Share News

కదంతొక్కిన ఉపాధ్యాయులు

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:46 AM

మెగా డీఎస్సీ 2025లో ఎంపికైన ఉపాధ్యాయులు ఆదివారం తీరంలో కదంతొక్కారు.

కదంతొక్కిన ఉపాధ్యాయులు

  • పాఠాలే కాదు ... గుణపాఠాలూ చెబుతాం

  • వైసీపీ ఆరోపణలపై మెగా డీఎస్సీ టీచర్ల ఆగ్రహం

  • బీచ్‌రోడ్డులో నాలుగుగంటలకుపైగా నిరసన

  • వైఎంసీఏ ఎదురుగా తొలుత సమావేశం

  • ఆర్కేబీచ్‌ వరకు ర్యాలీ, బహిరంగ సభ

  • థింసా నృత్యంతో గిరిజన ఉపాధ్యాయుల ఆందోళన

  • డీఎస్సీ అసత్య ఆరోపణల పెట్టె సముద్రంలో నిమజ్జనం

  • సంఘీభావం తెలిపిన ఉపాధ్యాయ సంఘాల నేతలు

బీచ్‌ రోడ్డు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి)

మెగా డీఎస్సీ 2025లో ఎంపికైన ఉపాధ్యాయులు ఆదివారం తీరంలో కదంతొక్కారు. వైసీపీ అసత్య ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీ ర్యాలీ చేశారు. మెగా డీఎస్సీపై వైసీపీ నాయకుల ఆరోపణలు అవాస్తవాలంటూ చేసిన నినాదాలతో సాగర తీరం మార్మోగింది. ఉత్తరకోస్తాలో పరిధిలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి సుమారు రెండువేల మందికిపైగా ఉపాధ్యాయులు ఆదివారం బీచ్‌రోడ్డులో నిరసన చేపట్టారు.

మెగా డీఎస్సీపై వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ఆరోపణలపై ‘ఆత్మగౌరవ గర్జన’ పేరిట ఆదివారం తీరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉదయం 10.30 గంటలకు అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు వైఎంసీఏ ఎదురుగా గల పార్కింగ్‌ స్థలంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నేతల ఆరోపణలు తిప్పికొడుతూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఆత్మగౌరవ గర్జన నేత కృష్ణంనాయుడు సభను ప్రారంభించి, మాట్లాడుతూ డీఎస్సీ అంటే తెలియని వ్యక్తులు కూడా తమను విమర్శిస్తూ ప్రతిభను అవమానించారని మండిపడ్డారు. తరగతి గదిలో పాఠాలు చెప్పడమే కాదు ఆత్మగౌరవానికి ఇబ్బంది కలిగించే వ్యక్తులకు గుణపాఠాలు కూడా చెప్పగలమని హెచ్చరించారు. వైసీపీ ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ కూడా చేపట్టని అసమర్థులు ఇప్పుడు 2025 మెగా డీఎస్సీపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. మరికొందరు టీచర్లు మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల్లోకి ఉపాధ్యాయులను లాగడం మంచిదికాదన్నారు. ప్రతిభతో ఉద్యోగాలు సంపాదించిన తామంతా ఆత్మగౌరవం నినాదాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేసేందుకే ఇక్కడ సమావేశమయ్యామన్నారు. కరెన్సీ నోట్లతో కాకుండా కష్టంతో ఉద్యోగాలు సాధించామని చెబుతున్నా పదేపదే ఆరోపణలు చేయడం దారుణమన్నారు. అనంతరం ర్యాలీగా ఆర్కేబీచ్‌కు తరలివెళ్లారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, విద్యాశాఖామంత్రి నారా లోకేశ్‌ చిత్రపటాలతో ప్లకార్డులు, ‘దగా కాదు మెగా డీఎస్సీ’ అంటూ రాసిన ప్లకార్డులు చేతబూని వైసీపీ నాయకుల ఆరోపణలను తప్పుబడుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ర్యాలీ మధ్యలో శ్రీకాకుళానికి చెందిన ఉపాధ్యాయులు మెగా డీఎస్సీపై బుర్రకథ ద్వారా వివరించారు. అక్కడి నుంచి ఆర్కేబీచ్‌కు చేరుకుని అక్కడ మెట్లపై సమావేశమయ్యారు. గిరిజన ఉపాధ్యాయులు సంప్రదాయ థింసా నృత్యంచేశారు.

అవాస్తవాలు ప్రచారంచేస్తే ఉపేక్షించం

ఈ సందర్భంగా పలువురు టీచర్లు వైసీపీ నాయకుల తీరును తప్పుబట్టారు. ఏళ్ల తరబడి కష్టపడి చదువుకుని ఉద్యోగాలు సాధిస్తే అక్రమాలు జరిగాయని ఎలా ఆరోపిస్తారని నిలదీశారు. ఒక్క ఆధారం చూపకుండా అవాస్తవాలు చెబితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వాస్తవాలు చెబుతున్నా పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతల తీరుపై భగ్గుమన్నారు. స్వార్థ రాజకీయాలకు ఉపాధ్యాయులను బలితీసుకోవద్దని హితవు పలికారు. ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించడం చేతకానివారికి ఇప్పుడు మాట్లాడే అర్హత లేదన్నారు. నిరుద్యోగుల ఉసురు తగిలితే వైసీపీ నాయకులు బంగాళాఖాతంలో కలిసిపోతారన్నారు. వైసీపీ హయాంలో ఉద్యోగాల కోసం ధర్నాలు, ఆందోళనలు చేస్తే అక్రమంగా కేసులు పెట్టి అరెస్టులు చేయించారని గుర్తు చేశారు.

సంద్రంలో ఆరోపణల పెట్టె నిమజ్జనం

అనంతరం డీఎస్సీ అసత్య ఆరోపణల పెట్టెను సముద్రంలో నిమజ్జనం చేశారు. ఉపాధ్యాయుల గర్జనకు ఉత్తరాంధ్రలోని పలు ఉపాధ్యాయ సంఘాలు సంఘీభావం తెలిపాయి. ఆయా సంఘాల నాయకులు వెంకటపతిరాజు, ఇమంది పైడిరాజు, మడ్డు శ్రీనివాసరావు, టీవీ రమణ, రామూర్తి ప్రసాద్‌, జగన్మోహన్‌, గోవిందరావు, శ్రీనివాసరావు, అప్పలనాయుడు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు.

బురదచల్లడమే వైసీపీ నైజం

ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. కూటమి ప్రభుత్వం 16,347 కుటుంబాల్లో వెలుగులు నింపితే బురదచల్లేందుకు యత్నించడం దారుణం. రేయింబవళ్లు శ్రమించి డీఎస్సీలో మెరిట్‌తో ఉద్యోగం సంపాదిస్తే సీబీఐతో విచారణ చేయించాలంటారా..? ఎలాంటి అక్రమాలు జరిగాయని సీబీఐకి ఇవ్వాలి.. రోస్టర్‌ ప్రకారమే పోస్టులను భర్తీచేశారు. అసలు డీఎస్సీ అంటేనే చంద్రబాబునాయుడు. వైసీపీ విమర్శల ఆధారంగా ఇతరులు చేస్తున్న వ్యాఖ్యలు విని బాధ పడాల్సివస్తోంది.

- కె.శ్రావణి , విశాఖపట్నం

ఎక్కడైనా సమాధానమిస్తా!

మాకు రాజకీయాలు వద్దు. పాఠాలు చెప్పడమే గొప్ప బాధ్యత. వైసీపీ ఐదేళ్ల పాలనలో అదిగో, ఇదిగో డీఎస్సీ అంటూ ఊరించారు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించేందుకు సిద్ధమైతే ఆపేందుకు వైసీపీ నేతలు 150 కేసులు వేశారు. హారిజంటల్‌ రిజర్వేషన్‌ ప్రకారం పోస్టుల భర్తీ జరిగింది. పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి. లేదంటే గూగుల్‌లో వెతకండి. విమర్శలు చేసేవారి ప్రశ్నలకు రాష్ట్రంలో ఎక్కడికి రమ్మన్నా వచ్చి సమాఽధానం చెబుతా.

- ఎస్‌.భాగ్యలక్ష్మి, కాకినాడ జిల్లా

ఏళ్ల కష్టంతో సాధించుకున్నాం

ఏళ్ల తరబడి కోచింగ్‌ సెంటర్‌లో చదువుతూ ఉపాధ్యా య ఉద్యోగం సాధించుకున్నాం. వెసీపీ నేతలు అవహేళన చేస్తూ, దుష్ప్రచారానికి దిగడంతో మా గుండెలు రగిలిపోతున్నాయి. వారు దగా డీఎస్సీ అంటుంటే భరించలేకపోతున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నేతలకు తగిన బుద్ధి చెబుతాం.

- ఎం.అశోక్‌, కొత్తవలస, విజయనగరం జిల్లా

ఉపాధ్యాయులను వేధిస్తారా?

కష్టపడి ఉద్యోగం సాధించిన మాపై తప్పుడు ఆరోపణలతో వేధించడం వైసీపీ నేతలకు ఎంతవరకు న్యాయం. సమాజాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులను ఇంతలా మానసికంగా వేఽదించినవారు చరిత్రలో ఎవరూ లేరు. మా కష్టాన్ని కించపరుస్తూ ఘోరంగా అవమానిస్తున్న జగన్‌, వైకాపా నేతలకు డీఎస్సీ గురించి మాట్లాడే అర్హత లేదు.

- భాస్కర్‌, శ్రీకాకుళం

ఓర్వలేక కుట్రలు

అధికారంలో ఉన్న ఐదేళ్లలో వైసీపీ ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఇప్పుడు వేలాదిమంది పేదింటి బిడ్డలు డీఎస్సీ సాధిస్తే ఓర్వలేక కుట్రలు పన్నుతున్నారు. కూటమి ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపడితే, తట్టుకోలేక బురద జల్లుతున్నారు.

- శ్రీలత, శ్రీకాకుళం

Updated Date - Aug 31 , 2026 | 12:46 AM