బాలికల్ని వేధించిన ఉపాధ్యాయుడు సస్పెన్షన్
ABN , Publish Date - Feb 07 , 2026 | 11:20 PM
బాలికలను లైంగికంగా వేధించారనే అరోపణలు ఎదుర్కొన్న మండలంలోని ఐనాడ పంచాయతీ రాయిపాలెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పాంగి సుబ్రహ్మణ్యాన్ని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ శనివారం సస్పెండ్ చేశారు.
ఆరోపణలపై డీఈవో, ఐసీడీఎస్ పీడీ విచారణ
టీచర్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు
తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదు
పాడేరు, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): బాలికలను లైంగికంగా వేధించారనే అరోపణలు ఎదుర్కొన్న మండలంలోని ఐనాడ పంచాయతీ రాయిపాలెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పాంగి సుబ్రహ్మణ్యాన్ని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ శనివారం సస్పెండ్ చేశారు. అలాగే బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆ ఉపాధ్యాయుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. రాయిపాలెం ఉపాధ్యాయుడు తమను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని బాలికలు, వారి తల్లిదండ్రులు, గ్రామస్థులు గురువారం ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘటనపై విచారణ చేపట్టాలని, డీఈవో, ఐసీడీఎస్ పీడీని జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. దీంతో శుక్రవారం డీఈవో రామకృష్ణారావు, ఐసీడీఎస్ పీడీ ఝాన్సీబాయి శుక్రవారం రాయిపాలెం పాఠశాలను సందర్శించి, సమగ్ర విచారణ చేపట్టి, జిల్లా కలెక్టర్‌కు నివేధిక సమర్పించారు. దీంతో ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యాన్ని సస్పెండ్ చేయడంతోపాటు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయమని ఆయన ఆదేశించారు. దీంతో పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.