Share News

ఐటీడీఏ వద్ద ఉద్రిక్తత

ABN , Publish Date - Aug 27 , 2026 | 12:32 AM

ఐటీడీఏ కార్యాలయం వద్ద బుధవారం సాయంత్రం మారికవలస ఏపీ గిరిజన గురుకులం పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఐటీడీఏ వద్ద ఉద్రిక్తత
ఐటీడీఏ కార్యాలయం ఎదుట రోడ్డుపై నిద్రించి నిరసన తెలుపుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు

తల్లిదండ్రులతో కలిసి మారికవలస విద్యార్థుల ఆందోళన

గేటు బయట రోడ్డుపై నిద్రించి నిరసన

పాడేరురూరల్‌, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): ఐటీడీఏ కార్యాలయం వద్ద బుధవారం సాయంత్రం మారికవలస ఏపీ గిరిజన గురుకులం పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆ పాఠశాల యాజమాన్యం ప్రత్యేక బస్సులో విద్యార్థులను పాడేరుకు తరలించడంతో వివిధ సంఘాలతో కలిసి వారు ఆందోళన చేశారు. మారికవలసలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేయడంతో అక్కడ 5, 6, 7 తరగతులు చదువుతున్న విద్యార్థులను వేరే పాఠశాలలకు తరలించాలని విద్యాశాఖాధికారులు నిర్ణయంతో ఐటీడీఏ కార్యాలయం ఎదుట టెంట్‌ వేసి గత పదిహేను రోజులుగా విద్యార్థుల తల్లిదండ్రులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో బుధవారం మారికవలసలో చదువుతున్న 38 మంది విద్యార్థులను బస్సులో వెనక్కి పంపిస్తున్నట్టు తెలుసుకున్న వారి తల్లిదండ్రులు కిండంగి పంచాయతీ నక్కలపుట్టు గ్రామ సమీపంలో బస్సును ఆపి వారిని కిందకు దించి వివిధ ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించారు. ఐటీడీఏ వద్ద వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వారి వద్దకు ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ వచ్చి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని, గురుకులం అధికారులతో మాట్లాడతామని నచ్చజెప్పినప్పటికి ఫలితం లేకపోయింది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు గేటు ఎదుట రోడ్డుపై నిద్రించి నిరసన తెలుపుతున్నారు. తమ సమస్య పరిష్కరించే వరకు ఇక్కడ నుంచి వెళ్లబోమని, రాత్రి ఇక్కడే నిద్రిస్తామని వారు వెల్లడించారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు వివిధ సంఘాల నాయకులు రాధాకృష్ణ, అప్పలనర్స, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ ఎస్‌.రామారావు ఆధ్వర్యంలో పోలీసులు ఐటీడీఏ వద్ద భారీగా మోహరించారు.

Updated Date - Aug 27 , 2026 | 12:32 AM