రూ.12 కోట్లతో తాండవ అభివృద్ధి
ABN , Publish Date - Aug 12 , 2026 | 12:20 AM
కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లలో తాండవ కాలువలు, అక్విడెక్ట్‌లు, రక్షణ గోడలు, తదితర పనులకు రూ.12 కోట్లు ఖర్చు చేసిందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు.
స్పీకర్ అయ్యన్నపాత్రుడు
తాండవ నీరు విడుదల
నాతవరం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లలో తాండవ కాలువలు, అక్విడెక్ట్‌లు, రక్షణ గోడలు, తదితర పనులకు రూ.12 కోట్లు ఖర్చు చేసిందని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. మంగళవారం ఆయన తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణతో కలిసి తాండవ నీరు విడుదల కోసం పూజలు చేసి జల హారతి ఇచ్చారు. అనంతరం తాండవ ఈఈ బాలసూర్యంతో కలిసి వారు తాండవ నీటిని కుడి, ఎడమ కాలువలకు విడుదల చేశారు. ఈ సందర్భంగా తాండవ డ్యాంపై తాండవ ఆయకట్టు రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ప్రతి రైతు ఈ ఏడాది తాండవ నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు. తాండవ డ్యాం నుంచి జోగింపేట వరకు రక్షణ గోడ నిర్మాణానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. అంతకు ముందు ఆయన నాతవరం నుంచి తాండవకు రూ.3.5 కోట్లతో నిర్మించిన తారు రోడ్డును ప్రారంభించారు. తారురోడ్లపై ఎవరైనా దమ్ము ట్రాక్టర్లు నడిపి రోడ్డు పాడు చేస్తే ఆ ట్రాక్టర్‌ను సీజ్ చేసి కోర్టుకు పంపించాలని పోలీసులను ఆయన ఆదేశించారు. తాండవ డీఈఈ అనురాధ మాట్లాడుతూ తాండవ గరిష్ఠ నీటిమట్టం 380 అడుగులు కాగా, ప్రస్తుతం 375.2 అడుగులు ఉందని, ఈ నీరు 52 వేల ఎకరాలకు 70 రోజుల వరకు సరిపోతుందని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నాతవరం, నర్సీపట్నం, కోట ఉరట్ల మండలాలకు సంబంధించి 32,689 ఎకరాలకు, కాకినాడ జిల్లాలో కోటనందూరు, రౌతులపూడి, తుని మండలాలకు సంబంధించి 18,776 ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు. ప్రస్తుతం కుడి, ఎడమ కాలువలకు 250 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నామని, రైతుల డిమాండ్‌ను బట్టి రెండురోజులలో ఎక్కువ నీటిని విడుదల చేస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీవో వీవీ రమణ, తహశీల్దార్ చందనరేఖ, ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గం ఇన్‌చార్జి రాజాన వీరసూర్యచంద్ర, తాండవ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ జోగిబాబు, తాండవ డిస్ట్రిబ్యూట్ కమిటీ అధ్యక్షులు పారుపల్లి దాసు, నాతవరం పీఏసీఎస్ అధ్యక్షుడు అపిరెడ్డి మాణిక్యం, మాజీ ఎంపీపీ పారుపల్లి కొండబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.