పీటీఎంలో మద్యం సేవించిన టీచర్ సస్పెన్షన్
ABN , Publish Date - Jul 25 , 2026 | 11:56 PM
చింతపల్లి మండలంలోని లోతుగెడ్డ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని పినపాడు గిరిజన సంక్షేమశాఖ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు(ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం) కె. వెంకట రమణను సస్పెండ్ చేసినట్టు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పీబీకే.పరిమిళ శనివారం తెలిపారు.
టీడబ్ల్యూ డీడీ పీబీకే.పరిమిళ ఉత్తర్వులు జారీ
నిబంధనలు అతిక్రమిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరిక
పాడేరు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): చింతపల్లి మండలంలోని లోతుగెడ్డ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని పినపాడు గిరిజన సంక్షేమశాఖ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు(ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం) కె. వెంకట రమణను సస్పెండ్ చేసినట్టు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పీబీకే.పరిమిళ శనివారం తెలిపారు. మెగా పీటీఎం కార్యక్రమానికి ఉపాధ్యాయుడు కె.వెంకటరమణ మద్యం సేవించిన హాజరైన విషయం మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో ఏటీడబ్ల్యూవో ద్వారా విచారణ జరిపించామన్నారు. ఆయన మద్యం సేవించారని విచారణలో నిర్థారణ కావడంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ టి.నిషాంతి ఆదేశాల మేరకు సస్పెండ్ చేశామన్నారు. ఎక్కడైనా ఉపాధ్యాయులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని టీడబ్ల్యూ డీడీ హెచ్చరించారు. ఉపాధ్యాయుల హాజరుపైనా ఎంఈవోలు, ఏటీడబ్ల్యూవోల పర్యవేక్షిస్తున్నామని, నిత్యం ఉపాధ్యాయులు హాజరైన తమ విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. సీసీఏ రూల్స్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే ఉపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు చేపడతామని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పీబీకే.పరిమిళ హెచ్చరించారు.
మద్యం సేవించిన టీచర్‌పై విచారణ
చింతపల్లి, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మెగా పీటీఎం కార్యక్రమానికి మద్యం సేవించి హాజరైన మండలంలోని పినపాడు ప్రాథమిక పాఠశాల ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం కె.వెంకటరమణపై స్థానిక ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి, ఎంఈవో-1 పీబీవీవీ ప్రసాద్ ఉపాధ్యాయుడు, గ్రామస్థులు, తల్లిదండ్రులను విచారించారు. ఏటీడబ్ల్యూవో విచారణ నివేదికను డిప్యూటీ డైరెక్టర్, జిల్లా కలెక్టర్‌లకు వారు పంపించారు. విచారణ నివేదిక అందించిన 30 నిమిషాల వ్యవధిలో డిప్యూటీ డైరెక్టర్ సస్పెండ్ ఉత్తర్వులను జారీ చేశారు.