Share News

పనులు పంచుకున్నారు!

ABN , Publish Date - Jun 02 , 2026 | 01:17 AM

జీవీఎంసీ హార్టికల్చర్‌ (ఉద్యానవన) విభాగం ఇటీవల పిలిచిన టెండర్లలో కాంట్రాక్టర్లు రింగ్‌ అయ్యారు. అంతా కలిసి కుమ్కక్కై ఐదారు పనులు చొప్పున పంచేసుకున్నారు. నగరంలో తొమ్మిది నెలలపాటు పచ్చదనం నిర్వహణకు సంబంధించి 93 టెండర్లు పిలవగా, వాటి ఫైనాన్సియల్‌ బిడ్‌లు శనివారం తెరిచారు. అన్ని పనులకు కేవలం ఒకటి, రెండు శాతం చొప్పున మాత్రమే లెస్‌లు వేయడంతో అధికారులు అవాక్కయ్యారు.

పనులు  పంచుకున్నారు!

జీవీఎంసీ ‘హార్టికల్చర్‌’

టెండర్లలో కాంట్రాక్టర్ల రింగ్‌

తొమ్మిది నెలలపాటు గ్రీనరీ నిర్వహణకు

ఇటీవల టెండర్లు పిలిచిన నగర పాలక సంస్థ

కేవలం ఒకటి, రెండు శాతం లెస్‌కు బిడ్‌లు

ఒక్కొక్కరికి ఐదారు దక్కేలా

అవగాహనకు వచ్చిన కాంట్రాక్టర్లు

గతంలో ఇవే పనులకు 40 శాతం వరకు లెస్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ హార్టికల్చర్‌ (ఉద్యానవన) విభాగం ఇటీవల పిలిచిన టెండర్లలో కాంట్రాక్టర్లు రింగ్‌ అయ్యారు. అంతా కలిసి కుమ్కక్కై ఐదారు పనులు చొప్పున పంచేసుకున్నారు. నగరంలో తొమ్మిది నెలలపాటు పచ్చదనం నిర్వహణకు సంబంధించి 93 టెండర్లు పిలవగా, వాటి ఫైనాన్సియల్‌ బిడ్‌లు శనివారం తెరిచారు. అన్ని పనులకు కేవలం ఒకటి, రెండు శాతం చొప్పున మాత్రమే లెస్‌లు వేయడంతో అధికారులు అవాక్కయ్యారు.

నగరంలో పచ్చదనం నిర్వహణను జీవీఎంసీ హార్టికల్చర్‌ విభాగం చూస్తుంది. కోస్టల్‌ బ్యాటరీ నుంచి భీమిలి వరకు బీచ్‌రోడ్డుతోపాటు బోయపాలెం జంక్షన్‌ నుంచి లంకెలపాలెం వరకు జాతీయ రహదారిపై సెంటర్‌ మీడియన్లు, ఇరువైపులా గ్రీన్‌బెల్ట్‌తోపాటు కూడళ్లు, ఐలాండ్‌ల వద్ద మొక్కలను నాటడం, వాటికి నీరు పెట్టడం, కలుపు పెరగకుండా ఏరివేయడం, ట్రిమ్మింగ్‌ చేయడం కోసం (ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌) హార్టికల్చర్‌ అధికారులు ఏటా టెండర్లు పిలుస్తుంటారు. టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ నిబంధనలకు అనుగుణంగా పనులు చేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ప్రతి ఐదు వందల చదరపు మీటర్లకు ఒక మనిషిని నియమించాల్సి ఉంటుంది. పాత కాంట్రాక్టులకు సంబంధించి గడువు ఈ ఏడాది మార్చితో ముగియడంతో అధికారులు తిరిగి టెండర్లు పిలిచారు. ఆయా పనులకు సంబంధించి ఫైనాన్షియల్‌ బిడ్‌లను శనివారం తెరిచి లెస్‌కు వేసిన వారికి పనులు అప్పగించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

ఒక్కొక్కరికి ఐదేసి...

ఆయా పనులు టెండర్‌ షెడ్యూల్‌లో పేర్కొన్న మొత్తం కంటే ఎంత శాతం తక్కువకు చేయవచ్చుననేది లెక్కించుకుని కాంట్రాక్టర్లు బిడ్‌లు వేస్తుంటారు. దీనివల్ల కాంట్రాక్టర్ల మధ్య పోటీ పెరిగి జీవీఎంసీకి ఖర్చు ఆదా అవుతుంది. గతంలో హార్టికల్చర్‌ విభాగంలో ఎప్పుడు టెండర్లు పిలిచినా కనీసం 40 శాతం లెస్‌కు బిడ్‌లు వేసేవారు. అయితే ఈసారి ఒకటి, రెండుశాతం మాత్రమే లెస్‌ వేయడం అధికారులందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కాంట్రాక్టర్లంతా ముందుగానే ఏకాభిప్రాయానికి వచ్చి ఒక్కొక్కరు ఐదారు పనులను పంచుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. చాలాకాలంగా హార్టికల్చర్‌లో పనులుచేస్తున్న 12 మంది కాంట్రాక్టర్లతోపాటు కొత్తగా వచ్చిన మరో పది మంది తలా ఇన్ని పనులు అన్నట్టు వాటా లేసుకున్నారని, అందువల్లనే ఒకటి, రెండు శాతానికి మించి లెస్‌లు పడలేదని చెబుతున్నారు. హార్టికల్చర్‌ విభాగంలో జరిగే పనుల నాణ్యతపై చాలాకాలంగా ఆరోపణలు ఉన్నాయి. మొక్కుబడిగా పనులు చేసి బిల్లులు పొందుతున్నారనే అభిప్రాయం ఉంది. అందుకే 40 శాతానికిపైగా లెస్‌కు బిడ్‌లు వేయడానికి వెనుకాడేవారు కాదు. ఇప్పుడు ఒకటి, రెండుశాతం లెస్‌కు బిడ్‌లు వేసినందున గతంలో మాదిరిగా పనులు చేస్తే కాంట్రాక్టర్లకు భారీగా లాభాలు వస్తాయని అంటున్నారు. కాంట్రాక్టర్లు రింగ్‌ అయ్యారనే ఆరోపణలను హార్టికల్చర్‌ విభాగం ఏడీ వాసుకి వద్ద ప్రస్తావించగా గతంలో ఏం జరిగిందనేది తనకు తెలియదని, ఇకపై గ్రీనరీ నిర్వహణలో ఏమాత్రం తేడా వచ్చినా సహించే ప్రసక్తి ఉండదన్నారు. కాంట్రాక్టర్లందరికీ ఇదే విషయం స్పష్టంచేశానన్నారు. ఎన్ని మొక్కలు ఇచ్చామో రికార్డులో నమోదుచేసి, ప్రతినెలా వాటిని లెక్కిస్తామన్నారు. మొక్కలు చనిపోతే సంబంధిత కాంట్రాక్టర్‌ బిల్లులో కోత విధిస్తామన్నారు.

Updated Date - Jun 02 , 2026 | 01:17 AM