పన్ను వసూళ్లు ఆశాజనకం
ABN , Publish Date - Aug 05 , 2026 | 12:40 AM
జీవీఎంసీలో ఆస్తి పన్ను వసూళ్లు గత ఏడాదితో పోల్చుకుంటే ఆశాజనకంగా ఉన్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో రూ.317.08 కోట్లు వసూలు
గత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో రూ.239.09 కోట్లు వసూలు
గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే రూ.77.99 కోట్లు అధికం
కొత్త అసెస్‌మెంట్‌లు, అదనపు అంతస్థులపై ప్రత్యేకదృష్టి
2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.725 కోట్లు వసూలు లక్ష్యం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీలో ఆస్తి పన్ను వసూళ్లు గత ఏడాదితో పోల్చుకుంటే ఆశాజనకంగా ఉన్నాయి. పన్ను పరిధిలోకి రాకుండా ఉండిపోయిన భవనాలు, ఖాళీ స్థలాలతోపాటు వాణిజ్య అవసరాలకు వాడుతూ నివాస భవనం కింద పన్ను చెల్లిస్తున్న భవనాలు, తీసుకున్న అనుమతికి మించి అంతస్థులు నిర్మించిన భవనాలపై రెవెన్యూ విభాగం అధికారులు ప్రత్యేకంగా దృష్టిపెట్టి కొత్తగా అసెస్‌మెంట్‌లు జారీచేస్తున్నారు. దీంతో గత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలలతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో ఏకంగా రూ.77.99 కోట్లు అదనంగా పన్ను వసూలైంది.
జీవీఎంసీ పరిధిలో 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 5,06,345 అసెస్‌మెంట్‌లు ఉన్నాయి. వాటి ద్వారా గత ఆర్థిక సంవత్సరం రూ.620 కోట్లు ఆస్తి పన్ను వసూలుచేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ రెవెన్యూ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించి పన్ను మరింత ఎక్కువగా వసూలు చేసేందుకు అవకాశం ఉందని, దీనికోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ఏడీసీ రమణమూర్తితోపాటు డీసీఆర్ శ్రీనివాసరావును ఆదేశించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.725 కోట్లు వసూలు చేయాలని లక్ష్యం నిర్దేశించారు. దీనికోసం పన్ను పరిధిలోకి రాకుండా ఉండిపోయిన భవనాలు, ఖాళీ స్థలాలకు కొత్తగా అసెస్‌మెంట్‌లు జారీచేయడం, నివాస భవనాల కింద పన్నులు కడుతూ వ్యాపార కార్యకలాపాలకు వాడుతున్న భవనాలను కమర్షియల్ కేటగిరీలోకి మార్చడంతో పాటు తీసుకున్న ప్లాన్‌కు విరుద్ధంగా అదనపు అంతస్థులు నిర్మించిన భవనాలను గుర్తించి వంద శాతం అధికంగా పన్ను విధించాలని సూచించారు. కమిషనర్ ఆదేశాలకు అనుగుణంగా ఏడీసీ, డీసీఆర్ సంయుక్తంగా జోన్ స్థాయి అధికారులు, సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే కొత్తగా 7,200 అసెస్‌మెంట్‌లు జారీచేయడం ద్వారా రూ.9.2 కోట్లు అదనంగా వసూలు చేయగలిగారు. నివాస భవనాల కింద పన్ను కడుతూ వ్యాపార కార్యక్రమాలలకు వినియోగిస్తున్న 4,200 అసెస్‌మెంట్‌లను వాణిజ్య కేటగిరీలోకి మార్చడం ద్వారా రూ.2.5 కోట్లు అదనంగా వసూలుచేశారు. గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నెలలో రూ.163.66 కోట్లు పన్ను వసూలైతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో ఆ మొత్తం రూ.233.69 కోట్లకు పెరిగింది. అలాగే గత ఆర్థిక సంవత్సరం మే నెలలో రూ.25.47 కోట్లు పన్ను వసూలు చేస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మే నెలలో రూ.28.14 కోట్లు వసూలుచేశారు. గత ఆర్థిక సంవత్సరం జూన్ నెలలో రూ.32.5 కోట్లు వసూలు చేస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ నెలలో రూ.35.68 కోట్లు వసూలైంది. గత ఏడాది జూలైలో రూ.17.46 కోట్లు వసూలు చేస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలైలో రూ.19.57 కోట్లు వసూలైంది. మొత్తం ఆస్తి పన్ను రూపేణా గత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో రూ.239.09 కోట్లు వసూలైతే ఈ ఏడాది రూ.77.99 కోట్లు అదనంగా రూ.317.08 కోట్లు వసూలైంది.
ఏప్రిల్ నుంచి జూలై వరకు వసూలైన పన్నులు
ఏప్రిల్ మే జూన్ జూలై మొత్తం
గత ఏడాది రూ.163.66 కోట్లు రూ.25.47 కోట్లు రూ.32.5 కోట్లు రూ.17.46 కోట్లు రూ.239.09 కోట్లు
ఈ సంవత్సరం రూ.233.69 కోట్లు రూ.28.14కోట్లు రూ.35.68కోట్లు రూ.19.57కోట్లు రూ.317.08 కోట్లు
మహా మాయ
చెత్త తరలింపులో భారీ అవినీతి
బైక్‌లు, ఆటోలు, స్కూల్ బస్సుల నంబర్లతో బిల్లులు
‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించడంతో చర్యలు తీసుకుంటామంటూ హడావిడి చేసిన జీవీఎంసీ మెకానికల్ విభాగం అధికారులు
తాజాగా బిల్లు చెల్లించేందుకు రంగం సిద్ధం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ అధికారుల వ్యవహారశైలి అనేక అనుమానాలకు తావిస్తోంది. టెండర్ల వ్యవహారంలో అవినీతికి పాల్పడిన మెకానికల్ విభాగం సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి...కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించేందుకు సిద్ధపడుతున్నారు.
నగరంలో పారిశుధ్య కార్మికులు, క్లాప్ వాహనాలు సమ్మె చేయడంతో నెల రోజులపాటు ప్రైవేటు లారీలతో చెత్త తరలించిన వ్యవహారంలో జరిగిన మాయాజాలంపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. చెత్త తరలింపునకు ఉపయోగించిన లారీలుగా పేర్కొంటూ బైక్, ఆటో, స్కూల్ బస్సుల నంబర్లను ఎంబుక్‌లో నమోదుచేసిన అధికారులు సదరు కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లింపులకు ఫైల్ సిద్ధం చేయడంతో ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు ప్రచురించింది. దీంతో ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. అవినీతికి పాల్పడిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని, కాంట్రాక్టర్‌కు బిల్లు నిలిపివేస్తామని తొలుత హడావిడి చేశారు. తమకు తెలియకుండా కిందిస్థాయి అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారని,కథనంలోని అంశాల మేరకు ఫైల్‌ను వెనక్కి పంపించి, కాంట్రాక్టర్ చేసిన పనికి మాత్రమే బిల్లు చెల్లిస్తామని ప్రకటించారు.
మారిన సీన్
అయితే తర్వాత ఏం జరిగిందోగానీ అధికారులు ఇంతవరకూ కాంట్రాక్టర్‌పైగానీ, తప్పుడు వాహనాల నంబర్లతో అడ్డగోలుగా బిల్లు చెల్లింపు కోసం ఫైల్‌ను తయారుచేసిన సిబ్బందిపై గానీ చర్యలు తీసుకోలేదు. అంతేకాదు తప్పుచేసిన అధికారులు, సిబ్బంది యథావిధిగా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతోపాటు కాంట్రాక్టర్‌కు పాత ప్రతిపాదనల మేరకే బిల్లు చెల్లించేలా అకౌంట్స్ విభాగానికి సిఫారసు చేసినట్టు తెలిసింది. అవినీతి బయటపడినా సిబ్బందిపై చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా కమిషనర్ కేతన్‌గార్గ్ దృష్టిసారించి అవినీతికి పాల్పడిన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.