తాండవ జలకళ
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:35 AM
మండు వేసవిలో సైతం తాండవ జలాశయంలో నీటి నిల్వలు సమృద్ధిగా వున్నాయి. రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 380 అడుగులు కాగా, మంగళవారం సాయంత్రానికి 374.5 అడుగుల మేర నీరు వుంది. గత ఏడాది ఇదే రోజున నీటి నిల్వలు దాదాపు పది అడుగుల తక్కువగా.. 364.8 అడుగులు మాత్రమే వున్నాయి. పరీవాహక ప్రాంతంలో కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి కొద్ది మొత్తంలో వరద నీరు చేరుతున్నది.
గరిష్ఠ నీటిమట్టం 380 అడుగులు
ప్రస్తుతం 374.5 అడుగుల మేర నీరు
వచ్చే నెలాఖరులో నీటి విడుదలకు అధికారులు సిద్ధం
వరి విత్తనాలు పంపిణీ చేయాలని రైతుల వినతి
నాతవరం, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): మండు వేసవిలో సైతం తాండవ జలాశయంలో నీటి నిల్వలు సమృద్ధిగా వున్నాయి. రిజర్వాయర్ గరిష్ఠ నీటిమట్టం 380 అడుగులు కాగా, మంగళవారం సాయంత్రానికి 374.5 అడుగుల మేర నీరు వుంది. గత ఏడాది ఇదే రోజున నీటి నిల్వలు దాదాపు పది అడుగుల తక్కువగా.. 364.8 అడుగులు మాత్రమే వున్నాయి. పరీవాహక ప్రాంతంలో కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో జలాశయంలోకి కొద్ది మొత్తంలో వరద నీరు చేరుతున్నది. నైరుతి రుతుపవనాలు వచ్చిన తరువాత కురిసే వర్షాలతో రిజర్వాయర్ వేగంగా నిండుతుందని అధికారులు, రైతులు భావిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఒకింత తక్కువ కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారని, అందువల్ల రిజర్వాయర్ నుంచి 15-30 రోజుల ముందుగానే ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు వరి విత్తనాల పంపిణీని వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా రైతులు ఈ నెలాఖరులోగా వరినారుమళ్లు పోసుకుంటే జూలై చివరి నుంచి తాండవ జలాశయం నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేయడానికి తమకు అఽభ్యంతరంలేదని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.