భోగాపురానికి పది వేల మంది
ABN , Publish Date - Jul 31 , 2026 | 10:41 PM
ప్రతిష్టాత్మకమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా నుంచి 186 బస్సుల్లో పది వేల మంది తరలివెళ్లారు.
186 బస్సుల్లో ఏడు వేల మంది విద్యార్థులు,
మూడు వేల మంది గిరిజనుల తరలింపు
జిల్లాలో అధికారులు, ఉద్యోగులకు డ్యూటీలు
పాడేరు, జూలై 31 (ఆంధ్రజ్యోతి):
ప్రతిష్టాత్మకమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా నుంచి 186 బస్సుల్లో పది వేల మంది తరలివెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడులకు ధింసా ప్రదర్శనతో స్వాగతం పలికేందుకు జిల్లా నుంచే 7 వేల మంది గిరిజన విద్యార్థులను మూడు రోజుల క్రితమే 140 బస్సుల్లో తరలించారు. శుక్రవారం మరో 46 బస్సుల్లో జిల్లాలోని 11 మండలాల నుంచి మూడు వేల మంది గిరిజనులను తరలించారు. జిల్లా నుంచి విద్యార్థులు, జనం తరలింపు ప్రక్రియపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టికి కేంద్రీకరించింది. విమానాశ్రయం ప్రారంభోత్సవంపైనా ‘ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు’ పేరిట ప్రభుత్వ యంత్రాంగం ముమ్మర ప్రచారం చేపట్టింది. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కూడలి వద్ద పెద్ద ఎల్‌ఈడీ స్ర్కీన్ ఏర్పాటు చేసి, గత నాలుగు రోజుల నుంచి భోగాపురం విమానాశ్రయంపై రూపొందించిన వీడియోలను ప్రదర్శిస్తున్నారు. శనివారం విమానాశ్రయం ప్రారంభోత్సవం చేసే దృశ్యాలను సైతం ఈ ఎల్‌ఈడీ స్ర్కీన్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.