Share News

తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు మన్యంతో అనుబంధం

ABN , Publish Date - Mar 01 , 2026 | 01:25 AM

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులుగా ఉన్న ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు మన్యంతో అనుబంధం ఉంది. వీరు మన్యం వాసులకు సుపరిచితులే. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా శనివారం బాధ్యతలు చేపట్టిన జిసాయిప్రసాద్‌(1991 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి) గతంలో 1993 నుంచి 1995 వరకు పాడేరు సబ్‌కలెక్టర్‌గా పని చేశారు.

తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు   మన్యంతో అనుబంధం
జి.సాయిప్రసాద్‌, ఏపీ సీఎస్‌ కె.రామకృష్ణారావు, తెలంగాణ సీఎస్‌

- 1993 నుంచి 1995 వరకు సబ్‌కలెక్టర్‌గా పని చేసిన జి.సాయిప్రసాద్‌

- పాడేరు ఐటీడీఏ పీవోగా 1997, 98లో పని చేసిన కె.రామకృష్ణారావు

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులుగా ఉన్న ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు మన్యంతో అనుబంధం ఉంది. వీరు మన్యం వాసులకు సుపరిచితులే. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా శనివారం బాధ్యతలు చేపట్టిన జిసాయిప్రసాద్‌(1991 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి) గతంలో 1993 నుంచి 1995 వరకు పాడేరు సబ్‌కలెక్టర్‌గా పని చేశారు. అలాగే సుమారు నాలుగు నెలలు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా ఇన్‌చార్జి బాధ్యతలు చేపట్టారు. తర్వాత శాశ్వత ఐటీడీఏ పీవోగా వచ్చిన సోమేశ్‌కుమార్‌(తెలంగాణ సీఎస్‌గా పని చేసి, ప్రస్తుతం వీఆర్‌ఎస్‌లో ఉన్నారు)తో కలిసి, ఏజెన్సీలో విస్తృతంగా పర్యటించి, గిరిజనులకు చక్కని సేవలందించారు. గతంలో ఇక్కడ సబ్‌ కలెక్టర్‌గా పని చేసిన సాయిప్రసాద్‌, ఇప్పుడు రాష్ట్ర సీఎస్‌ కావడంపై మన్యం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నాడు ఐటీడీఏ పీవో.. ప్రస్తుతం తెలంగాణ సీఎస్‌

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్న 1991 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన కె.రామకృష్ణారావు 1997, 98లో పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా పని చేశారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ఆయన విశేషంగా కృషి చేశారు. ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాల ఏర్పాటు, ప్రతి పీహెచ్‌సీకి అంబులెన్సుల సదుపాయం కల్పించడం, మారుమూల ప్రాంతాల్లో మాబడి పాఠశాలలు ఏర్పాటు చేయడం వంటి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శులుగా ఉన్న ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ఈ ప్రాంతంలో సేవలందించిన వారు కావడం విశేషం.

Updated Date - Mar 01 , 2026 | 01:25 AM