విమాన ప్రయాణికులకు తాత్కాలిక లాంజ్‌లు
ABN , Publish Date - Sep 11 , 2026 | 12:51 AM
విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్లే విమాన ప్రయాణికులు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సుల కోసం వేచి ఉండేందుకు రెండు తాత్కాలిక లాంజ్‌లను ఏర్పాటు చేశారు.
విశాఖపట్నం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్లే విమాన ప్రయాణికులు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సుల కోసం వేచి ఉండేందుకు రెండు తాత్కాలిక లాంజ్‌లను ఏర్పాటు చేశారు. నగరంలో ఏడు లాంజ్‌లు నిర్మిస్తామని ప్రకటించిన జీఎంఆర్ యాజమాన్యం చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. బస్టాపుల్లో నిల్చోవడానికి విమాన ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఏపీ విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు నరేశ్‌కుమార్, డీఎస్ వర్మ, కుమార్‌రాజాలు చొరవ తీసుకున్నారు. బీచ్‌రోడ్డులో వీఎంఆర్‌డీఏ పార్కు వద్ద ఉన్న ఏరో ఎక్స్‌ప్రెస్ బస్టాప్ వద్దకు వచ్చే విమాన ప్రయాణికులు అక్కడ గల జీసీసీ కాఫీ షాపులో కూర్చునేలా అధికారులతో మాట్లాడారు. అదేవిధంగా రుషికొండలో సాయిప్రియా రిసార్ట్స్‌లో వేచి ఉండేందుకు అక్కడి యాజమాన్యాన్ని ఒప్పించారు. ఆర్‌టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడుతో కలిసి గురువారం ఆయా ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ ఏ సమయానికి ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు వస్తాయో సూచిస్తూ ప్రత్యేక బోర్డులు కూడా ఏర్పాటు చేయించారు.
వార్డుల పునర్విభజనపై 1,500 అభ్యంతరాలు
పశ్చిమ నియోజకవవర్గం నుంచే 909, తూర్పు నుంచి 400...
నేటితో ముగియనున్న గడువు
విశాఖపట్నం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలు, సలహాలు అందజేసేందుకు శుక్రవారంతో గడువు ముగియనున్నది. వార్డుల సంఖ్యను 98 నుంచి 120కి పెంచుతూ, సరిహద్దులతో కూడిన ముసాయిదాను టౌన్‌ప్లానింగ్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. వాటిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నా, సలహాలు ఏవైనా ఇవ్వాలనుకున్నాసరే శుక్రవారం వరకు అవకాశం కల్పించారు. గురువారం నాటికి 1,500 అభ్యంతరాలు అధికారులకు అందాయి. అందులో 90 శాతానికిపైగా వార్డుల సంఖ్యను 150కి పెంచాలని వచ్చినవే. జీవీఎంసీ అధికారులకు అందిన అభ్యంతరాల్లో అత్యధికంగా పశ్చిమ నియోజకవర్గం నుంచి 909 రాగా, తూర్పు నియోజకవర్గం నుంచి 400 అభ్యంతరాలు అందడం విశేషం. అనకాపల్లి నుంచి ఒక్కటి కూడా అందలేదు. దక్షిణ నియోజకవర్గం నుంచి ఆరు, భీమిలి, మధురవాడ జోన్‌ల నుంచి ఐదేసి చొప్పున వచ్చాయి. శుక్రవారంతో అభ్యంతరాల స్వీకరణ ముగియనున్నది. అదేరోజు అధికారులు వాటన్నింటినీ పరిశీలించి తుది ముసాయిదాను రాష్ట్ర మునిసిపల్ శాఖ డైరెక్టర్‌కు 12న పంపిస్తారు. 13న పరిశీలన పూర్తయితే వార్డుల విభజన ప్రక్రియను ప్రభుత్వం ఆమోదిస్తే 14న గెజిట్ జారీ అవుతుంది.
15 వేల వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ
విశాఖపట్నం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి):
వినాయక చవితిని పురస్కరించుకుని జిల్లాలో 15 వేల మట్టి విగ్రహాల పంపిణీకి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాట్లుచేసింది. ప్రభుత్వ కార్యాలయాలు, రైతుబజార్లలో విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. కలెక్టర్ కార్యాలయంలో సిబ్బందికి జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. కాలుష్య నియంత్రణ మండలి ముద్రించిన పోస్టర్‌ను పీసీబీ ఈఈ పీవీ ముకుందరావు, సెక్షన్ సూపరింటెండెంట్లతో కలిసి జేసీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టితో తయారుచేసిన విగ్రహాలను వినియోగించాలని కోరారు. మట్టి విగ్రహాలను నిమజ్జనంచేస్తే జలాలు కలుషితం కావని పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌లో సిబ్బందికి మట్టి విగ్రహాలను సీఈవో పి.నారాయణమూర్తి పంపిణీ చేశారు.
గాలి నాణ్యత పర్యవేక్షణకు మరో 3 కేంద్రాలు
విశాఖపట్నం పోర్టు నిర్ణయం
అక్కయ్యపాలెం, పాండురంగాపురం,
మల్కాపురం ప్రాంతాల్లో ఏర్పాటు
విశాఖపట్నం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి):
నగరంలో వాయు కాలుష్యం ఢిల్లీ కంటే అధికంగా ఉందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు గాలి నాణ్యతను పరీక్షించి, తగిన చర్యలు చేపట్టేందుకు కొత్తగా మరో మూడు (అక్కయ్యపాలెం, పాండురంగాపురం, మల్కాపురం) ప్రాంతాల్లో కంటిన్యువస్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానటరింగ్ స్టేషన్లు (నిరంతర పరిసర గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు) ఏర్పాటుచేసింది. ఇప్పటికే పోర్టు పరిధిలో మూడు (జనరల్ కార్గో బెర్త్ ఏరియా, పోర్టు అగ్నిమాపకదళం మార్గం, ఆర్ అండ్ డి యార్డ్) స్టేషన్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య ఆరుకు చేరింది. కొత్తగా ఏర్పాటు చేసిన స్టేషన్ల నిర్వహణ బాధ్యతలను, నిరంతర పర్యవేక్షణను పదేళ్లకు ఒక సంస్థకు అప్పగించారు.
ఇవీ ప్రయోజనాలు
- రియల్ టైమ్‌లో ఎప్పటికప్పుడు గాలి నాణ్యత అంటే కాలుష్యాన్ని తెలియజేస్తాయి.
- వాయు కాలుష్యం ఎలా మారుతుందో అధ్యయనం చేయడానికి డేటా అందిస్తాయి.
- పోర్టు అమలు చేస్తున్న కాలుష్య నియంత్రణ చర్యల పనితీరు అంచనాకు ఉపకరిస్తాయి.
- పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యతపై ప్రజలకు అవగాహన ఏర్పడుతుంది.
ఓటు కోసం 11,484 మంది దరఖాస్తు
విశాఖపట్నం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి):
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ (సర్)లో భాగంగా ఓటరుగా నమోదు, తొలగింపు, సవరణకు గురువారం అర్ధరాత్రితో గడువు ముగిసింది. గురువారం సాయంత్రం వరకు 11,484 మంది ఫారం-6 (ఓటర్ల ముసాయిదా జాబితాలో పేర్లు లేనివారు, 18 ఏళ్లు నిండిన యువకులు) దరఖాస్తు చేశారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి 2,778, భీమిలి నుంచి 2,112 మంది, గాజువాక నుంచి 2,086, విశాఖ ఉత్తరం నుంచి 1,385, ‘తూర్పు’ నుంచి 1,325, ‘పశ్చిమ’ నుంచి 988, దక్షిణం నుంచి 810 దరఖాస్తులు అందాయి. అలాగే జాబితా నుంచి తొలగింపునకు (ఫారం-7) 3,086, సవరణల కోసం 8,767 దరఖాస్తులు వచ్చాయి.