అసెంబ్లీ నియోజకవర్గాలకు టీడీపీ పరిశీలకులు
ABN , Publish Date - May 26 , 2026 | 12:48 AM
జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులుగా పలువురు సీనియర్ నాయకులను టీడీపీ అధిష్ఠానం నియమించింది.
అనకాపల్లి, మే 25 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులుగా పలువురు సీనియర్ నాయకులను టీడీపీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అనకాపల్లికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సర్వసిద్ది అనంతలక్ష్మి (గాజువాక), ఎలమంచిలికి ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, పెందుర్తికి విజయనగరం డీసీఎంఎస్ పర్సన్ ఇన్‌చార్జి గొంప కృష్ణ, పాయకరావుపేటకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఇ.సుజాత (విశాఖ), నర్సీపట్నానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చొప్పళ్ల శ్రీనివాసరావు (తుని), మాడుగులకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్రీను (భీమిలికి), చోడవరానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసుపల్లి గాయత్రి (విశాఖ) నియమితులయ్యారు.
కాగా జిల్లాకు చెందిన గవర సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ మళ్ల సరేంద్ర విశాఖ జిల్లా భీమిలి పరిశీలకుడిగా, కొప్పల వెలమ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ పీవీజీ కుమార్ విజయనగరం నియోజకవర్గానికి, డీసీఎంఎస్ పర్సన్‌ఇన్‌చార్జి కోట్ని బాలాజీ పోలవరం జిల్లా రంపచోడవరానికి, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు అరకులోయ నియోజకవర్గానికి పరిశీలకులుగా నియమితులయ్యారు.
పొటోరైటప్(25ఆర్‌కెఎం3): గట్రెడ్డి దేముడమ్మ(ఫైల్ ఫొటో)
ఎండ మంటలు
వడగాడ్పులతో జనం విలవిల
కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రతలు
మాకవరపాలెంలో 43.8 డిగ్రీలు
వడదెబ్బకు దొండపూడిలో వృద్ధురాలి మృతి
అనకాపల్లి, మే 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండ తీవ్రత, వడగాడ్పుల ప్రభావం సోమవారం కూడా కొనసాగింది. దాదాపు సగం మండలాల్లో 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ ఠారెత్తించడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేదు. వేడి గాలులు, ఉక్కపోత కారణంగా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు ఆపసోపాలు పడుతున్నారు. రైతులు, వ్యవసాయ కూలీలు తెల్లవారుజామున ఐదు గంటలకే పొలం పనులకు వెళ్లి, పది గంటలకల్లా తిరుగుముఖం పడుతున్నారు. కాగా మాకవరపాలెం మండలంలో అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేవరాపల్లిలో 42.8 డిగ్రీలు, నర్సీపట్నంలో 42.6, రావికమతంలో 40.8, రోలుగుంటలో 40.8, గొలుగొండలో 40.5, నాతవరంలో 40.5, పరవాడలో 40, సబ్బవరంలో 40, బుచ్చెయ్యపేటలో 39.9, చోడవరంలో 39.7, కశింకోటలో 39.6, మాడుగులలో 39.6, కోటవురట్లలో 39.4, చీడికాడలో 39.4, కె.కోటపాడులో 39.1, అనకాపల్లిలో 38.9, మునగపాకలో 38.8, ఎస్.రాయవరంలో 37.8, పాయకరావుపేటలో 37.2, ఎలమంచిలిలో 37.1, నక్కపల్లిలో 36.5, రాంబిల్లిలో 36.4, అచ్యుతాపురంలో 36.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వడదెబ్బకు వృద్ధురాలి మృతి
రావికమతం, మే 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని దొండపూడి గ్రామంలో వడదెబ్బకు ఒక వృద్ధురాలు మృతి చెందింది. మండలంలోని దొండపూడి గ్రామానికి చెందిన గట్రెడ్డి దేముడమ్మ(60) సోమవారం పొలం పనికి వెళ్లి మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటికి వచ్చి సొమ్మసిల్లి పడిపోయింది. కుటుంబ సభ్యులు సపర్యలు చేసి ఆస్పత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
మరోమారు పెట్రో బాదుడు
పెట్రోల్ లీటరుకు రూ.2.86,
డీజిల్ లీటరుకు రూ.2.84 పెంపు
11 రోజుల్లో పెట్రోల్‌పై రూ.8.05, డీజిల్‌పై రూ.7.89 భారం
మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందంటున్న ఆయిల్ ప్యాపారులు
-------
అనకాపల్లిలో పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల ఇలా.. (లీటరుకు)
15న 19న 23న 25న పెరుగుదల ప్రస్తుత ధర
పెట్రోల్ రూ.3.29 రూ.0.95 రూ.0.95 రూ.2.86 రూ.8.05 రూ.116.58
డీజిల్ రూ.3.14 రూ.0.95 రూ.0.96 రూ.2.84 రూ.7.89 రూ.104.29
------
అనకాపల్లి, మే 25 (ఆంధ్రజ్యోతి): పెట్రో ఉత్పత్తుల ధరలను కేంద్ర ప్రభుత్వం ఒకేసారి కాకుండా దఫదఫాలుగా పెంచుకుంటూ పోతోంది. ఒకేసారి లీటరుపై రూ.5 నుంచి రూ.10 పెంచితే విపక్షాల నుంచి విమర్శలతో పాటు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని దశల వారీగా పెంచుతోంది. ఈ నెల 15వ తేదీన తొలిసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. ఆ తరువాత 19వ తేదీన, మళ్లీ 23వ తేదీన, తాజాగా ఆదివారం అర్ధరాత్రి తెల్లవారితే సోమవారం (25వ తేదీ) మరోసారి పెంచింది. ఈసారి పెట్రోల్‌పై లీటరుకు రూ.2.86, డీజిల్‌పై రూ.2.84 పెంచింది.
ధరలు పెరగక ముందు 14వ తేదీ నాటికి పెట్రోల్ లీటరు రూ.108.53 ఉండగా, ఇప్పుడు పది రోజుల వ్యవధిలో అది రూ.116.58కి చేరింది. అంటే లీటరుపై ఇప్పటివరకు రూ.8.05 పెంచారు. డీజిల్ విషయానికి వస్తే తొలుత లీటరు రూ.96.40 ఉండేది. ఇప్పుడు రూ.104.29కి చేరింది. దశల వారీగా రూ.7.89 పెంచారు. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.25 వరకు పెంచాలనే ప్రతిపాదన కేంద్రం వద్ద ఉన్నదని, దశల వారీగా పెంచుతుందని ఆయిల్ వ్యాపారులు చెబుతున్నారు. ఇది ఇక్కడితో ఆగదని కూడా అంటున్నారు.
ప్రజలపై భారం ఎంత అంటే..?
జిల్లాలో ఐఓసీ, బీపీసీ, హెచ్‌పీసీలకు చెందిన 161 పెట్రోలు బంకులు ఉన్నాయి. రోజుకు సగటున పెట్రోలు 40 వేల లీటర్లు, డీజిల్ 50 వేల లీటర్ల వినియోగం జరుగుతుంది. తాజాగా పెంచిన ధరలతో పెట్రోల్ వినియోగదారుపై రోజుకు రూ.1,14,400, డీజిల్ వినియోగదారులపై రూ.1,42,000 చొప్పున అదనపు భారం పడనున్నది.