Share News

రాజ్‌మా విత్తనాల మార్పిడిపై టెన్షన్‌

ABN , Publish Date - Jun 29 , 2026 | 12:23 AM

Tension over Rajma seed exchange

రాజ్‌మా విత్తనాల మార్పిడిపై టెన్షన్‌
చింతపల్లి రెడ్‌ రకం విత్తనాలు

28సీటీపీ1:

- ఈ ఏడాది శత శాతం రాయితీపై ఉత్తర భారతీయ రాజ్‌మా విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు

- చర్యలు చేపట్టిన వ్యవసాయ శాఖ

- ఈ ప్రాంతానికి అనుకూలమా?, కాదా? అని పరిశోధనలు చేయకుండా నిర్ణయం

- ఎన్నో ఏళ్లుగా చింతపల్లి రెడ్‌, వైట్‌ రకాల వినియోగం

- తాజా పరిస్థితులపై ఆదివాసీ రైతుల్లో ఆందోళన

గూడెంకొత్తవీధి/చింతపల్లి, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ ఏడాది ఉత్తర భారతీయ రాజ్‌మా విత్తనాలను శత శాతం రాయితీపై పంపిణీ చేయాలని వ్యవసాయశాఖ నిర్ణయించడంపై రైతుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గిరిజన ప్రాంతానికి ఆ విత్తనాలు అనుకూలమా?, కాదా? అనే దానిపై వ్యవసాయ పరిశోధన స్థానంలో ఎటువంటి పరిశోధనలు చేయకుండా ఆదివాసీ రైతులకు అందిస్తే ఏ మేరకు ఫలితాలు వస్తాయనేది ప్రశ్నార్థకంగా ఉంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి రైతులు చింతపల్లి రెడ్‌, వైట్‌(జమ్మూకశ్మీర్‌) రకాలను సాగు చేస్తున్నారు. అయితే ఏపీ సీడ్స్‌ అధికారులు ఈ ఏడాది ఉత్తర భారతీయ రకాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండడంపై ఆదివాసీ రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

దక్షిణ భారతదేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో మాత్రమే రాజ్‌మా పండుతుంది. ఆదివాసీ రైతులు 45 ఏళ్లగా రాజ్‌మా పంటను సంప్రదాయేతర వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. 12 ఏళ్ల క్రితం వరకు ఆదివాసీ రైతులు సుమారు 45 వేల హెక్టార్లలో రాజ్‌మాను సాగు చేసేవారు. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల కారణంగా కాలక్రమేణా గిరిజన ప్రాంతంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. గత ప్రభుత్వం రాజ్‌మా పంటకు సరైన ప్రోత్సాహం అందించకపోవడం వల్ల గిరిజన ప్రాంతంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. 2024-25లో పాడేరు డివిజన్‌ పరిధిలో కేవలం పది వేల ఎకరాల్లో మాత్రమే రాజ్‌మా సాగు చేశారు. 2025-26 వార్షిక సంవత్సరంలో సాధారణ సాగు విస్తీర్ణం 20,600 ఎకరాలు కాగా, తొలిసారిగా గరిష్ఠంగా 45,875 ఎకరాల్లో రాజ్‌మా సాగు చేపట్టారు. చింతపల్లి సబ్‌ డివిజన్‌ పరిధిలోనే అత్యధికంగా 16,456 ఎకరాల్లో రైతులు రాజ్‌మా పంట పండించారు. దీంతో ఒకేసారి 94 శాతం సాగు విస్తీర్ణం పెరిగింది.

గత ఏడాది అధిక దిగుబడి

గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులకు కూటమి ప్రభుత్వం గత ఏడాది 90 శాతం రాయితీపై నాణ్యమైన చింతపల్లి రెడ్‌, చింతపల్లి వైట్‌ రకాల విత్తనాలను పంపిణీ చేసింది. గిరిజన ప్రాంతంలో ప్రభుత్వం గంజాయికి ప్రత్యామ్నాయంగా రాజ్‌మా సాగును ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ప్రప్రథమంగా విత్తనశుద్ధి, జీవన ఎరువులను రాయితీపై అందజేసింది. ప్రభుత్వం పంపిణీ చేసిన విత్తనాలను రైతులు ట్రైకోడెమ్మవిరిడితో విత్తనశుద్ది చేసుకుని నాట్లు వేసుకున్నారు. దీంతో విత్తనాల్లో మొలకెత్తేశాతం భారీగా పెరిగింది. అలాగే తెగుళ్లను నియంత్రించేందుకు 90 శాతం రాయితీపై వేప నూనె(నీమ్‌ఆయిల్‌) అందజేసింది. ప్రభుత్వం పంపిణీ చేసిన జీవన నియంత్రణ ఎరువులు పంటలకు పెట్టుకోవడం వల్ల మొక్కలకు అవసరమైన నత్రజని, భాస్వరం, పొటాష్‌ పూర్తి స్థాయిలో అందింది. గతంలో ఆదివాసీ రైతులు రాజ్‌మా ఎకరానికి కేవలం 2.4 క్వింటాళ్ల దిగుబడికి మించి పొందలేదు. గత ఏడాది వ్యవసాయశాఖ చేపట్టిన వినూత్న ప్రయత్నం వల్ల రైతులు 4.8 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. జీకే వీధి, చింతపల్లి మండలాల్లో కొంత మంది రైతులు 5.3 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. రైతులు పండించిన రాజ్‌మా గింజలకు మార్కెట్‌లో కిలోకి రూ.80-100 గరిష్ఠ ధర లభించింది.

ఉత్తర భారతీయ రకాల ప్రయోగం ఫలించేనా?

ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఉత్తర భారతీయ రాజ్‌మా రకాలను గిరిజన రైతులకు ఏపీ సీడ్స్‌ ద్వారా వేల్యూ చెయిన్‌ క్లస్టర్‌ (వీసీసీ) పథకం కింద పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రాజ్‌మా విత్తనాలు సరఫరా చేసేందుకు టెండర్లు పిలిచింది. వ్యవసాయశాఖ ప్రయోగాత్మకంగా ఉత్తర భారతీయ రకాలను నేరుగా రైతులు పంపిణీ చేయడం వల్ల ఏ మేరకు ఫలితాలు వస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో 2016లో కాన్పూర్‌, హిమాచల్‌ప్రదేశ్‌ జాతీయ అపరాల పరిశోధన సంస్థ నుంచి ఆరు రకాలను దిగుమతి చేసుకుని పరిశోధనలు ప్రారంభించారు. ఈ ఆరు రకాల్లో ఉత్కర్స్‌, అరుణ్‌ రకాలు ఈ ప్రాంతానికి మెరుగైన ఫలితాలు ఇస్తున్నాయని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధారించినా నేటికి ఉత్తమ రకాలను విడుదల చేయలేదు. గిరిజన ప్రాంత వాతావరణం భిన్నంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఏపీ సీడ్స్‌ అధికారులు ఉత్తర భారతీయ రకాలను దిగుమతి చేసుకుని పరిశోధనలు నిర్వహించకుండా రైతులకు పంపిణీ చేయడం వల్ల మొలకెత్తే శాతం తగ్గి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అభ్యుదయ రైతులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం గతానికి భిన్నంగా ఈ ఏడాది శతశాతం రాయితీపై రాజ్‌మా విత్తనాల పంపిణీకి చర్యలు ప్రారంభించింది. ఇప్పటికైనా ఏపీ సీడ్స్‌, వ్యవసాయ అధికారులు ఉత్తర భారతీయ రకాల పంపిణీపై పునరాలోచించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Jun 29 , 2026 | 12:23 AM