తుదిదశకు ఆలయ పనులు
ABN , Publish Date - Feb 21 , 2026 | 01:02 AM
స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు ముగింపు దశకు రావడంతో ప్రారంభోత్సవానికి దేవదాయ శాఖ అధికారులు, ఆలయ పాలకవర్గం సుముహూర్తం నిర్ణయించారు. మార్చి ఎనిమిదో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆదేశాలతో పాలకవర్గం చైర్మన్ పీలా నాగశ్రీను, ఈవో శ్రీధర్ ఆలయంలో మిగిలిన పనులను వేగవంతం చేశారు.
8న నూకాంబిక అమ్మవారి నూతన ఆలయం ప్రారంభం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆహ్వానించాలని ఎమ్మెల్యే, అధికారులు నిర్ణయం
అనకాపల్లి టౌన్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): స్థానిక నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు ముగింపు దశకు రావడంతో ప్రారంభోత్సవానికి దేవదాయ శాఖ అధికారులు, ఆలయ పాలకవర్గం సుముహూర్తం నిర్ణయించారు. మార్చి ఎనిమిదో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆదేశాలతో పాలకవర్గం చైర్మన్ పీలా నాగశ్రీను, ఈవో శ్రీధర్ ఆలయంలో మిగిలిన పనులను వేగవంతం చేశారు.
అనకాపల్లి ప్రజల ఇలవేల్పు అయిన నూకాంబిక ఆమ్మవారి ఆలయాన్ని నిర్మించి దశాబ్దాలు కావడం, మరోవైపు ఏటేటా భక్తులు పెరుగుతుండడంతో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. రద్దీ అధికంగా వున్నప్పుడు భక్తులు ఒకింత అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో ఆలయాన్ని పునర్నిర్మించాలని దేవదాయ శాఖ ఉన్నతాధికారులు భావించారు. సుమారు రూ.11 కోట్ల అంచనా వ్యయంతో రెండున్నర సంవత్సరాల క్రితం పనులకు శ్రీకారం చుట్టారు. అమ్మవారి మూలవిరాట్టును మినహా మిగిలిన ఆలయం మొత్తాన్ని కూల్చివేశారు. భక్తులు దర్శించుకోవడానికి ఆలయ ఆవరణలోని కల్యాణ మండపాన్ని బాలాలయంగా మార్చి అమ్మవారి తాత్కాలిక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ హయాంలో కాంట్రాక్టర్‌కు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఆలయ పునర్నిర్మాణ పనులు మందకొడిగా సాగాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రత్యేక శ్రద్ధ వహించి, పనులను వేగవంతం చేయించారు. ఆలయ జీర్ణోద్ధరణ, పునర్మిర్మాణ పనుల కారణంగా 2023 జూన్ నుంచి అమ్మవారి మూలవిరాట్ దర్శనభాగ్యం లేకపోవడంతో భక్తులు ఒకింత నిరాశ చెందుతున్నారు. దీంతో ఈ ఏడాది కొత్త అమావాస్య ఉత్సవాల ప్రారంభంనాటికి నూతన ఆలయం అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో పనులను వేగవంతం చేశారు. ఆలయం లోపల గచ్చు, క్యూలైన్ల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. విద్యుత్తు, రంగుల పనులు చివరి దశకు చేరాయి.
విశాలంగా ఆలయం
పాత ఆలయం పొడవు 98 అడుగులు, వెడల్పు 60 అడుగులు వుండగా, పునర్నిర్మాణంలో భాగంగా పొడవు 175 అడుగులు, వెడల్పు 94 అడుగులకు విస్తరింపజేశారు. గర్భాలయం పొడవు, వెడల్పు 14 అడుగుల చొప్పున ఉండేవి. పునర్నిర్మాణంలో భాగంగా 18 అడుగులకు పెంచారు. అంతరాలయం పొడవు 12 అడుగులు, వెడల్పు 14 అడుగులకు ఉండగా.. ఇప్పుడు పొడవు 18 అడుగులు, వెడల్పు 15 అడుగులకు విస్తరింపజేశారు. గతంలో అనివెట్టి మండపం పొడవు 27 అడుగులు, వెడల్పు తొమ్మిది అడుగులు ఉండగా, పునర్నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం పొడవు 55 అడుగులు, వెడల్పు 45 అడుగులకు పెరిగింది. సుమారు వంద అడుగుల పైబడి ఎత్తు, తొమ్మిది అంతస్థులతో తూర్పు వైపున రాజగోపురం నిర్మించారు. ఆలయం చుట్టూ మాడవీధులను ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే నెల 17వ తేదీన అమ్మవారి కొత్త అమావాస్య జాతర ప్రారంభం కానున్నది. అంతకన్నా ముందే 8వ తేదీన నూతన ఆలయాన్ని సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభింపజేయాలని ఎమ్మెల్యే కొణతాల, ఆలయ పాలకవర్గం, దేవదాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా డీఎస్పీ ఎం.శ్రావణితోపాటు సీఐలు జిప్రేమ్‌కుమార్, ఎం.వెంకటనారాయణ శుక్రవారం ఆలయానికి వచ్చి పరిశీలించారు. వీరి వెంట ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఈవో శ్రీధర్ ఉన్నారు.