రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి
ABN , Publish Date - Jun 12 , 2026 | 11:14 PM
మండలంలోని అంతర్ల వద్ద జాతీయ రహదారిపై ఎదురెదురుగా ప్రయాణిస్తున్న మినీ వ్యాన్, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఓ ఉపాధ్యాయుడు మృతి చెందాడు.
చింతపల్లి, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అంతర్ల వద్ద జాతీయ రహదారిపై ఎదురెదురుగా ప్రయాణిస్తున్న మినీ వ్యాన్, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఓ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం గూడెంకొత్తవీధి మండలం లక్కవరపుపేట పంచాయతీ తూరుమామిడి గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాలలో సొలబం కృష్ణ ప్రసాద్(35) సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఆయన కుటుంబంతో ఐటీడీఏ క్వార్టర్స్ సమీపంలో అద్దెగృహంలో నివాసముంటున్నాడు. ఉపాధ్యాయుడు నెల రోజులుగా అంతర్లలో నూతన ఇల్లు నిర్మించుకుంటున్నాడు. శుక్రవారం సాయంత్రం ఇంటికి వాటరింగ్ చేసి రాత్రి ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. అదే సమయంలో నర్సీపట్నం నుంచి సప్పర్ల వెళుతున్న మినీ వ్యాన్, ఉపాధ్యాయుడు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అంతర్ల జంక్షన్ వద్ద బలంగా ఢీకొన్నాయి. దీంతో తీవ్రంగా గాయపడిన కృష్ణప్రసాద్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. మృతుడు స్వగ్రామం జి.మాడుగుల మండం సొలబం గ్రామ పంచాయతీ. అతనికి భార్య లలితకుమారి, ఆరేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈఘటనపై చింతపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.