మెగా పీటీఎంకు మద్యం సేవించి వచ్చిన ఉపాధ్యాయుడు!
ABN , Publish Date - Jul 24 , 2026 | 11:12 PM
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లోతుగెడ్డ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని పినపాడు గిరిజన సంక్షేమశాఖ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌కు ఉపాధ్యాయుడు (ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం) మద్యం సేవించి వచ్చారు.
విశాఖపట్నం, జూలై 24 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లోతుగెడ్డ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని పినపాడు గిరిజన సంక్షేమశాఖ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌కు ఉపాధ్యాయుడు (ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం) మద్యం సేవించి వచ్చారు. శుక్రవారం మెగా పీటీఎంకి విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు హాజరయ్యారు. అయితే ఉపాధ్యాయుడు కేవీ రమణ కార్యక్రమం నిర్వహించకుండా మద్యం మత్తులో జోగుతూ, ఊగుతూ బెంచీపై పడిపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో కార్యక్రమాన్ని లోతుగెడ్డ స్కూల్ కాంప్లెక్స్ సీఆర్‌పీ రాము నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయుడు మద్యం మత్తులో జోగుతూ, ఊగుతూ, పడిపోతున్న దృశ్యాలను తల్లిదండ్రులు ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఉపాధ్యాయుడుపై జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై గిరిజన సంక్షేమ శాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు.