మన్యంలో బలమైన శక్తిగా టీడీపీ
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:17 PM
గిరిజన ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలమైన శక్తిగా ఎదగాలని రాష్ట్ర మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పాడేరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో ఆదివారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట
రూ.వందల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు
పార్టీ శ్రేణులు ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
మంత్రి గుమ్మడి సంధ్యారాణి
పాడేరు, జూలై 12 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ బలమైన శక్తిగా ఎదగాలని రాష్ట్ర మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పాడేరు నియోజకవర్గ టీడీపీ శ్రేణులతో ఆదివారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి పాలనలో గిరిజన ప్రాంతాలకు పెద్దపీట వేశారని, రోడ్డు, రవాణా, విద్య, వైద్యరంగాల్లో ఎంతో పురోగతి సాధించారన్నారు. ఈ క్రమంలో గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లి, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 2014 నుంచి 2019 వరకు గిరిజనాభివృద్ధికి కృషి చేశామని, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ గిరిజన ప్రాంతాలపై నిర్లక్ష్యం చేసిందన్నారు. దీంతో గిరిజన ప్రాంతాలు ఎంతో వెనుకబడ్డాయని, 2024లో కూటమి అధికారంలోకి రావడంతో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు. రూ.వందల కోట్లతో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఆమె తెలిపారు.
నియోజకవర్గంలో 12 వందల మంది నికార్సైన కార్యకర్తలు
పాడేరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉందని, నియోజకవర్గంలో 12 వందల మంది నికార్సైన కార్యకర్తలున్నారని నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటుతామని, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతోపాటు అధిక మొత్తంలో సర్పంచులు గెలుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అందువల్ల నియోజకవర్గంలో రానున్న రోజుల్లో టీడీపీ జెండా మరింతగా రెపరెపలాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు మోరోజు తేజోవతి, జోనల్ ఇన్‌చార్జి అరవిల్లి రాధాకృష్ణ, నియోజకవర్గ పరిశీలకురాలు కొణతాల రత్నకుమారి, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, సింహాచలం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు సల్లంగి జ్ఞానేశ్వరి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు ఎంవీఎస్.ప్రసాద్, కె.సుబ్బారావు, టూరిజం డైరెక్టర్ కేవీ.రమేశ్‌నాయుడు, పాడేరు పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జి డప్పోడి వెంకటరమణ, టీడీపీ ఎస్‌సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సోమెలి చిట్టిబాబు, మాజీ మంత్రి మణికుమారి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ వంజంగి కాంతమ్మ, టీడీపీ సీనియర్ నేతలు పోలుపర్తి గోవిందరావు, బొర్రా విజయరాణి, చల్లంగి లక్ష్మణరావు, గంగపూజారి శివకుమార్, కేవీ సురేశ్‌కుమార్, నియోజకవర్గంలోని పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు, ముఖ్యకార్యకర్తలు పాల్గొన్నారు.