Share News

ఆలయ మాన్యానికి టెండర్‌?

ABN , Publish Date - Feb 25 , 2026 | 01:13 AM

ఆలయాల మాన్యాలకు రక్షణ లేకుండా పోతున్నది. దేవాలయాల్లో నిత్య ధూప దీప నైవేద్యాల కోసం పూర్వకాలంలో దాతలు ఇచ్చిన భూములను కొంతమంది స్వార్థపరులు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై కైంకర్యం చేస్తున్నారు. అనకాపల్లి పట్టణంలో గల ఆలయ (విశాఖపట్నం కన్యకాపరమేశ్వరి దేవస్థానం) భూమిని ప్రైవేటు వ్యక్తికి చెందినదిగా పేర్కొంటూ నెల రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. సుమారు పది కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమికి సంబంఽధించి పూర్వాపరాలిలా ఉన్నాయి.

ఆలయ మాన్యానికి టెండర్‌?
అనకాపల్లి మార్కెట్‌ యార్డుకు ఆనుకొని వున్న దేవదాయ శాఖకు చెందిన భూమి ఇదే

అనకాపల్లిలో రూ.10 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు యత్నాలు

పావులు కదిపిన విశాఖ రియల్టర్‌

భూమి వారసులంటూ తెరపైకి ఉమ్మలాడ మహిళ

రెవెన్యూ శాఖకు దరఖాస్తు

అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రచారం

ఆ భూమి 22ఏలో నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చామన్న కలెక్టర్‌

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

ఆలయాల మాన్యాలకు రక్షణ లేకుండా పోతున్నది. దేవాలయాల్లో నిత్య ధూప దీప నైవేద్యాల కోసం పూర్వకాలంలో దాతలు ఇచ్చిన భూములను కొంతమంది స్వార్థపరులు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై కైంకర్యం చేస్తున్నారు. అనకాపల్లి పట్టణంలో గల ఆలయ (విశాఖపట్నం కన్యకాపరమేశ్వరి దేవస్థానం) భూమిని ప్రైవేటు వ్యక్తికి చెందినదిగా పేర్కొంటూ నెల రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. సుమారు పది కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూమికి సంబంఽధించి పూర్వాపరాలిలా ఉన్నాయి.

అనకాపల్లి పట్టణానికి చెందిన దూరి కామమ్మ అనే మహిళకు చిననాలుగు రోడ్ల కూడలి వద్ద సర్వే నంబరు 1539-5లో 2.49 ఎకరాల భూమి ఉంది. సుమారు మూడు దశాబ్దాల క్రితం ఆ భూమిని విశాఖపట్నంలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం తరపున సత్రం నిర్మాణం కోసం దానంగా ఇచ్చారు. వెంటనే దేవదాయ శాఖ అధికారులు ఆ భూమిని 22ఏ (1సీ)లో (నిషేధిత భూముల జాబితా) నమోదు చేయించారు. ఆ భూమిలో 1.38 ఎకరాలను ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డు విస్తరణ కోసం ప్రభుత్వం తీసుకొంది. కన్యకాపరమేశ్వరి ఆలయానికి ఎకరా 11 సెంట్లు మాత్రమే మిగిలింది. అయితే ఈ భూమిపై విశాఖకు చెందిన ఒక రియల్టర్‌ కన్ను పడింది. సుమారు పదేళ్ల క్రితం మునగపాక మండలం ఉమ్మలాడకు చెందిన కాండ్రేగుల చినతల్లిని రంగంలోకి దించారు. తాము దూరి కామమ్మ వారసులమని, ఆ భూమి తమకు అప్పగించాలంటూ రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేయించారు. అయితే ఈ భూమి దేవదాయ శాఖకు చెందిన 22ఏ (1సీ) రికార్డుల్లో నమోదై ఉండడంతో రెవెన్యూ అధికారులు దరఖాస్తును తిరస్కరించారు. ఇదే సమయంలో దేవదాయ శాఖ అధికారులు 2017లో కోర్టును ఆశ్రయించి, సదరు భూమి వద్ద ‘ఇది కన్యకాపరమేశ్వరి దేవస్థానానికి చెందిన భూమి’ అని బోర్డు ఏర్పాటుచేశారు.

విశాఖకు చెందిన అదే రియల్టర్‌ తెరవెనుక ఉండి ఇటీవల కాలంలో మళ్లీ తన ప్రయత్నాలు ప్రారంభించారు. సర్వే నంబరు 1539-5లోని ఎకరా 11 సెంట్ల భూమి అప్పగించాలని గత ఏడాది చినతల్లి చేత రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేయించారు. ఆ తరువాత రియల్టర్‌, రెవెన్యూ శాఖలో పావులు కదిపారు. సర్వే నంబరు 1539-5లోని ఎకరా 11 సెంట్ల భూమిని 22ఏ (1సీ) నుంచి తప్పించి, దూరి కామమ్మ వారసురాలిగా చెబుతున్న కాండ్రేగుల చినతల్లి పేరున రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసినట్టు, ఈ ఏడాది జనవరి 20న అది జిరాయితీగా పేర్కొంటూ రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న విశాఖలోని కన్యకాపరమేశ్వరి ఆలయ అధికారులు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం బహిర్గతమైంది.

ఆ భూమి మొత్తం 22 ఏలోనే..

కలెక్టర్‌ విజయకృష్ణన్‌

ప్రభుత్వ భూములు తమవిగా పేర్కొంటూ ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తరువాతే రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేస్తారు. దేవదాయ శాఖ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే అవకాశం లేదు. అటువంటి ప్రయత్నాలు జరగుతున్నాయని వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. సర్వే నంబరు 1539/5లోని రెండు ఎకరాల 49 సెంట్ల భూమిని 22ఏలో నమోదు చేయాలని కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Feb 25 , 2026 | 01:13 AM