Share News

టెండర్‌...వండర్‌

ABN , Publish Date - May 27 , 2026 | 12:42 AM

జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం అధికారుల నిర్లక్ష్యం, అవినీతికి సంబంధించిన ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

టెండర్‌...వండర్‌

వారం రోజుల్లో ముగియనున్న క్రీడా శిబిరాలు

నీటి సరఫరాకు రూ.75 లక్షల అంచనా వ్యయంతో

ఇప్పుడు టెండర్లు పిలిచిన జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం

టెండర్‌ ఖరారై కాంట్రాక్టర్‌ పని ప్రారంభించేసరికి శిబిరాలు ముగిసిపోయే అవకాశం

...అయినప్పటికీ కాంట్రాక్టర్లను అడ్డంపెట్టుకుని నిధులు దోచుకోవడానికే ఈ తతంగం నడుపుతున్నారనే ఆరోపణలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం అధికారుల నిర్లక్ష్యం, అవినీతికి సంబంధించిన ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వారం రోజుల్లో ముగియనున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు తాగునీటి సరఫరా కోసమంటూ దాదాపు రూ.75 లక్షల అంచనా వ్యయంతో అధికారులు ఇప్పుడు షార్ట్‌ టెండర్లు పిలవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టెండరు ప్రక్రియ పూర్తయి ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌ నీటి సరఫరా ప్రారంభించేసరికి శిబిరాలు ముగిసిపోతాయి. అలాంటప్పుడు ఈ తతంగం ఎవరికోసం నడుపుతున్నారో తేలాలి.

నగర పరిధిలో ఆరేళ్ల నుంచి పదహారేళ్ల చిన్నారులకు జీవీఎంసీ ఆధ్వర్యంలో ఏటా వేసవి క్రీడాశిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈనెల 24 నుంచి పది రోజులపాటు 486 ప్రాంతాల్లో 41 క్రీడాంశాల్లో శిక్షణ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈనెల 24న స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంతోపాటు అనకాపల్లిలోని రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియంలో జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ శిబిరాలను ప్రారంభించారు. శిబిరాలకు హాజరయ్యే క్రీడాకారులతోపాటు కోచ్‌లకు తాగునీరు సరఫరా చేసేందుకు పది జోన్‌ల పరిధిలో దాదాపు రూ.75 లక్షల అంచనా వ్యయంతో ఈనెల 24న నీటి సరఫరా విభాగం అధికారులు షార్ట్‌ టెండర్‌లు పిలిచారు. టెండర్‌ దాఖలుకు 26 వరకు గడువు ఇచ్చారు. మరో వారం రోజుల్లో ఇవి ముగియనున్నాయి. ఈలోగా ఆ టెండర్లను ఎప్పుడు తెరుస్తారు?, టెక్నికల్‌ బిడ్‌, ఫైనాన్స్‌ బిడ్‌ల పరిశీలన ఎప్పుడు చేస్తారు?, ఎంపికైన కాంట్రాక్టర్‌తో ఎప్పుడు అగ్రిమెంట్‌ చేసుకుంటారు?, సదరు కాంట్రాక్టర్లు ఎప్పటి నుంచి నీటి సరఫరా ప్రారంభిస్తారనే ప్రశ్నలకు అధికారులే సమాధానం చెప్పలేకపోతున్నారు. టెండర్‌ ప్రక్రియ పూర్తయి కాంట్రాక్టర్‌ నీటి సరఫరా ప్రారంభించేసరికి సగం రోజులు గడిచిపోతాయి. అలాంటప్పుడు ఎందుకు టెండర్లు పిలిచారనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జీవీఎంసీ నిధులను అస్మదీయులకు కట్టబెట్టేఎత్తుగడేనా?

క్రీడా శిబిరాల నిర్వహణకు సంబంధించిన సన్నాహాక సమావేశాన్ని కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఈనెల 20న నిర్వహించారు. ఆ సమావేశంలోనే తాగునీటి సరఫరాకు షార్ట్‌ టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. అయితే నీటి సరఫరా విభాగంలోని కొందరు అధికారులు కావాలనే తాత్సారం చేసి, ఈనెల 24న ఈ-ప్రొక్యూర్‌మెంట్‌లో అప్‌లోడ్‌ చేశారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. టెండర్‌ అప్‌లోడ్‌ చేసిన రోజు, దాఖలుకు చివరిరోజు పోతే మధ్యలో ఒకరోజు మాత్రమే ఉంటుందని, కాంట్రాక్టర్లందరికీ ఆ సమాచారం తెలిసే అవకాశం ఉండదు కాబట్టి...తమ బంధువులు, అస్మదీయులైన కాంట్రాక్టర్లతో బిడ్లు వేయించి, తూతూమంత్రంగా నాలుగైదు రోజులు నీటి సరఫరా చేయించి బిల్లులు చేసుకోవచ్చుననే ఉద్దేశంతోనే అధికారులు ఈ ప్రక్రియను ఆలస్యం చేశారని అంటున్నారు. దీనిపై జీవీఎంసీ కమిషనర్‌, చీఫ్‌ ఇంజనీర్‌ దృష్టిసారించి తాగునీటి సరఫరా పేరుతో జీవీఎంసీ నిధులు స్వాహా చేయాలనుకునేవారికి చెక్‌ చెప్పాలని కోరుతున్నారు.


త్వరలో మెకానికల్‌ విభాగం ప్రక్షాళన

అవుట్‌సోర్సింగ్‌ సూపర్‌వైజర్ల బదిలీకి రంగం సిద్ధం

ప్రతిజోన్‌కు అదనంగా మరో ఏఈ...

‘ఆంధ్రజ్యోతి’ ఎఫెక్ట్‌

విశాఖపట్నం, మే 26 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ మెకానికల్‌ విభాగాన్ని ప్రక్షాళన చేయడంపై చీఫ్‌ ఇంజనీర్‌ సత్యనారాయణరాజు దృష్టిసారించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అవుట్‌ సోర్సింగ్‌ సూపర్‌వైజర్‌తోపాటు ఆ విభాగంలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ బదిలీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలను తనకు అందజేయాలని మెకానికల్‌ విభాగం ఎస్‌ఈ రాయల్‌బాబును మంగళవారం ఆదేశించారు. జీవీఎంసీ వాహనాలకు పెట్రోల్‌, డీజిల్‌ కేటాయింపు, కాంట్రాక్టర్‌లకు బిల్లుల చెల్లింపు వ్యవహారంలో అవుట్‌సోర్సింగ్‌ సూపర్‌వైజర్‌ ఒకరు పాల్పడుతున్న అక్రమాలపై ‘మహా దోపిడీ’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఇలాంటి వ్యవహారాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని చీఫ్‌ ఇంజనీర్‌ సత్యనారాయణరాజును ఆదేశించినట్టు సమాచారం. కమిషనర్‌ ఆదేశాల మేరకు మెకానికల్‌ విభాగంలో అవినీతిపై ఎస్‌ఈ రాయల్‌బాబును ఆరా తీయగా, అవుట్‌సోర్సింగ్‌ సూపర్‌వైజర్‌పై ఆరోపణలు వాస్తవమేనని చెప్పడంతో అతనితోపాటు ఐదేళ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ బదిలీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు 19 మంది ఉద్యోగుల బదిలీకి ఎస్‌ఈ రాయల్‌బాబు ప్రతిపాదనలు అందజేసినట్టు తెలిసింది. అలాగే మెకానికల్‌ విభాగంలో అవినీతికి ఆస్కారం లేకుండా ఒక్కో జోన్‌కు ఇప్పుడున్న ఏఈకి అదనంగా మరొక ఏఈకి బాధ్యతలు అప్పగిస్తే ఫలితం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు అదనంగా పది మంది ఏఈలను నియమించేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.

Updated Date - May 27 , 2026 | 12:42 AM