పకడ్బందీగా టెన్త్, ఇంటర్ పరీక్షలు
ABN , Publish Date - Feb 18 , 2026 | 11:25 PM
ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు.
కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు
అధికారులకు కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశం
పాడేరు, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియట్, వచ్చే నెల 16 నుంచి పదవ తరగతి వార్షిక పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఎస్‌పీ అమిత్‌బర్దార్, జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ కె.రామకృష్ణారావులతో కలిసి కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అల్లూరి జిల్లాలో 47 కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులు 7,299 మంది, ప్రైవేటు విద్యార్థులు 505, సార్వత్రిక విద్యార్థులు 1,003 మంది, పోలవరం జిల్లాలో మొత్తం 32 కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులు 4,158 మంది, ప్రైవేటు విద్యార్థులు 26, సార్వత్రిక విద్యార్థులు 414 మంది పదవ తరగతి పరీక్షలకు హాజరవుతారన్నారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇంటర్ రెగ్యులర్ విద్యార్థులు 1,225 మంది, సార్వత్రిక విద్యార్థులు 582 కలిపి.. మొత్తం 1,807 మంది విద్యార్థులు ఇంటర్ వార్షిక పరీక్షల్లో పాల్గొంటారని కలెక్టర్ పేర్కొన్నారు. పోలవరం జిల్లాలో రెగ్యులర్ విద్యార్థులు 800 మంది, సార్వత్రిక విద్యార్థులు 608 మంది.. మొత్తం 1,408 మంది ఇంటర్ వార్షిక పరీక్షలు రాస్తారన్నారు. అలాగే టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద విధిగా 144 సెక్షన్‌ను అమలు చేయాలని, మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చూడాలన్నారు. పరీక్షల నిర్వహణలో ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రశ్న, జవాబు పత్రాల రాకపోకలకు ఎటువంటి సమస్యలు ఏర్పడకుండా పోలీసు బందోబస్తు చేపట్టాలని, పరీక్షా కేంద్రాల్లోనూ నిఘాతో పాటు బందోబస్తు పక్కాగా ఉండాలని కలెక్టర్ సూచించారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాలకు అదనపు భద్రతా ఏర్పాట్లు చేయాలని, అందరి సమన్వయంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, సమగ్ర శిక్ష ఏపీపీ డాక్టర్ ఏవీ స్వామినాయుడు, డీఎస్‌పీ అభిషేక్, పలు శాఖలకు చెందిన జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.