మాదకద్రవ్యాలకు బానిసలయ్యారని 8మంది విద్యార్థులకు టీసీలు
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:00 AM
అల్లూరి జిల్లా పెదబయలు మండలంలోని సీతగుంట ట్రైబల్ వెల్ఫేర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మాదకద్రవ్యాలకు బాలిసలయ్యారని ఎనిమిది మంది విద్యార్థులకు శనివారం ప్రధానోపాధ్యాయుడు టీసీలు ఇచ్చారు.
తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లని ఉపాధ్యాయులు
హెచ్‌ఎం, వార్డెన్లను మందలించిన ఏటీడబ్ల్యూవో
సోమవారం తల్లిదండ్రులతో సమావేశం
పెదబయలు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా పెదబయలు మండలంలోని సీతగుంట ట్రైబల్ వెల్ఫేర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మాదకద్రవ్యాలకు బాలిసలయ్యారని ఎనిమిది మంది విద్యార్థులకు శనివారం ప్రధానోపాధ్యాయుడు టీసీలు ఇచ్చారు. విద్యార్థులు మత్తు పానీయాలకు అలవాటు పడి పాఠశాలలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారని పాఠశాల యాజమాన్యం తెలిపింది. గతంలో పలుమార్లు హెచ్చరించి, అవగాహన కల్పించినా వారి ప్రవర్తనలో మార్పు కనిపించలేదని పేర్కొంది. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడబోమని విద్యార్థుల నుంచి లిఖితపూర్వకంగా హామీలు తీసుకున్నప్పటికీ వారి పరిస్థితిలో మార్పు రాకపోవడంతో టీసీలు జారీ చేసినట్టు హెచ్‌ఎం మాణిక్యలరావు తెలిపారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా టీసీలు జారీ చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ఏటీడబ్ల్యూవో స్వర్ణలత స్పందిస్తూ.. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా టీసీలు ఇవ్వడంపై హెచ్‌ఎం, వార్డెన్‌ను మందలించినట్టు చెప్పారు. సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి, చర్చిస్తామన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లు, మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా ఇప్పటికే పోలీసు శాఖ, ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో పలుమార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు ఆమె తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.