Share News

చకచకా పనులు

ABN , Publish Date - Jul 14 , 2026 | 11:48 PM

పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ సాగునీటి వనరుల అభివృద్ధి, మరమ్మతు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో వివిధ నీటి వనరుల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించడానికి రూ.2.5 కోట్లతో పనులు చేపట్టారు.

చకచకా పనులు
పూడిక తీసిన తరువాత ఎస్‌.రాయవరం మండలం చిన ఉప్పలం పంట కాలువ

‘పేట నియోజకవర్గంలో రూ.2.5 కోట్లతో సాగునీటి వనరుల అభివృద్ధి

ఖరీఫ్‌ వరినాట్లు మొదలయ్యేనాటికి పూర్తి చేయాలని లక్ష్యం

పాయకరావుపేట, జూలై 14 (ఆంధ్రజ్యోతి): పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ సాగునీటి వనరుల అభివృద్ధి, మరమ్మతు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో వివిధ నీటి వనరుల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించడానికి రూ.2.5 కోట్లతో పనులు చేపట్టారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పాయకరావుపేట నియోజకవర్గంలో సాగునీటి వనరులు కనీస అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో కాలువల ద్వారా భూములకు సక్రమంగా సాగునీరందక రైతులు ఇబ్బంది పడ్డారు. కాలువల్లో పూడికలు తీయకపోవడంతో రైతులు రెండు విధాలా నష్టపోయారు. భారీ వర్షాలు కురిసినప్పుడు నీటి ప్రవాహం సాఫీగా సాగక.. వరద నీరు పొలాలను ముంచెత్తింది. మరోవైపు పంట చివరి దశలో ఆయకట్టు చివరి భూములకు నీరు సరిగా అందక రైతులు ఇబ్బంది పడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక ఎమ్మెల్యే, హోం మంత్రి అయిన వంగలపూడి అనిత, రైతుల వినతి మేరకు సాగునీటి వనరుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా సాగు నీటి వనరుల నిర్వహణ, అభివృద్ధి పనులకు ఎంతమేర నిధులు అవసరమో ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో అత్యవసరంగా పనులు చేపట్టాల్సిన 24 సాగునీటి వనరులకు ‘ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ గ్రాంటు’ నుంచి రూ.2.5 కోట్లు మంజూరు చేయించారు. రెండు నెలల క్రితం ఆయా సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో పనులు మొదలుపెట్టారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో వరినాట్లు ప్రారంభం అయ్యేనాటిని పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు.

పాయకరావుపేట మండలానికి రూ.64.5 లక్షలు మంజూరుకాగా వీటిలో రూ.22 లక్షలతో భూమి, ముఠా ఆనకట్టల గేట్ల మరమ్మతులు, పంట కాలువల్లో పూడిక తీతపనులు, రూ.4 లక్షలతో రాజవరం ఛానెల్‌ సిస్టమ్‌ అభివృద్ధి, రూ.8 లక్షలతో పాల్తేరు కనుముల చెరువు అభివృద్ధి, రూ.8.50 లక్షలతో ఎంఎస్‌.పేట ఛానెల్‌, రూ.9.5 లక్షలతో గోపాలపట్నం ఆవ ఛానెల్‌, రూ.8.5 లక్షలతో మంగవరం ఛానెల్‌ అభివృద్ధి పనులు చేపట్టారు. నక్కపల్లి మండలంలో రూ.30.49 లక్షలతో నాలుగు ఛానెళ్లు, ఎస్‌.రాయవరం మండలంలో రూ.1.14 కోట్లతో ఎనిమిది సాగునీటి వనరులు, కోటవురట్ల మండలంలో రూ.40.5 లక్షలతో ఐదు ఛానెళ్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ నిధులతో కాలువల్లో పూడికతీత, గేట్ల మరమ్మతు, ఇతర కాంక్రీట్‌ పనులు చేపడుతున్నామని జలవనరుల శాఖ పాయకరావుపేట డీఈఈ ఎంవీ.సురేశ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Jul 14 , 2026 | 11:48 PM