గంజాయి ముద్దాయికి పదేళ్ల జైలు
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:59 PM
గంజాయి రవాణా కేసులో పట్టుబడిన ముద్దాయికి పదేళ్లు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎం.హరినారాయణ శుక్రవారం తీర్పు చెప్పారని అల్లూరి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఆర్.గౌరీశ్వరరావు తెలిపారు.
రూ.లక్ష జరిమానా
జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఆర్.గౌరీశ్వరరావు
పాడేరురూరల్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణా కేసులో పట్టుబడిన ముద్దాయికి పదేళ్లు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎం.హరినారాయణ శుక్రవారం తీర్పు చెప్పారని అల్లూరి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఆర్.గౌరీశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పాడేరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 2014 మే 30వ తేదీన గంజాయి తరలిస్తూ పట్టుబడిన రాజమండ్రి ప్రాంతానికి చెందిన నాయుడు శ్రీనివాస్(30)కి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధించారన్నారు. ఈ కేసులో 360 కిలోల గంజాయిని అప్పటి ఇన్‌స్పెక్టర్ పి.శ్రీనివాసరావు, ఎస్‌ఐలు డి.గంగాధర్, ఎం.జ్ఞానేశ్వరి బృందం పట్టుకున్నారన్నారు. పక్కా ఆధారాలతో చార్జిషీట్ దాఖలు చేయడంతోపాటు ఫోరెన్సిక్ రిపోర్టులు, సాక్షాధారాలను కోర్టులో పెట్టారన్నారు. ఈ కేసును సమర్థవంతంగా వాదించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీహెచ్.సూర్యనారాయణను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా గౌరీశ్వరరావు మాట్లాడుతూ మాదకద్రవ్యాల రహిత జిల్లాగా అల్లూరి జిల్లాను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కోర్టు మోనటరింగ్ సెల్ సిబ్బంది హెచ్‌సీ ఎంఎం.నాయుడులను పాడేరు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ టీవీవీఎస్‌ఎన్.ఆచారి అభినందించారు.