ఇసుక సరఫరాకు టెండర్లు
ABN , Publish Date - Feb 26 , 2026 | 01:15 AM
సెంటు భూమిలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక సరఫరా కోసం ఓపెన్ టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. నగర శివారు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు గోదావరి, వంశధార, నాగావళి నుంచి ఇసుక సరఫరా చేసేందుకు గతంలో కాంట్రాక్టర్లను ఖరారు చేశారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు హౌసింగ్ అధికారుల నిర్ణయం
పేదల ఇళ్ల నిర్మాణం కోసం
ప్రస్తుతం ఇటు శ్రీకాకుళం, అటు రాజమండ్రి నుంచి తరలింపు
టన్నుకు రూ.800 నుంచి రూ.1,200 చెల్లింపు
ఇసుక ధర తగ్గడంతో
పాత రవాణాదారుల కాంట్రాక్టు రద్దు
విశాఖపట్నం, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి):
సెంటు భూమిలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక సరఫరా కోసం ఓపెన్ టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. నగర శివారు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు గోదావరి, వంశధార, నాగావళి నుంచి ఇసుక సరఫరా చేసేందుకు గతంలో కాంట్రాక్టర్లను ఖరారు చేశారు. ప్రస్తుతం గోదావరి నుంచి ఇసుక లేవుట్‌కు తీసుకురావడానికి టన్నుకు రూ.1000 నుంచి రూ.1,200, శ్రీకాకుళం జిల్లా నుంచి రవాణా చేసేందుకు రూ.800 నుంచి రూ.900 వరకు చెల్లిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక కోసం గనుల శాఖ కూపన్లు జారీ చేస్తుంది. ఆ కూపన్లు తీసుకుని నదుల్లోని రీచ్‌లకు వెళ్లి అక్కడ నుంచి ఇసుకను ఆయా లేఅవుట్‌లకు తరలించాలి. అయితే గోదావరి ఇసుక పేరుతో అనకాపల్లి జిల్లాలో నదుల నుంచి కొంత రవాణా చేసేవారనే విమర్శలు ఉన్నాయి. గత ఏడాదితో పోల్చితే బహిరంగ మార్కెట్‌లో ఇసుక ధర తగ్గింది. దీంతో గతంలో కుదిరిన ఒప్పందాలను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవాలని కలెక్టర్ హరేంధిరప్రసాద్ నిర్ణయించారు. హౌసింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఇసుక సరఫరాదారుల ఎంపికకు కొత్తగా టెండర్లు పిలవాలని సూచించారు. రీచ్‌ల వద్ద టన్ను ఇసుక రూ.200కు లభ్యమవుతుంది. రీచ్ నుంచి జిల్లాలో ఏ లేవుట్‌కైనా సరఫరాకు టన్నుకు రూ. 400 ఖర్చవుతుంది. ఈ లెక్కన టన్నుకు రూ.600లు అవుతుందని హౌసింగ్ అధికారులు లెక్కలు వేస్తున్నారు. విశాఖ జిల్లాలో ఇళ్లనిర్మాణాలు పూర్తి చేయడానికి లక్ష టన్నుల ఇసుక అవసరమని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం లేఅవుట్‌లలో ఉన్న ఇసుక నిల్వలను గుర్తించే పనిలో క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఇసుక సరఫరాకు టెండర్లు పిలుస్తామని హౌసింగ్ పీడీ సత్తిబాబు తెలిపారు. మార్కెట్‌లో రేట్లు తగ్గిన నేపథ్యంలో ఇళ్ల నిర్మాణాలపై కొంత మేర భారం తగ్గుతుందన్నారు.