చెరువు మట్టికి టెండర్
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:45 AM
మండలంలోని పలు గ్రామాల్లో మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతున్నది. పల్లంగా ఉన్న పంట పొలాలను మెరక చేసుకునే మాటున చెరువుల్లో నుంచి యంత్రాలతో మట్టిని తవ్వి, ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో లక్షలాది రూపాయలను అక్రమంగా ఆర్జిస్తున్నారు.
పొలాల అవసరాల పేరుతో తవ్వకాలు
ఖాళీ స్థలాలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు
భారీగా సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు
పట్టించుకోని రెవెన్యూ, జలవనరుల అధికారులు
సబ్బవరం, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల్లో మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతున్నది. పల్లంగా ఉన్న పంట పొలాలను మెరక చేసుకునే మాటున చెరువుల్లో నుంచి యంత్రాలతో మట్టిని తవ్వి, ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో లక్షలాది రూపాయలను అక్రమంగా ఆర్జిస్తున్నారు.
సబ్బవరం శివారు ఆదిరెడ్డిపాలెంలో పోతురాజు చెరువు వుంది. ఇటీవల కొంతమంది వ్యక్తులు, తమ పొలాలను ఎత్తు చేసుకుంటామని, పోతురాజు చెరువులో నుంచి మట్టిని తవ్వుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. చెరువుల్లో మట్టి తవ్వి, పొలాలకు తరలించుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించడంతో ఈ మేరకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఒక్కో ఘనపు మీటరు మట్టికి నామమాత్రం రుసుముగా ఒక్క రూపాయి చెల్లిస్తే సరిపోతుంది. ట్రాక్టర్‌లో సుమారు మూడు ఘనపు మీటర్ల మట్టి పడుతుంది. ఈ ప్రకారం ఒక్కో ట్రాక్టర్ మట్టికి రూ.3 చొప్పున చెల్లించారు. ఇంతవరకు బాగానే వున్నప్పటికీ.. మట్టి తవ్వకాలకు అనుమతులు తీసుకున్న వ్యక్తులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఎక్స్‌కవేటర్లతో చెరువుల్లో ఇష్టారాజ్యంగా మట్టి తవ్వుతూ, భారీ డంపర్ లారీలతో రవాణా చేస్తున్నారు. ఈ మట్టిని పొలాలకు కాకుండా ఖాళీ స్థలాలను ఎత్తు చేయడానికి, రియల్ ఎస్టేట్ వెచర్లలో ప్లాట్లను మెరక చేయడానికి తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. మట్టిని తరలిస్తున్న డంపర్ లారీలో మెయిన్ రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తున్నప్పటికీ రెవెన్యూ, జలవనరుల శాఖల అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు అంటున్నారు.