Share News

టీడీపీ కార్యాలయంలో తమ్ముళ్ల వీరంగం

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:51 AM

మండలంలోని పూడిమడక పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మేరుగు బాపు నాయుడు ఆధ్వర్యంలో ఆయన అనుచరులు పలువురు అచ్యుతాపురంలో టీడీపీ కార్యాలయంలోకి వచ్చి బీభత్సం సృష్టించారు. కుర్చీలు విరగ్గొట్టి, తలుపులు పగలగొట్టారు. ఆ సమయంలో పార్టీ కార్యాలయంలో సమావేశమైన టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు ఆడారి మంజు, తదితరులు భయాందోళన చెందారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

టీడీపీ కార్యాలయంలో తమ్ముళ్ల వీరంగం
టీడీపీ కార్యాలయంలో బాపునాయుడు వర్గీయులు విరగ్గొట్టిన కుర్చీలు

పూడిమడక పంచాయతీ ఏ పార్టీకి కేటాయిస్తారన్న దానిపై కేటాయింపుపై రగడ

టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి ‘ప్రగడ’ను ప్రశించిన పూడిమడక నేత బాపునాయుడు

తనకు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం

కార్యాలయంలో కుర్చీలు, తలుపులను ధ్వంసం చేసిన బాపునాయుడు వర్గీయులు

పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రగడ.. కేసు నమోదు

అచ్యుతాపురం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని పూడిమడక పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మేరుగు బాపు నాయుడు ఆధ్వర్యంలో ఆయన అనుచరులు పలువురు అచ్యుతాపురంలో టీడీపీ కార్యాలయంలోకి వచ్చి బీభత్సం సృష్టించారు. కుర్చీలు విరగ్గొట్టి, తలుపులు పగలగొట్టారు. ఆ సమయంలో పార్టీ కార్యాలయంలో సమావేశమైన టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు ఆడారి మంజు, తదితరులు భయాందోళన చెందారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలమంచిలి నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్‌ పదవులకు టకెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు, వారికి వున్న విజయావకాశాలపై చర్చించడానికి టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గం ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, మరికొంతమంది నేతలు ఆదివారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో అన్ని మండలాలకు చెందిన ఆశావహులు వచ్చి తమ పరిస్థితులను వివరిస్తున్నారు. ఈ క్రమంలో పూడిమడకకు చెందిన టీడీపీ నాయకుడు మేరుగు బాపునాయుడు, సుమారు 80 మంది అనుచరులతో కార్యాలయంలోకి వచ్చారు. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా పూడిమడక పంచాయతీ సర్పంచ్‌ పదవిని ఏ పార్టీకి కేటాయించారని బాపునాయుడు అడిగారు. ఇందుకు ప్రగడ నాగేశ్వరరావు బదులిస్తూ.. మండలంలో పూడిమడక, దిబ్బపాలెం (సెజ్‌ పునరావాస కాలనీ) రెండు మేజర్‌ పంచాయతీలు వున్నాయని, వీటిలో ఒకటి టీడీపీ, మరొకటి జనసేనకు కేటాయించాలని నిర్ణయించామని, అయితే ఏ పంచాయతీని ఏ పార్టీకి కేటాయించాలన్న దానిపై స్థానిక ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ (జనసేన)తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీంతో బాపునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పూడిమడక పంచాయతీని టీడీపీకి కేటాయించినట్టు ఎమ్మెల్యే చెప్పారని, కానీ మీ మాటలనుబట్టి జనసేనకు కేటాయిస్తున్నట్టుగా వుందంటూ ఒకింత ఆగ్రహంతో మాట్లాడారు. ప్రగడ నాగేశ్వరరావు బదులిచ్చేలోపే బాపునాయుడు అనుచరులు కేకలు వేస్తూ పార్టీ కార్యాలయంలోని కుర్చీలను గచ్చుకేసి కొడుతూ విరగ్గొటారు. తలుపుల అద్దాలను పగలగొట్టి, వాటి ఫ్రేములను విరిచేశారు. కార్యాలయంలో వున్న ఇతర నాయకులు వీరిని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిపైనా దాడి చేసి కొట్టారు. టీడీపీ దిబ్బపాలెం పంచాయతీ అధ్యక్షుడు, లాలం రాజు, మరో నాయకుడు యాండ్ర అప్పలనాయుడుపై ముష్టిఘాతాలు కురిపించారు. బాపునాయుడు వర్గీయుల దాడి దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఒక దినపత్రిక (ఆంధ్రజ్యోతి కాదు) విలేఖరిపై దాడి చేసి, చొక్కా చించేశారు. అతని మొబైల్‌ ఫోన్‌ను లాగేసుకొని, అందులో రికార్డయిన వీడియోలు, ఫొటోలను తొలగించి, తిరిగి ఫోన్‌ను అతనికి ఇచ్చేశారు. అనంతరం బాపునాయుడు, అతని వర్గీయులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ సంఘటన తరువాత ప్రగడ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, అచ్యుతాపురంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సర్పంచ్‌ టికెట్లను ఆశిస్తున్న వారు మాత్రమే హాజరుకావాలని పార్టీ శ్రేణులకు ముందుగానే చెప్పామని అన్నారు. అయితే పూడిమడక నుంచి బాపునాయుడు, తన అనుచరులు సుమారు 80 మందితో వచ్చి గొడవ చేయడమే కాకుండా కార్యాలయంలో కుర్చీలు, తలుపులను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ సంఘటన అనంతరం ఆయనతోపాటు బాపునాయుడు వర్గీయుల చేతిలో దాడికి గురైన పత్రికా విలేఖరి పోలీసు స్టేషన్‌కు వెళ్లి వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. వీటిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు.

Updated Date - Nov 16 , 2026 | 12:51 AM