Share News

వజ్రాల కొండకు టెండర్‌

ABN , Publish Date - Jul 22 , 2026 | 12:42 AM

మండలంలోని అసకపల్లి రెవెన్యూ పరిధిలోగల వజ్రాల కొండ కబ్జాదారుల కోరల్లో చిక్కుకుంది. కొంత మంది నేతలకు కాసులు కురుపించే కామధేనువులా మారింది. కొండ చుట్టూ ఉన్న వాలు ప్రాంతాల్లో ఒక పథకం ప్రకారం గ్రావెల్‌ తవ్వేస్తూ, ఆ స్థలాల్లో షెడ్లు వేసి అమ్ముకుంటున్నారు. ఇవన్నీ బహిరంగంగానే కనిపిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

వజ్రాల కొండకు టెండర్‌
నక్కవానిపాలెం- ఎర్రవానిపాలెం మధ్య కొండవాలు ప్రదేశాన్ని చదును చేసి నిర్మించిన రేకుల షెడ్లు

అసకపల్లిలో యథేచ్ఛగా ఆక్రమణలు

తొలుత కొండవాలు ప్రదేశాల్లో గ్రావెల్‌ తవ్వకాలు

అనంతరం సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలుగా విక్రయం

చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు

సబ్బవరం, జూలై 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అసకపల్లి రెవెన్యూ పరిధిలోగల వజ్రాల కొండ కబ్జాదారుల కోరల్లో చిక్కుకుంది. కొంత మంది నేతలకు కాసులు కురుపించే కామధేనువులా మారింది. కొండ చుట్టూ ఉన్న వాలు ప్రాంతాల్లో ఒక పథకం ప్రకారం గ్రావెల్‌ తవ్వేస్తూ, ఆ స్థలాల్లో షెడ్లు వేసి అమ్ముకుంటున్నారు. ఇవన్నీ బహిరంగంగానే కనిపిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

అసకపల్లి రెవెన్యూ పరిధి సర్వే నంబరు-1లో 203.68 ఎకరాల్లో వజ్రాల కొండ ఉంది. ఇది ఒకవైపు సబ్బవరానికి, మరోవైపు అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారికి, ఇంకోవైపు జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి అనుకొని ఉంది. కొండ చుట్టూ నక్కవానిపాలెం, ఎర్రవానిపాలెం, కుమ్మరికాలనీ, సబ్బవరం సాయినగర్‌ కాలనీ, రెండుచోట్ల జగనన్న కాలనీలు ఉన్నాయి. దీంతో ఇక్కడ భూములకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ఇదే అదనుగా భావించిన కొంత మంది స్థానికులు వజ్రాల కొండవాలు ప్రాంతంపై దృష్టి సారించారు. నక్కవానిపాలెం, ఎర్రవానిపాలెం గ్రామాలకు, జగనన్న కాలనీలను అనుకొని వున్న కొండవాలు ప్రాంతాన్ని స్థానిక రైతులు కొంతమంది ఆక్రమించి పశువుల షెడ్లు వేసుకున్నారు. మిగిలిన ప్రాంతంలో అక్రమార్కులు తొలుత గ్రావెల్‌ తవ్వకాలు చేపడుతున్నారు. అది కూడా ఎలాపడితే అలా కాకుండా ఒక క్రమపద్ధతిలో, ఇళ్ల స్థలాల మాదిరిగా తవ్వుతున్నారు. తరువాత నకిలీ పట్టాలు సృష్టించి దర్జాగా విక్రయిస్తున్నారు. ఇక్కడ సెంటు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అమ్ముతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కొంతమంది అక్రమార్కులు ఏకంగా రేకుల షెడ్లు వేసి విక్రయిస్తున్నారు. ఇటీవల సబ్బవరం సాయినగర్‌ కాలనీకి అనుకుని ఉన్న ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో సుమారు 10 సెంట్ల కొండ పోరంబోకును చదును చేసిన ఓ వ్యక్తి.. ఈ స్థలాన్ని రూ.30 లక్షలకు అమ్మినట్టు ప్రచారం జరుగుతున్నది. వజ్రాల కొండ కబ్జాదారుల్లో కూటమి నేతలతోపాటు వైపీసీ నాయకులు కూడా వున్నట్టు స్థానికంగా చెప్పుకుంటున్నారు.

కాగా వజ్రాల కొండ ఆక్రమణల గురించి తహశీల్దారు డి.అరుణ్‌చంద్ర వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. ఈ విషయం తమ దృష్టికి కూడా వచ్చిందని, తరలో సర్వే నిర్వహించి, వజ్రాల కొండ భూముల్లో ఆక్రమణలను తొలగిస్తామని చెప్పారు. అంతేకాక కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Jul 22 , 2026 | 12:44 AM