చెరువులు వెలవెల
ABN , Publish Date - Jul 27 , 2026 | 12:28 AM
ఎల్‌నినో ప్రభావంతో కనీస స్థాయిలో కూడా వర్షాలు కురవకపోవడంతో జిల్లాలో చెరువుల్లో చుక్క నీరు చేరలేదు. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. జూలై నెల చివరివారం వచ్చినా వర్షాలు కురవకపోవడం అటుంచి.. ఎండలు మండిపోతుండడంతో వరి నారుమడులు ఎండిపోతున్నాయి.
జలాశయాల్లో పడిపోతున్న నీటి నిల్వలు
చినుకు పడక.. ఎండిపోతున్న వరినారుమడులు
పొలాల్లో మేతకు వెళ్లిన పశువులకు నీటి కొరత
దిక్కుతోచని స్థితిలో రైతులు
చోడవరం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో కనీస స్థాయిలో కూడా వర్షాలు కురవకపోవడంతో జిల్లాలో చెరువుల్లో చుక్క నీరు చేరలేదు. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. జూలై నెల చివరివారం వచ్చినా వర్షాలు కురవకపోవడం అటుంచి.. ఎండలు మండిపోతుండడంతో వరి నారుమడులు ఎండిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాధార భూముల్లో వరి సాగు కష్టమేనని రైతులు అంటున్నారు. వర్షాలు మొహం చాటేయడం, చెరువుల్లో నీరు లేకపోవడంతో జిల్లాలోని అన్ని మండలాల్లో భూగర్భ జలాలు దిగజారుతున్నాయి. గతంలో మోస్తరు లోతు వేసిన బోర్లు ఎండిపోయాయి. పొలాల్లో మేత కోసం తోలుకెళ్లిన పశువులకు నీరు లభించని పరిస్థితి ఏర్పడింది. దీంతో మధ్యాహ్నంకల్లా పశువులను కల్లాలకు తిరిగి తీసుకొస్తున్నారు. మరికొద్ది రోజులు పరిస్థితి ఇలాగే కొనసాగితే పశువులకు పచ్చిమేత కూడా లభించే పరిస్థితి వుండదు.
జిల్లాలో అతి పెద్ద చెరువుగా గుర్తింపు పొందిన లక్ష్మీపురం చెరువు గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తిగా ఎండిపోయింది. మండు వేసవిలో సైతం ఈ చెరువులో నీరు వుంటుంది. అయితే గత ఏడాది డిసెంబరు నుంచి ఇప్పటి వరకు ఒక్క సారి కూడా భారీ వర్షం పడలేదు. పైగా మూడు, నాలుగు నెలలపాటు ఎండలు మండిపోయాయి. దీంతో చెరువులో నీరు కొంత ఇంకిపోయి, మరికొంత ఆవిరై.. పూర్తిగా అడుగంటింది. సుమారు 500 ఎకరాల విస్తీర్ణం వున్న ఈ చెరువు కింద మూడు వేలకుపైగా ఎకరాల ఆయకట్టు వుంది. ఒకరిద్దరు రైతులు మినహా మిగిలిన వారెవరూ ఇంతవరకు వరి ఆకుమడులును సిద్ధం చేయలేదు. ఇక మండలంలోని నరసాపురం ఏనుగుబంద చెరువు, నరసాపురం, వెంకన్నపాలెం పరిధిలోని పిల్లకానివాని చెరువు, నరసయ్యపేట చెరువులో నీరు లేరు.
నీరులేక చిన్నబోయిన పెద్ద చెరువు
నాతవరం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): మండు వేసవిలో సైతం నీటితో కళకళలాడే నాతవరంలోని పెద్ద చెరువులో ప్రస్తుతం చుక్క నీరు కూడా లేదు. స్థానికులు మినీ రిజర్వాయర్‌గా పిలుచుకునే ఈ చెరువు కింద సుమారు 260 ఎకరాల ఆయకట్టు వుంది. చుక్క నీరు లేకపోవడంతో చెరువు మొత్తం మైదానంలా కనిపిస్తున్నది. ఈ పరిస్థితిని చూసి ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు.
‘కోటవురట్ల’లో 75 శాతం లోటు వర్షపాతం
చుక్కనీరు లేని చెరువులు
మడుల్లో గిడసబారి ఎండిపోతున్న వరి నారు
కోటవురట్ల, జూలై26 (ఆంధ్రజ్యోతి): మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మే నెల నుంచి జూలైలో ఇప్పటి వరకు 417 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదు కావాల్సి వుండగా, 102 మిల్లీమీటర్లు (24.4 శాతం) మాత్రమే కురిసింది. దీంతో చెరువుల్లో ఎక్కడా చుక్కనీరు లేదు. గత నెలలో అడపాదడపా కురిసిన వర్షాలతో పలువురు రైతులు ఆకు మడులను సిద్ధం చేసుకొని వరి విత్తనాలు చల్లారు. తరువాత కనీసస్థాయిలో కూడా వర్షాలు పడకపోవడంతో నేల బీటలు వారి, వరినారు ఎదుగుదల లేక ఎండిపోతున్నది. చెరువుల్లో ఎక్కడా నీరు లేదు. అప్పుడప్పుడు ఆకాశంలో మేఘాలు ఏర్పడడం తప్ప, వర్షించి దాఖలాలు లేవు. మే నెలలో సాధారణ వర్షపాతం 120.7 మి.మీ.కాగా 19.9 మి.మీ. కురిసింది. జూన్‌లో సాధారణ వర్షపాతం 114.2 మిల్లిమీటర్లు కాగా ఒకింత మెరుగ్గా 72.7 మి.మీ. కురిసింది. అయితే ప్రస్తుత నెలలో పరిస్థితి అత్యంత దారుణంగా వుంది. జూలైలో 182.7 మి.మీ.లకుగాను ఇంతవరకు 9.9 మి.మీ.లు మాత్రమే కురిసింది. మొత్తం మీద గత మూడు నెలల్లో 24.4 శాతం మాత్రమే కురిసింది. వచ్చే నెలాఖరులోగా ఖరీఫ్ వరినాట్లు వేయాలని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులనుబట్టి వరి సాగు కష్టమేనని రైతులు వాపోతున్నారు. అందువల్ల ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారులు పంపిణీకి సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.