మేయర్ అభ్యర్థిపై టీడీపీ తర్జనభర్జన
ABN , Publish Date - Oct 16 , 2026 | 01:06 AM
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో కూటమి తరపున టీడీపీ అభ్యర్థినే బరిలోకి దింపుతున్నారు. దీనికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభ్యర్థి ఎవరైతే బాగుంటుందో సూచించాలని పార్టీ కార్యాలయం నుంచి నగర వాసులకు ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి. ఉత్తర నియోజకవర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్ ముక్కా శ్రావణి, టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ భార్య సుజాత పేర్లు పేర్కొంటూ...వారిద్దరిలో ఎవరైతే మేయర్ అభ్యర్థిగా బాగుంటారో సూచించాలని కోరుతున్నారు. అయితే ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి ఇదొక విధానమని, వారిలో ఒకరికి ఇస్తారనడానికి 100 శాతం గ్యారంటీ లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ముక్కా శ్రావణి, లొడగల సుజాతల్లో ఒకరి పేరు సూచించాలని నగర వాసులకు ఐవీఆర్ఎస్ కాల్స్
మరోవైపు ఎంపీ, ఎమ్మెల్యేలను
మూడేసి పేర్లు అడిగిన అధిష్ఠానం
ప్రచారంలోకి ఎమ్మెల్యే పల్లా సతీమణి లావణ్య,
బండారు కోడలు నందిని పేర్లు
రేస్లో బిజినెస్ జెయింట్లు
పోటీకి వరుణ్ మోటార్స్ ప్రభుకిశోర్ భార్య లక్ష్మి,
పొల్లాక్స్ స్కూల్ నిర్వాహకురాలు రజని...ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం
విశాఖపట్నం, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి):
మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎన్నికల్లో కూటమి తరపున టీడీపీ అభ్యర్థినే బరిలోకి దింపుతున్నారు. దీనికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభ్యర్థి ఎవరైతే బాగుంటుందో సూచించాలని పార్టీ కార్యాలయం నుంచి నగర వాసులకు ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి. ఉత్తర నియోజకవర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్ ముక్కా శ్రావణి, టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ భార్య సుజాత పేర్లు పేర్కొంటూ...వారిద్దరిలో ఎవరైతే మేయర్ అభ్యర్థిగా బాగుంటారో సూచించాలని కోరుతున్నారు. అయితే ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి ఇదొక విధానమని, వారిలో ఒకరికి ఇస్తారనడానికి 100 శాతం గ్యారంటీ లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎమ్మెల్యేలు సూచించిన పేర్లకు మార్కులు
మేయర్ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందో సూచించాల్సిందిగా పార్టీ అధిష్ఠానం జిల్లాలో ఎంపీ, ఎమ్మెల్యేలను కోరిన సంగతి తెలిసిందే. ఒక్కొక్కరు మూడేసి పేర్లు ఇవ్వాలని కోరింది. వారి విజయావకాశాలను బట్టి మార్కులు వేసి పంపాలని గురువారం సూచించింది. అంటే ఆ ముగ్గురిలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వారిని పరిగణనలోకి తీసుకుంటారని సమాచారం. ఇలా జిల్లా ఎమ్మెల్యేలు సూచించిన పేర్లలో రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భార్య, ఏయూ ప్రొఫెసర్ లావణ్య పేరు కూడా వచ్చింది. అదేవిధంగా బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడి భార్య పేరు నందిని పేరు కూడా ఆ జాబితాల్లో చోటుచేసుకుంది. జిల్లాలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న ఒక ప్రజా ప్రతినిధి...ముక్కా శ్రావణి, లొడగల సుజాత, బండారు నందిని పేర్లు పంపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఐవీఆర్ఎస్లో శుక్రవారం మరో జాబితా వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని, అవి అభిప్రాయాల సేకరణకే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మేయర్ టిక్కెట్ రేసులో బిజినెస్ జెయింట్లు
వరుణ్ మోటార్స్ ప్రభుకిశోర్ భార్య లక్ష్మీ,
పొల్లాక్స్ స్కూల్ నిర్వాహకురాలు రిజ్వీ చిత్రా?
మేయర్ స్థానానికి పోటీ పడుతున్న వారిలో ఈసారి వ్యాపార ప్రముఖుల కుటుంబ సభ్యుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకవైపు పార్టీ తరపున అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేయాలనే దానిపై టీడీపీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. మరోవైపు తెర వెనుక వేరే మంతనాలు జరుగుతున్నాయని నగరంలోని కార్పొరేట్ వర్గాల మధ్య చర్చ జరుగుతోంది. వరుణ్ మోటార్స్ అధినేత ప్రభుకిశోర్కు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన చాలాకాలంగా ఉంది. అయితే వేర్వేరు కారణాలతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు మేయర్ సీటుపై ఆయన కుటుంబం ఆసక్తి చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తొలుత ఆయన కుమార్తె వర్ష పేరు ప్రస్తావనకు రాగా ఇప్పుడు ఆయన భార్య ‘లక్ష్మీ’ పేరు విస్తృతంగా వినిపిస్తోంది. ఆయన కూడా గత కొద్దికాలంగా తన సర్కిల్లో పలువురి వద్ద మేయర్ ఎన్నికల గురించి చర్చించినట్టు సమాచారం. వరుణ్ మోటార్స్ తరపున వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం, తల్లిదండ్రుల పేరుతో ఏర్పాటుచేసిన చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఎంతోమందికి ఉచిత వైద్యసేవలు అందించడం తమకు కలిసి వస్తుందని, ప్రభుత్వానికి కూడా భారీ మొత్తంలో జీఎస్టీ చెల్లిస్తున్నామని, ప్రతి కుటుంబంతో వరుణ్ మోటార్స్కు అనుబంధం ఉందని, తాము ఎన్నికల్లో నిలిస్తే తప్పకుండా విజయం లభిస్తుందిన ఆయన ధీమాగా ఉన్నట్టు తెలిసింది.
ఇకపోతే నగరంలో పొల్లాక్స్ పేరుతో స్కూళ్లను నడుపుతున్న రజని పేరు కూడా వినిపిస్తోంది. ఆమె పేరు పార్టీ పరిశీలనలో ఉందని అంటున్నారు. మేయర్ స్థానానికి శుక్రవారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. సమయం తక్కువే ఉంది. ఇంకా పోటీ పడుతున్న వారి పేర్ల పరిశీలనే జరుగుతోంది. అభ్యర్థుల ఖరారు ఎప్పుడనేది అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్టీపరంగా అభ్యర్థిని ఎంపిక చేస్తారా?...లేదంటే వేరే నిర్ణయం తీసుకుంటారా?...అని విశాఖ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఏదేమైనా శుక్రవారం సాయంత్రానికి అభ్యర్థి ఎవరనేది క్లారిటీ వస్తుంది.