టెన్త్ పరీక్షలు ప్రారంభం
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:03 AM
జిల్లాలో పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్షకు రెగ్యులర్ విద్యార్థినీ, విద్యార్థులు 7,268 మంది హాజరు కావాల్సి ఉండగా, 7,215 మంది(99.27 శాతం) హాజరయ్యారు.
99.27 శాతం హాజరు
కుమ్మరిపుట్టు పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
పాడేరురూరల్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదవ తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్షకు రెగ్యులర్ విద్యార్థినీ, విద్యార్థులు 7,268 మంది హాజరు కావాల్సి ఉండగా, 7,215 మంది(99.27 శాతం) హాజరయ్యారు. కుమ్మరిపుట్టు ఏపీఆర్ బాలికల పాఠశాల పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పించిన వసతులపై ప్రధానోపాధ్యాయులు, చీఫ్ సూపరింటెండెంట్‌ను అడిగితెలుసుకున్నారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలకా్ట్రనిక్ వస్తువులపై ఉన్న నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ కె.రామకృష్ణారావును ఆదేశించారు. ఈ తనిఖీల్లో ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్ కె.జానకీరామారావు, డిపార్ట్‌మెంట్ అధికారి ఎం.రాజు పాల్గొన్నారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. జిల్లాలోని 11 మండలాల్లో 44 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. అలాగే జిల్లాలో సార్వత్రిక పరీక్షల నిర్వహణకు ఏర్పాటు చేసిన 10 పరీక్షా కేంద్రాల్లో 870 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 801 మంది హాజరయ్యారు. 69 మంది గైర్హాజరు కావడంతో 92.07 శాతం హాజరు నమోదైంది.