Share News

బాలికలకు ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు

ABN , Publish Date - Feb 05 , 2026 | 11:26 PM

మండలంలోని ఐనాడ పంచాయతీ పరిధి రాయిపాలెం మండల ప్రాథమిక పాఠశాలలో బాలికలను ఉపాధ్యాయుడు లైంగికంగా వేధిస్తున్నాడంటూ విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం పాఠశాల వద్ద ఆందోళన చేశారు.

బాలికలకు ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు
రాయిపాలెం ఎంపీపీ స్కూల్‌ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

డీఈవో ఆదేశాలతో విచారణ చేపట్టిన ఎంఈవో

పాడేరురూరల్‌, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఐనాడ పంచాయతీ పరిధి రాయిపాలెం మండల ప్రాథమిక పాఠశాలలో బాలికలను ఉపాధ్యాయుడు లైంగికంగా వేధిస్తున్నాడంటూ విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం పాఠశాల వద్ద ఆందోళన చేశారు. పదేళ్లలోపు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఈ పాఠశాలలో 13 మంది బాలురు, 12 మంది బాలికలు ఉన్నారన్నారు. ఈ పాఠశాల ఉపాధ్యాయుడు పి.సుబ్రహ్మణ్యం నిత్యం మద్యం సేవించి విధులకు హాజరుకావడంతో పాటు విద్యార్థులను గ్రామంలో ఉన్న మద్యం షాపునకు పంపించి మద్యం, జీలుగు కల్లు తెప్పించుకుంటున్నాడని ఆరోపించారు. మద్యం సేవించిన అనంతరం పదేళ్లలోపు వయస్సు ఉన్న బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, తల్లిదండ్రులకు చెబితే కొడతానని బెదిరిస్తున్నారని చెప్పారు. ఇటీవల మరో ఉపాధ్యాయిని ఆ పాఠశాలలో విధుల్లో చేరిన తరువాత కొంత వరకు వేధింపులు తగ్గాయని, ఆమె సెలవు పెడితే విద్యార్థులు పాఠశాలకు వెళ్లేవారు కాదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. బుధవారం ఆ ఉపాధ్యాయుడు అదే తీరులో వ్యవహరించడంతో బాలికలకు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో గురువారం వారంతా పాఠశాల వద్ద ఆందోళన చేశారు. డీఈవో డాక్టర్‌ కె.రామకృష్ణారావు ఆదేశాల మేరకు ఎంఈవో కె.సువర్ణరాజు పాఠశాల వద్దకు వెళ్లి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను గ్రామ పెద్దల సమక్షంలో విచారించారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి, కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళతానని, ఆ ఉపాధ్యాయుడిని వేరొక పాఠశాలకు డిప్యుటేషన్‌పై పంపిస్తామని ఎంఈవో తెలిపారు. కాగా గురువారం ఆ ఉపాధ్యాయుడు విధులకు హాజరుకాలేదు.

Updated Date - Feb 05 , 2026 | 11:26 PM