Share News

తెలంగాణ గవర్నర్‌ రాక

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:33 AM

తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ శుక్రవారం మధ్యాహ్నం నగరానికి వచ్చారు.

తెలంగాణ గవర్నర్‌  రాక

నేడు తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రం సందర్శన

విశాఖపట్నం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి):

తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ శుక్రవారం మధ్యాహ్నం నగరానికి వచ్చారు. విమానాశ్రయం నుంచి నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుని బసచేశారు. శనివారం ఉదయం పది గంటలకు ఆయన తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రానికి వెళతారు. అక్కడ అధికారులతో భేటీ అనంతరం పలు ప్రాంతాలను సందర్శించి తిరిగి మధ్యాహ్నం హోటల్‌కు చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. రాత్రి ఎనిమిది గంటలకు విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్‌ బయలుదేరి వెళతారు.


భౌబోయ్‌

జిల్లాలో గత ఏడాది 20,599 మందికి కుక్కకాటు

సర్వేలో వెల్లడి

వైరల్‌ ఫీవర్స్‌ బారినపడినవారు 1,62,345 మంది

1,243 మందికి టైఫాయిడ్‌, 1,421 మందికి డయేరియా

27 మందికి స్క్రబ్‌ టైఫస్‌, 529 మందికి డెంగ్యూ

ఇవి అధికారిక లెక్కలు

అనధికారికంగా రెండు, మూడింతలు ఉంటాయని అంచనా

విశాఖపట్నం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో కుక్కకాటు బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడిచిన ఏడాది (జనవరి నుంచి డిసెంబరు వరకు) 20,599 మంది కుక్కకాటుకు గురయ్యారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారమే 20 వేల మందికిపైగా బాధితులు ఉంటే... అనధికారికంగా ఈ లెక్క మరింత ఎక్కువగా ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దేశంలో కుక్కకాటు వల్ల రేబిస్‌ బారినపడి వందలాది మృతిచెందుతున్నారని, అందులో చిన్నారులు కూడా ఉన్నారని ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆవేదన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. వారి ఆందోళనకు అద్దంపట్టేలా జిల్లాలో నమోదైన కేసులు ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు.

జిల్లాలో జ్వర పీడితులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించడం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి కేసులను ప్రాథమిక దశలోనే గుర్తించాలన్న ఉద్దేశంతో ఆరోగ్య శాఖ నిరంతరం ఫీవర్‌ సర్వేను చేపడుతోంది. ఈ క్రమంలోనే కుక్కకాటుకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు. ఈ సర్వేను ఆశ, ఏఎన్‌ఎం క్షేత్రస్థాయిలో నిర్వహించారు. సర్వేలో గుర్తించిన వివరాలను ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ ప్లాట్‌ ఫామ్‌ (ఐహెచ్‌ఐపీ)లో నమోదుచేశారు. అందులో ఉన్న డేటా ప్రకారం...గత ఏడాది జిల్లాలో 1,62,345 మంది వైరల్‌ ఫీవర్స్‌, 1,421 మంది డయేరియా, 1,243 మంది టైఫాయిడ్‌, 173 మంది మలేరియా, 529 మంది డెంగ్యూ, 16 మంది చికున్‌గున్యాతో బారినపడ్డారు. స్క్రబ్‌ టైఫస్‌ కేసులు 27 నమోదయ్యాయి. ఇదే సందర్భంలో 20,599 మంది కుక్కకాటుకు గురైన విషయం బయటపడింది. అయితే, అధికారిక లెక్కలతో పోలిస్తే అనధికారికంగా ఈ కేసుల సంఖ్య మరిన్ని రెట్లు అధికంగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.

నిరంతర ప్రక్రియ

కరోనా వైరస్‌ వ్యాప్తి తరువాత నుంచి ప్రభుత్వం నిరంతరం ఫీవర్‌ సర్వే చేపడుతోంది. ఈ ఏడాది కూడా సర్వే కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. డెంగ్యూ, స్క్రబ్‌ టైఫస్‌, కరోనా, మలేరియా, స్వైన్‌ ఫ్లూ వంటి కేసులను వేగంగా గుర్తించి నియంత్రణ చర్యలు చేపట్టే ఉద్దేశంతోనే ఈ సర్వేను నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.


పరిశ్రమలకు రూ.10 కోట్ల జరిమానా

కాలుష్య నియంత్రణపై పీసీబీ దృష్టి

వాహనాల నుంచి రూ.17.54 లక్షలు...

విశాఖపట్నం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి):

నగరంలో కాలుష్యం పెరగడానికి, గాలి నాణ్యత క్షీణతకు కారణమైన కంపెనీలకు కాలుష్య నియంత్రణ మండలి రూ.10 కోట్లు జరిమానా విధించింది. గత నెల 21వ తేదీ నుంచి శుక్రవారం వరకూ పలు కంపెనీలను తనిఖీ చేసిన పీసీబీ అధికారులు కొన్నింటికి నోటీసులు జారీచేశారు. విశాఖ పోర్టు, ఇంకా పోర్టులో పలు కార్గో యూనిట్లు, హెచ్‌పీసీఎల్‌, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌, విశాఖ ఉక్కు కర్మాగారం, హిందూజా పవర్‌ ప్లాంటును అధికారులు తనిఖీ చేశారు. గాలి నాణ్యత తగ్గడానికి ఆయా కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణమని గుర్తించి జరిమానా విధించారు. మరోవైపు వాహన కాలుష్యం నియంత్రణకు రవాణా అధికారుల తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకూ 159 వాహనాలకు రూ.17.54 లక్షల జరిమానా విధించారు. కాలుష్యం తగ్గించడం ద్వారా గాలి నాణ్యత పెంచేందుకు తనిఖీలు కొనసాగుతాయని ఈఈ పైడి వెంకట ముకుందరావు తెలిపారు.

Updated Date - Jan 03 , 2026 | 12:33 AM