టార్గెట్ 16వ ఆర్థికసంఘం నిధులు
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:23 AM
‘కేంద్రం నుంచి వచ్చే 16వ ఆర్థికసంఘం నిధులను దక్కించుకోవాలంటే అక్టోబరు నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాలి.
అక్టోబరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితేనే కేంద్రం నిధులు విడుదల
ఒక్క జీవీఎంసీకే రూ.వెయ్యికోట్లు గ్రాంట్
జనాభాను బట్టి మిగిలిన స్థానిక సంస్థలకు నిధులు దక్కించుకునే చర్యలో రాష్ట్ర ప్రభుత్వం
కోర్టు కేసు తేలకపోతే 98వార్డులతోనే జీవీఎంసీ ఎన్నిక
కార్యాచరణ సిద్ధం చేస్తున్న అధికారులు
ఎన్నికల విధుల్లో యంత్రాంగం తలమునకలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
‘కేంద్రం నుంచి వచ్చే 16వ ఆర్థికసంఘం నిధులను దక్కించుకోవాలంటే అక్టోబరు నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాలి. కానీ జీవీఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజనపై కోర్టులో కేసు నడుస్తుండడం ఎన్నికల నిర్వహణకు ఆటంకంగా మారింది. ఈ నేపథ్యంలో ఒకవేళ 120 వార్డుల పునర్విభజన ప్రక్రియను కోర్టు తప్పుపడితే గతంలో మాదిరిగా 98 వార్డులతో ఎన్నికకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉండేలా జీవీఎంసీ అధికారులు కార్యచరణ రూపొందిస్తున్నారు. దీనికిసంబంధించిన ముందస్తుఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
జీవీఎంసీ కార్యవర్గం పదవీకాలం ఈ ఏడాది మార్చి తో ముగిసింది. తర్వాత ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ జీవీఎంసీ పరిధిలో వార్డుల సంఖ్య పెంచాలనే ప్రతిపాదన ఉండడంతో ప్రత్యేక అధికారిపాలన అమలుచేసింది. జిల్లా కలెక్టర్ ప్రస్తుతం జీవీఎంసీ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్నారు. అక్టోబరు నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగి కొత్తకార్యవర్గం ఏర్పాటైతేనే కేంద్రప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం నుంచి నిధులను ఆయా స్థానిక సంస్థలకు విడుదల చేస్తుంది. లేదంటే నిధులన్నీ కోల్పోవాల్సిందే. ఈ తరుణంలో జీవీఎంసీతోపాటు రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు జనాభా ఆధారంగా వార్డుల సంఖ్యను నిర్ధారిస్తూ ప్రభుత్వం నాలుగు నెలల కిందట ఉత్తర్వులు జారీచేసింది. దానిప్రకారం పది లక్షలు జనాభాపైబడి ఉన్న జీవీఎంసీ పరిధిలో వార్డుల సంఖ్య 120 ఉండాలని పేర్కొంది. ఈ మేరకు వార్డుల సంఖ్యను 98 నుంచి 120కి పెంచుతూ జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు పునర్విభజన చేపట్టారు. 120 వార్డులకు సరిహద్దులు నిర్ణయిస్తూ ప్రాథమిక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వార్డుల జాబితాలను అన్ని వార్డు సచివాలయాలు, జోనల్, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రజల సౌకర్యార్థం అందుబాటులో ఉంచారు. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత వాటిని పరిశీలించి తుది ప్రాథమిక ముసాయిదాను తయారుచేసి ప్రభుత్వానికి పంపించాల్సిన తరుణంలో కొందరు ఈ ప్రక్రియను నిలిపివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించింది.
అక్టోబరులోగా ఎన్నికలు జరిగితేనే...
ఇదిలావుండగా 16వ ఆర్థిక సంఘం నిధులు పొందాలంటే అక్టోబరు నెలాఖరులోగా అన్ని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం కేంద్రం ఇచ్చే వందశాతం గ్రాంట్‌ను పొందాల్సి ఉన్నందున వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. అందులోభాగంగా మండల, జిల్లా పరిషత్ చైర్మన్లతోపాటు మున్సిపల్ చెన్మన్‌లు, మేయర్ పదవులకు ప్రత్యక్ష ఎన్నిక విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా కోర్టులో ఇప్పటికిప్పుడు పరిష్కరించడానికి వీల్లేని కేసులున్న స్థానిక సంస్థలను మినహాయించి పరిష్కరించదగిన వాటితోపాటు వివాదాల్లేని సంస్థలకు ఎన్నికలు జరిపేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కోరింది. దీంతో కమిషనర్ గతకొద్దిరోజులుగా అన్నిజిల్లాల కలెక్టర్లు, ఎలక్టోరల్ అధికారులతో ఎన్నికల నిర్వహణ, సన్నద్ధతపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో జీవీఎంసీ ఎన్నికల అంశంపై అన్ని రాజకీయపార్టీలతోపాటు అధికారుల్లో విస్తృతచర్చ జరుగుతోంది.
98 వార్డులతో అయినా
జీవీఎంసీకి 120వార్డులతో ఎన్నిక జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగిందని, దీనిపై కొందరు అభ్యంతరాలు తెలిపినప్పటికీ, వాటిని కూడా పరిగణలోకి తీసుకునే తుది ప్రాథమిక ముసాయిదా రూపొందించామని చెబుతున్నారు. దీనిని కోర్టుకు నివేదిస్తే కోర్టు వార్డుల పునర్విభజనకు మద్దతుగా తీర్పునిస్తుందనే ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ కోర్టులో కేసు పరిష్కారం జాప్యమైతే పునర్విభజన ప్రక్రియను రద్దుచేస్తామని కోర్టుకు హామీ ఇచ్చి, కేసు పరిష్కరించుకుని 98 వార్డులతో ఎన్నికకు వెళతామని పేర్కొంటున్నారు. ఈ ప్రకారం పోలింగ్‌స్టేషన్లు, జనాభా వివరాలు సిద్ధంగా ఉండడంతో తమ పని మరింత సులభమవుతుందంటున్నారు.
రూ.వెయ్యికోట్లు వచ్చే వీలు
జీవీఎంసీకి ఎన్నిక జరిగితే 16వ ఆర్థిక సంఘం కింద కేంద్రప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు విడుదల చేస్తుందని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. ఆ మొత్తం పూర్తిగా గ్రాంటే కాబట్టి, జీవీఎంసీకి ఆర్థికభారం లేకుండా అభివృద్ధిపనులు, మౌలిక వసతుల కల్పనకు వీలుంటుందని చెబుతున్నారు. ఐదేళ్లలో అంతపెద్దమొత్తం నిధులను కోల్పోవడానికి ప్రభుత్వం అంగీకరించదు కాబట్టి, అక్టోబరు నెలాఖరులోగా ఎన్నిక జరుగుతుందని అంచనా వేస్తున్నారు.