టీడీపీ, వైసీపీ నేతల దందా
ABN , Publish Date - Feb 24 , 2026 | 01:47 AM
ఆనందపురం మండలం కుసులవాడ పంచాయతీ ఇచ్ఛాపురంలో ప్రభుత్వ భూమిలో రహదారి నిర్మించిన రియల్టర్లు కొత్త డ్రామా మొదలెట్టారు.
తమ భూముల కోసం ప్రభుత్వ భూమిలో రహదారి నిర్మాణం
తొలగించేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపైకి గ్రామస్థులను రెచ్చగొట్టిన వైనం
ఆ రోడ్డు జోలికి వెళ్లకుండా కూటమి నేతల ద్వారా అధికారులపై ఒత్తిడి
విశాఖపట్నం/ఆనందపురం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి):
ఆనందపురం మండలం కుసులవాడ పంచాయతీ ఇచ్ఛాపురంలో ప్రభుత్వ భూమిలో రహదారి నిర్మించిన రియల్టర్లు కొత్త డ్రామా మొదలెట్టారు. సోమవారం ఆ రహదారిని తొలగించేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపైకి గ్రామంలో తమకు అనుకూలంగా ఉన్న కొందరిని ఉసిగొల్పారు. వారంతా చెట్లు నరికి రోడ్డుపై పడేయడంతో రెవెన్యూ సిబ్బంది వెనుతిరగాల్సి వచ్చింది.
వైసీపీ, టీడీపీలకు చెందిన ఇద్దరు నేతలు ఐదేళ్ల క్రితం ఇచ్ఛాపురంలో సుమారు 20 ఎకరాలు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంలో వైసీపీకి చెందిన సర్పంచ్ ఒకరు మధ్యవర్తిగా వ్యవహరించారు. రైతుల్లో కొందరికి పూర్తిగా, మరికొందరికి సగం సొమ్ములు ఇచ్చి అగ్రిమెంట్లు రాయించుకున్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినప్పటికీ...ఇద్దరిలో ఒకరు ఎమ్మెల్యేగా ఉండడంతో అడ్డుచెప్పేవారే లేరనే ధీమాతో ప్రభుత్వ భూమి (సర్వే నంబరు 37)లో దర్జాగా రెండు కిలోమీటర్ల పొడవునా రోడ్డు నిర్మించారు. అభ్యంతరం వ్యక్తం చేసిన గ్రామస్థులను బెదిరించారు. సగంమేర సొమ్ములు తీసుకున్న రైతులు మాత్రం మిగిలినవి రాబట్టుకునేందుకు రియల్టర్ల వెంట ఉన్నారు. ప్రభుత్వ భూమిలో రోడ్డు నిర్మించే సమయంలో ఇబ్బందిలేకుండా మండలంలో టీడీపీ, జనసేన నాయకులతో ముందుగా మాట్లాడుతున్నారనే వాదన వినిపిస్తోంది. అధికారులు అటువైపు వెళ్లకుండా తాము చూసుకుంటామని రియల్టర్లకు మండలంలో కొందరు కూటమి నేతలు భరోసా ఇచ్చారు. అయితే ఈనెల 21వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ప్రభుత్వ భూమిలో రోడ్డు నిర్మాణంపై కథనం ప్రచురితం కావడంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు.
ప్రభుత్వ భూమిలో రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవడంతోపాటు ఇప్పటివరకూ వేసిన రహదారిని తొలగించాలని ఆనందపురం తహశీల్దార్ శ్రీనుబాబును భీమిలి ఆర్డీవో సంగీత్ మాథుర్ ఆదేశించారు. ఈ మేరకు శనివారమే తహశీల్దార్ ఇచ్ఛాపురంలో అక్రమంగా నిర్మించిన రోడ్డును పరిశీలించారు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన రోడ్డును తొలగించాలని సిబ్బందిని ఆదేశించడంతో వారంతా సోమవారం ప్రొక్లెయినర్‌ను తీసుకుని వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న రియల్టర్లు...తమకు అనుకూలంగా ఉన్న గ్రామస్థుల (భూములు ఇచ్చిన రైతులు)ను సిబ్బందిపైకి ఉసిగొల్పారు. వారికి అన్ని విధాలా నచ్చజెప్పేందుకు రెవెన్యూ సిబ్బంది యత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో వెనుతిరిగారు. అయితే దీనిని రెవెన్యూ అధికారులు సీరియస్‌గా తీసుకుని ప్రభుత్వ భూమిలో నిర్మించిన రోడ్డును తొలగిస్తారా?, లేదా నేతల ఒత్తిడికి తలొగ్గుతారా?...చూడాలి.