సీలేరు పీఠంపై టీడీపీ
ABN , Publish Date - Nov 27 , 2026 | 11:43 PM
మేజర్ పంచాయతీకి 1983 నుంచి ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కేవలం 2006లో మాత్రమే టీడీపీ మద్దతుదారు కిలో సుమిత్ర తొలిసారిగా గెలుపొందింది.
రెండు దశాబ్దాల తర్వాత మేజర్ పంచాయతీలో విజయం
సర్పంచ్, 11 వార్డులు దక్కించుకున్న కూటమి
సీలేరు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మేజర్ పంచాయతీకి 1983 నుంచి ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కేవలం 2006లో మాత్రమే టీడీపీ మద్దతుదారు కిలో సుమిత్ర తొలిసారిగా గెలుపొందింది. తర్వాత పలు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, వైసీపీ మద్దతుదారులే సర్పంచ్‌లుగా ఎన్నికవుతూ వచ్చారు. సీలేరు మేజర్ పంచాయతీలో గిరిజనుల కంటే గిరిజనేతరుల ఓట్లే అధికంగా ఉన్నాయి. గిరిజనేతరుల ఓట్లే అభ్యర్థుల గెలుపు ఓటమిపై ఎక్కువ ప్రభావితం చేస్తాయి. 2021 పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్‌కు చెందిన కొర్రా పరదేశీ పోటీ చేసి గెలుపొందారు. 2023లో పరదేశీ అనారోగ్యంతో మృతి చెందగా.. తరువాత నిర్వహించిన ఉపఎన్నికలో వైసీపీ మద్దతుదారు దుర్జో గెలుపొందారు. 2024వ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక కూటమి నాయకుల్లో నూతన ఉత్సాహం వచ్చింది. దీంతో ఈసారి జరిగిన ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని తీవ్రంగా కృషిచేశారు. ఎంపీటీసీ పదవికి కూటమి అభ్యర్థి నక్కా నాగమణి వైసీపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో స్థానిక కూటమి నాయకులు పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించారు. మేజర్ పంచాయతీలో 2,869 ఓట్లు ఉన్నాయి. పంచాయతీ పోరులో వైౖసీపీ అభ్యర్థులకు దీటైన అభ్యర్థులను బరిలో దించి పక్కా వ్యూహంతో పనిచేశారు. దీంతో సర్పంచ్‌గా దీనామణి(టీడీపీ)తోపాటు 12 వార్డులకుగాను 11 వార్డుల్లో గెలుపొంది సీలేరు పీఠంపై అధిష్ఠించారు. రెండు దశాబ్దాల తరువాత సీలేరులో కూటమి అభ్యర్థులు గెలుపొందడంతో నాయకుల్లో మరింత జోష్ పెరిగింది.