Share News

తెలుగు సెలబ్రిటీ లీగ్‌ సందడి

ABN , Publish Date - Mar 01 , 2026 | 01:31 AM

ఇక్కడి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన తెలుగు సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ (టీసీసీఎల్‌)లో సినీ, టీవీ తారలతోపాటు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, పోలీస్‌ అధికారులు సందడి చేశారు.

తెలుగు సెలబ్రిటీ లీగ్‌ సందడి

పొలిటికల్‌ టీమ్‌పై సినిమా జట్టు గెలుపు

టీవీ కింగ్స్‌పై పోలీస్‌ వారియర్స్‌ విజయం

విశాఖపట్నం-స్పోర్ట్స్‌, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి):

ఇక్కడి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన తెలుగు సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ (టీసీసీఎల్‌)లో సినీ, టీవీ తారలతోపాటు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, పోలీస్‌ అధికారులు సందడి చేశారు. సినీ తారలు టీసీఏ ఎలెవెన్‌గా, టీవీ తారలు టీవీ కింగ్స్‌, టీవీ టైగర్స్‌గా, ప్రజా ప్రతినిధులు పొలిటికల్‌ టీమ్‌గా, పోలీసు అధికారులు పోలీసు వారియర్స్‌గా, ఎన్‌ఎం స్పేసెస్‌ జట్లుగా ఏర్పడి మ్యాచ్‌లు ఆడారు.

తొలి మ్యాచ్‌లో పోలీస్‌ వారియర్స్‌ గెలుపు

తొలి మ్యాచ్‌లో పోలీస్‌ వారియర్స్‌ ఏడు వికెట్ల తేడాతో టీవీ కింగ్స్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీవీ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ అభిషేక్‌ యన్నం (35), పవన్‌ (20), కరమ్‌ (22) రాణించారు. వారియర్స్‌ బౌలర్లలో విజయ వరప్రసాద్‌ మూడు, రాంబాబు (డీఎస్పీ), బి.ఆదిప్రసాద్‌, ఎస్‌.శ్రీకాంత్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన పోలీసు వారియర్స్‌లో వి.త్రినాథ్‌ (92), అరుణ్‌బాబు (56) అర్ధ సెంచరీలు చేశారు. పోలీస్‌ వారియర్స్‌ జట్టు 15.3 ఓవర్లలో మూడు వికెట్లకు 172 పరుగులు చేసి విజయం సాధించింది. టీవీ కింగ్స్‌ బౌలర్‌ కరమ్‌ రెండు వికెట్లు తీశాడు.

మరో మ్యాచ్‌లో ఎన్‌ఎం స్పేసెస్‌ గెలుపు

టీవీ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎన్‌ఎం స్పేసెస్‌ 69 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాట్‌ చేసిన ఎన్‌ఎం స్పేసెస్‌లో రామ్‌పాటిల్‌ భారీ అర్ధ సెంచరీ (90), ఎస్‌.ఎస్‌.భరత్‌కుమార్‌ (38), జి.అరవింద్‌కుమార్‌ (30), ప్రవీణ్‌ (28) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 223 పరుగుల స్కోరు చేసింది. ఛేదనలో టీవీ టైగర్స్‌ 18 ఓవర్లలో 154 పరుగులు ఆలౌటైంది. యశ్వంత్‌ అర్ధ సెంచరీ (63) చేశాడు. ఎన్‌ఎం బౌలర్లలో రాజీవ్‌ మూడు, రామ్‌ పాటిల్‌ రెండు వికెట్ల తీశారు.

పొలిటికల్‌ టీమ్‌పై టీసీఏ విజయం

పొలిటికల్‌ టీమ్‌పై టీసీఏ ఎలెవెన్‌ పది వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పొలిటికల్‌ టీమ్‌ వర్ల రాజా (38), విజయ్‌చంద్ర (22), నయకర్‌ (13) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 112 పరుగులు చేసింది. టీసీఏ బౌలర్లలో రఘు రెండు వికెట్లు పడగొట్టగా, ప్రణయ్‌, ఖుయ్యుం, తరుణ్‌, విజయ్‌, సందీప్‌ తలో వికెట్ల తీశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన టీసీఏ ఎలెవన్‌లో ఓపెనర్లు సుధీర్‌బాబు (38; రిటైర్డ్‌ హర్ట్‌), సుశాంత్‌ (34; రిటైర్డ్‌ హర్ట్‌), తమన్‌ (26 నాటౌట్‌) రాణించి కేవలం 8.4 ఓవర్లలో సునాయాస విజయం సాఽధించారు.

Updated Date - Mar 01 , 2026 | 01:31 AM