Share News

ఆర్టీసీ బస్సు ఢీకొని టీడీపీ నేత మృతి

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:56 AM

పట్టణంలోని నెహ్రూచౌక్‌లో ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో మునగపాక మండలానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత బీలా లక్ష్మణరావు (52) మృతిచెందారు. ఈ సంఘటనకు సంబంధించి ట్రాఫిక్‌ ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఆర్టీసీ బస్సు ఢీకొని టీడీపీ నేత మృతి
బీలా లక్ష్మణరావు (ఫైల్‌ ఫొటో)

అనకాపల్లి టౌన్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని నెహ్రూచౌక్‌లో ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో మునగపాక మండలానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత బీలా లక్ష్మణరావు (52) మృతిచెందారు. ఈ సంఘటనకు సంబంధించి ట్రాఫిక్‌ ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శిగా వ్యవహరిస్తున్న లక్ష్మణరావు (52) ఆర్డీవో కార్యాలయంలో పనిమీద గురువారం మధ్యాహ్నం అనకాపల్లి వచ్చారు. నెహ్రూచౌక్‌ జంక్షన్‌లో నడుచుకుంటూ వెళుతుండగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి రావికమతం వెళుతున్న పల్లెవెలుగు బస్సు వెనుక నుంచి ఢీకొన్నది. దీంతో తీవ్రంగా గాయపడిన అతనిని ట్రాఫిక్‌ పోలీసులు వెంటనే ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. లక్ష్మణరావుకు భార్య స్రవంతి, ఇద్దరు కుమార్తెలు వున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆస్పత్రికి తరలివచ్చారు. లక్ష్మణరావు మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌, ఆర్టీసీ డిపో మేనేజర్‌ కె.హనుమశ్రీ వచ్చి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. లక్ష్మణరావు 2001లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా ఎన్నికయ్యాడు. భార్య స్రవంతి ప్రస్తుతం శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యురాలిగా వున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాఫిక్‌ ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్‌ను ట్రాఫిక్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Feb 06 , 2026 | 12:56 AM