పన్ను పంచాయితీ
ABN , Publish Date - Feb 07 , 2026 | 01:27 AM
పెందుర్తి మండలంలో గల ఒక ఎమ్యూజ్‌మెంట్ పార్కు పంచాయతీకి ఏడాదికి రూ.80 వేలు పన్ను చెల్లిస్తున్నది. నిబంధనల మేరకు పన్ను విధించాలన్న అధికారుల ఆదేశాలతో రూ.3.8 లక్షల పన్ను చెల్లించాలని నోటీస్ ఇచ్చారు.
నగర శివారు ప్రాంతాల్లో భారీగా వాణిజ్య సముదాయాలు
పంచాయతీలకు ఆస్తి పన్ను చెల్లించేందుకు ససేమిరా
అధికారులు నోటీస్ ఇస్తే రాజకీయ నేతలతో ఫోన్లు
79 పంచాయతీల్లో సుమారు 53 వేల అసెస్‌మెంట్లు
ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం రూ.10.68 కోట్లు
ఇప్పటివరకూ వసూలైంది 50 శాతమే
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
పెందుర్తి మండలంలో గల ఒక ఎమ్యూజ్‌మెంట్ పార్కు పంచాయతీకి ఏడాదికి రూ.80 వేలు పన్ను చెల్లిస్తున్నది. నిబంధనల మేరకు పన్ను విధించాలన్న అధికారుల ఆదేశాలతో రూ.3.8 లక్షల పన్ను చెల్లించాలని నోటీస్ ఇచ్చారు. దీంతో కీలక ప్రజా ప్రతినిధి ఒకరు ఫోన్ చేసి, పెంచిన పన్ను తగ్గించాలని ఒత్తిడి తెస్తున్నారు.
ఆనందపురం సమీపాన గల ఫంక్షన్ హాలు యాజమాన్యం మూడు నంవత్సరాల నుంచి పన్ను చెల్లించడం లేదని గుర్తించిన అధికారులు ఏడాదికి రూ.ఎనిమిది లక్షల వంతున కట్టాలంటూ నోటీస్ ఇచ్చారు. దీనిపై వైసీపీ కీలక నేత ఒకరు అధికారులకు ఫోన్ చేసి ఒత్తిడి తెస్తున్నారు. నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సిందేనని అధికారులు స్పష్టంచేశారు. ఇదే ప్రాంతంలో ప్రైవేటు కళాశాల నడుస్తున్న భవనానికి రూ.మూడు లక్షలు పన్ను విధిస్తే...చెల్లించేందుకు యజమాని ససేమిరా అంటున్నారు.
ఆనందపురం మండలంలోని ఒక గ్రామంలో జాతీయ రహదారికి ఆనుకుని భారీ భవంతి ఉంది. దానికి పన్నును అధికారులు రూ.90 వేలకు పెంచారు. అందుకు గ్రామ సర్పంచ్ మోకాలడ్డుతున్నారు.
జిల్లాలోని నాలుగు గ్రామీణ మండలాల పరిధిలో 79 పంచాయతీలు ఉన్నాయి. పెందుర్తి, ఆనందపురం, భీమిలి మండలాలు నగరానికి సమీపాన ఉండడంతో పెద్దఎత్తున వాణిజ్య, విద్యా సంస్థలు, హోటళ్లు, ఫ్యాక్టరీలు వంటివి ఏర్పాటయ్యాయి. నాలుగు మండలాల్లో ఆస్తి పన్నుకు సంబంధించి సుమారు 53 వేల అసెస్‌మెంట్లు ఉన్నాయి. వాటి ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.10.68 కోట్లు ఆదాయం లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకూ 50 శాతం వసూలు చేశారు. ఇళ్ల యజమానులు, చిన్నపాటి దుకాణాల నిర్వాహకులు సకాలంలో పన్నులు చెల్లిస్తున్నారు. ఎక్కువ మొత్తం కట్టాల్సిన వాణిజ్య సముదాయాలు, పెద్ద దుకాణాలు, విద్యా సంస్థలు నడుస్తున్న భవనాల యజమానులు మాత్రం ఏవో కుంటిసాకులు చెబుతున్నారు. రాజకీయ నాయకులతో పంచాయతీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అధికార పార్టీ నేతల ద్వారా కొందరు, వైసీపీ నేతలతో మరికొందరు ఫోన్‌లు చేయిస్తున్నారు. అద్దెల రూపంలో ఏటా విద్యా సంస్థల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న భవనాల యజమానులు కూడా పంచాయతీలకు పన్ను మాత్రం సక్రమంగా చెల్లించడం లేదు.
ఆనందపురం సమీపాన గల ఒక ఫంక్షన్ హాలు యాజమాన్యం చెల్లించే పన్నును సమీక్షించి సవరించారు. దీని ప్రకారం రూ.మూడు లక్షల వరకు పన్ను చెల్లింపునకు నిర్వాహకులు ముందుకువచ్చారు. మరో సంస్థ అడ్డదారులు వెతుకుతుండంతో చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధం కాగా, విపక్ష పార్టీకి చెందిన నాయకుడితో ఫోన్ చేయించారు. కాగా మూడేళ్ల నుంచి పన్ను చెల్లించని నేరేళ్లవలస జూట్ మిల్లుపై కోర్టులో కేసు వేశారు. పన్నుల వసూళ్లకు పలుచోట్ల సర్పంచులు అడ్డుపడుతుండడం గమనార్హం. వచ్చే నెలతో సర్పంచుల పదవీకాలం ముగియనున్నందున ఆ తరువాతైన జిల్లా కలెక్టర్ దృష్టిసారిస్తే...నాలుగు మండలాల నుంచి రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల ఆదాయం వస్తుందని గ్రామ పంచాయతీ కార్యదర్శి ఒకరు తెలిపారు.