Share News

కొళాయి నీరు కలుషితం

ABN , Publish Date - Apr 29 , 2026 | 12:47 AM

స్థానిక పంచాయతీ అధికారులు కొళాయిల ద్వారా కలుషిత నీటిని సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. చోడవరంలో ఇటువంటి పరిస్థితి తరచూ తలెత్తుతున్నదని, కానీ అధికారులు ఈ సమస్యను తేలిగ్గా తీసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కొళాయి నీరు కలుషితం
ఎడ్ల వీధిలో కొళాయిల నుంచి వచ్చిన రంగు మారిన నీరు

చోడవరంలో బురద నీరు సరఫరా

తరచూ ఇదే సమస్య

పట్టించుకోని పంచాయతీ అధికారులు

అతిసార ప్రబలుతుందేమోనని ప్రజల ఆందోళన

చోడవరం, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): స్థానిక పంచాయతీ అధికారులు కొళాయిల ద్వారా కలుషిత నీటిని సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. చోడవరంలో ఇటువంటి పరిస్థితి తరచూ తలెత్తుతున్నదని, కానీ అధికారులు ఈ సమస్యను తేలిగ్గా తీసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో కొన్నిచోట్ల అతిసార ప్రబలుతున్న నేపథ్యంలో చోడవరం పంచాయతీ అధికారులు రక్షిత తాగునీటిని సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కలుషి తాగునీటి సరఫరాపై మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ తీవ్రంగా ఎందుకు భావించడంలేదని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడో ఒకచోట పైపులైన్ల మరమ్మతుల పేరిట వారానికోసారి నీటి సరఫరాను నిలుపుదల చేయడం, లేదంటే కొళాయిల ద్వారా మురికి నీటిని సరఫరా చేయడం ఆనవాయితీగా మారిందని అంటున్నారు. నీటి సరఫరా వ్యవస్థపై అధికారుల పర్యవేక్షణ కొరవడడమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఎడ్లవీధి, పిళ్లావారితోట, దుడ్డువీధి, వ్యాపార వీధి, గునిశెట్టి వారి వీధి, చినబజారు ప్రాంతాల్లో కొళాయిల నుంచి నల్లటి నీరు వచ్చింది. వారం రోజుల క్రితం బానయ్యకోనేరు, పూర్ణా ఽథియేటర్‌ పరిసర ప్రాంతాల్లో, అంతకుముందు పెదబజారు ప్రాంతంల కొళాయి నుంచి బురద నీరు సరఫరా అయ్యింది. పంచాయతీ అధికారులు నిర్వాకం వల్ల తాము అతిసార బారినపడే ప్రమాదం వుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

జన్నవరం, గౌరీపట్నం పంపుహౌస్‌ల నుంచి రక్షిత పథకాలకు సరఫరా అవుతున్న నీటిని శుద్ధి చేయకుండా నేరుగా ట్యాంకులకు ఎక్కించి, వాటి నుంచి కొళాయిలకు సరఫరా చేస్తుండడమే ఇందుకు కారణమని అంటున్నారు. రక్షిత పఽథకాల వద్ద నీటి శుద్ధికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చేసిన సూచనను పంచాయతీ అధికారులు బేఖాతరు చేస్తున్నట్టు స్పష్టమవుతున్నది. కొళాయిల నుంచి మురికినీరు వస్తుండడతో తాగడానికి, వంట కోసం క్యాన్ల నీటిని కొనుగోలు చేసుకోవాల్సి వస్తున్నదని స్థానికులు చెబుతున్నారు. జిల్లా పంచాయతీ అధికారులు స్పందించి, చోడవరంలో కొళాయిల ద్వారా రక్షిత తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Apr 29 , 2026 | 12:47 AM