిక టెన్త్ విద్యార్థులు 2,199 మందితో కలిపి మొత్తం 14,187 మంది టెన్త్ పరీక్షలకు హాజరవుతారు. ఇందుకు టెన్త్ పరీక్షా కేంద్రాలు 72 కాగా వాటిలో 15 కేంద్రాల్లో సార్వత్రిక విద్యార్థులు పరీక్షలు రాస్తారు. ఈనెల 15నుంచి ప్రారంభమై ఈనెల 29వ తేదీ వరకు పరీక్షలు జరుగుతారు. పరీక్షా పత్రాలను భద్రపరిచేందుకు 22 పోలీస్ స్టేషన్లను పాయింట్‌లుగా అధికారులు గుర్తించారు. సోమవారం నుంచి ఈనెల 29 తేదీ వరకు జరిగే పరీక్షలను పర్యవేక్షించేందుకు 72 మంది చీప్ సూపరింటెండెంట్‌లు, 72 మంది డిపార్టుమెంట్ ఆఫీసర్లు, ఎనిమిది మంది ప్లైయింగ్ స్క్వాడ్‌లు, ప్రతి సెంటర్‌కు ఒక ప్రత్యేకాధికారి, 653 మంది ఇన్విజిలేటర్లను అధికారులు నియమించారు. అలాగే ప్రతి పరీక్షా కేంద్రం పరిధిలో 144 సెక్షన్‌ను అమలులో ఉంటుంది. పరీక్షలకు సంబంధించిన ఎటువంటి సమస్యలున్నా అధికారులకు తెలిపేందుకు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సమస్యలను తెలిపేందుకు సెల్ 9110564541 నంబర్‌కు సంప్రదించాలని విద్యాశాఖాధికారులు తెలిపారు. అలాగే టెన్త్ విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చును. అలాగే జిల్లాలోని టెన్త్ పరీక్షలను జిల్లా విద్యాశాఖాధికారి డి.రామకృష్ణారావు, గిరిజన సంక్షేమ విద్యాశాఖ డీడీ పీబీకే. పరిమిళ, మండల విద్యాశాఖాధికారులు పర్యవేక్షించనున్నారు.
నామమాత్రంగా సీసీ కెమెరాలు ఏర్పాటు
ఉమ్మడి జిల్లాలో పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో నామమాత్రంగానే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాస్తవానికి గతంలో 70 నుంచి 80 శాతం పరీక్షా కేంద్రాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేవారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో గత కొన్నాళ్లుగా పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు విషయంలో అధికారులు పట్టించుకోకుండా మిన్నకుంటున్నారు. గతంలో పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలోనే 25 నుంచి 30 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేవారు. కాని ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మొత్తం 72 కేంద్రాలకు గానూ కేవలం 8 కేంద్రాల్లో మాత్రమే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం గమనార్హం.