టెన్త్ యాక్షన్ ప్లాన్
ABN , Publish Date - Nov 23 , 2026 | 12:37 AM
వచ్చే మార్చిలో జరగనున్న పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు జిల్లా విద్యాశాఖ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.
సిద్ధమైన వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక
డిసెంబరు ఒకటో తేదీ నుంచి అమలు
ఉదయం నుంచి సాయంత్రం వరకు తరగతులు
రోజువారీ పరీక్షలతో విద్యార్థుల సామర్థ్యం అంచనా
ప్రతి అఽధికారికి ఒక పాఠశాల దత్తత
గణితం, తెలుగు, సాంఘికశాస్త్రంపై ప్రత్యేక ఫోకస్
విశాఖపట్నం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి):
వచ్చే మార్చిలో జరగనున్న పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు జిల్లా విద్యాశాఖ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. వచ్చేనెల ఒకటోతేదీ నుంచి దీనిని అమలుచేయాలని నిర్ణయించింది. గత ఫలితాలను పరిగణనలోకి తీసుకుని మెరుగైన ఫలితాలపై దృష్టిసారించింది. గతంలో విద్యాసంవత్సరం చివర 100 రోజులు ప్రణాళిక అమలుచేసిన విద్యాశాఖ ప్రస్తుత విద్యాసంవత్సరంలో జూలై ఒకటో తేదీ నుంచి నవంబరు 30 వరకు తొలి దశ ప్రణాళికను రూపొందించింది. ఉత్తమ ఫలితాల సాధనకు విద్యాశాఖ మిషన్ మార్చి-2026 అని పేరుపెట్టింది.
జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 111 ఉన్నత పాఠశాలల్లో సుమారు తొమ్మిదివేలమంది విద్యార్థులు చదువుతున్నారు. అన్ని సబ్జెక్టుల ఉపాఽధ్యాయుల కొరత లేకుండా ఈ ఏడాది జూలై ఒకటోతేదీ నుంచి సబ్జెక్టు టీచర్లను సర్దుబాటు చేశారు. మరో 50 మంది అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించారు. ప్రధానోపాధ్యాయులు లేని ఉన్నతపాఠశాలల్లో అదనంగా స్కూలు అసిస్టెంట్లను సర్దుబాటు చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు రెండు ఫార్మేటివ్, ఒక సమ్మేటివ్ పరీక్ష జరిగింది. వాటిలో వచ్చిన మార్కుల ఆధారంగా రైజింగ్, షైనింగ్‌స్టార్స్ అనే రెండు గ్రేడ్లుగా విభజించి చదువులో బాగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ప్రతి సబ్జెక్టులో ప్రతి రోజు పరీక్ష నిర్వహించి విద్యార్థి సామర్థ్యాన్ని మదింపుచేస్తున్నారు. ఇంకా సబ్జెక్టు టీచర్ల సామర్థ్యం గుర్తించి, వారిలో వృత్తిపరమైన మెలకువలు మెరుగుపర్చేలా కార్యక్రమం అమలుచేస్తున్నారు. ఈనెలాఖరుకు సిలబస్ పూర్తవుతుందని విద్యాశాఖ అంచనావేసింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి 100 రోజుల ప్రణాళిక అమలు చేయడానికి ముందు అనుభవజ్ఞులైన సబ్జెక్టు నిపుణులు రూపొందించే మెటీరియల్‌ను ముద్రించి అన్ని పాఠశాలలకు పంపుతారు. సాఫ్ట్ కాపీ కూడా అందిస్తారు.
అధికారులకు దత్తత
జిల్లాలోని ప్రతి అధికారి ఒక ఉన్నత పాఠశాలను దత్తత తీసుకోవాని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశించారు. ఇందులో భాగంగా ఆయా పాఠశాలల పదోతరగతి విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకోవాలనేది ఉద్దేశం. వీరంతా డిగ్రీ, పీజీలో చదివిన సబ్జెక్టుల మేరకు విద్యార్థులకు వారానికి కనీసం రెండు సార్లు పాఠాలను బోధించాల్సి ఉంటుంది. దీనివల్ల పాఠశాలల్లో హెచ్ఎం నుంచి టీచర్ల వరకు ప్రతి ఒక్కరు విద్యార్థుల చదువుపై మరింత శ్రద్ధపెడతారనేది విద్యాశాఖ అంచనా. మిషన్ మార్చి 2026 లో భాగంగా పదో తరగతి పరీక్షల కోసం కేజీబీవీ కార్యదర్శి దేవానందరెడ్డి జిల్లా ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. ఆయన రెండు ఉన్నత పాఠశాలలను దత్తత తీసుకున్నారు. ఆర్జేడీ విజయభాస్కర్ రెండు, డీఈవో ఎన్. ప్రేమకుమార్, సమగ్రశిక్ష ఏపీసీ ఐదేసి పాఠశాలలు, డిప్యూటీ డీఈవో సోమేశ్వరరావు పది పాఠశాలలను దత్తత తీసుకున్నారు. ప్రతి మండలంలో ఇద్దరు ఎంఈవోలు చెరో సగం పాఠశాలలను పర్యవేక్షించి, నిత్యం సమీక్షించాలని విద్యాశాఖ సూచించింది. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో ప్రదర్శించిన సామర్థ్యం పరిశీలించగా ఎక్కువ మంది గణితం, తెలుగు, సోషల్ స్టడీస్‌లో వెనుకబడి ఉన్నారని తేలింది. తెలుగులో ప్రావీణ్యం మెరుగుపడేందుకు ప్రతి రోజు విద్యార్థి రెండు పేజీలు తెలుగులో చదవడం, రాయడం చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. డిసెంబరు ఒకటోతేదీ నుంచి ప్రతి రోజు అదనపు తరగతులు నిర్వహించనున్నారు.
ఉత్తమ ఫలితాలపై ఫోకస్
విద్యాశాఖ రూపొందించిన మిషన్ మార్చి-2026 అమల్లో భాగంగా పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం. ఈ విద్యాసంవత్సరంలో ఇప్పటి వరకు నిర్వహించిన మూడు పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను గ్రేడ్లుగా విభజించాం. డిసెంబరు 1 నుంచి 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠ్యాంశాలు బోధించి, పరీక్షలు నిర్వహిస్తాం. సాయంత్రంలోగా అల్పాహారం అందించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. నగరంలో విద్యార్థుల హాజరు తక్కువగా ఉండడంతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాయి. స్టడీ మెటీరియల్ అందిస్తాం. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా, డివిజన్, మండల అధికారులు ఉన్నత పాఠశాలలను దత్తత తీసుకోనున్నారు. గత ఏడాది కంటే ఉత్తమ ఫలితాలు సాధనే సన్నద్ధంచేస్తున్నాం.
- నిమ్మక ప్రేమకుమార్, జిల్లా విద్యాశాఖాధికారి
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు
విశాఖపట్నం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దుచేశామని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ తెలిపారు. స్థానిక ఎన్నికల బందోబస్తు, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించాల్సి ఉండడంతో పోలీస్ కమిషనరేట్, జీవీఎంసీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్ ఎన్నిక కారణంగా జీవీఎంసీలో పీజీఆర్ఎస్ను రద్దుచేసినట్టు జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చి వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.