ప్రజల్లోకి బడ్జెట్ కేటాయింపులు
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:57 AM
సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమన్వయం చేస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ విశేషాలను, రంగాల వారీ కేటాయింపులను ప్రజలకు వివరించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.
నియోజకవర్గాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలకు ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి సూచన
జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏల బడ్జెట్‌లలో కేటాయింపులు, చేపట్టిన ప్రాజెక్టులు గురించి కూడా వివరించాలి
బడ్జెట్ కేటాయింపులకు తగ్గట్టు పనులు చేపట్టాలి
నిధులను వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి
విశాఖపట్నం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి):
సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమన్వయం చేస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ విశేషాలను, రంగాల వారీ కేటాయింపులను ప్రజలకు వివరించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో నియోజకవర్గాల్లో అవగాహన శిబిరాలు నిర్వహించాలన్నారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో ఆయన బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అభివృద్ధి ప్రాజెక్టులు, సూపర్‌సిక్స్ పథకాల అమలు కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, చేసిన బడ్జెట్ కేటాయింపులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యేలు, అధికారులకు ఇన్‌చార్జి మంత్రి సూచించారు. ఏప్రిల్ తొలి వారంలో ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. నియోజకవర్గాల వారీగా చేసిన కేటాయింపులపై ప్రత్యేక బుక్‌లెట్లు తయారుచేయాలని, ఐఏఎస్ అధికారుల సాయంతో అవగాహన శిబిరాలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర బడ్జెట్ అంశాలతోపాటు 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ బడ్జెట్‌లో కేటాయింపులు, చేపట్టిన ప్రాజెక్టులు గురించి ప్రజలకు వివరించాలన్నారు. బడ్జెట్ కేటాయింపులకు తగ్గట్టు పనులు చేపట్టాలని, నిధులను వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, దీనిలో భాగంగా పలు కంపెనీల ఏర్పాటుకు ఇప్పటికే చర్యలు మొదలయ్యాయన్నారు. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్‌కు శంకుస్థాపన జరిగిందని, త్వరలో గూగుల్ సంస్థకు శంకుస్థాపన జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ రాష్ట్ర స్థూల విలువ జోడింపులో జిల్లాకు ఉన్న కీలక పాత్రను వివరించారు. 2026-27 బడ్జెట్‌లో జిల్లాలోని అన్ని రంగాలకు కలిపి రూ.2,992 కోట్లు కేటాయించగా, అందులో సంక్షేమ పథకాల కోసం రూ.1,534 కోట్లు, ఎన్‌టీఆర్ భరోసాకు రూ.835 కోట్లు, తల్లికి వందనం పథకానికి రూ.399 కోట్లు, స్ర్తీశక్తికి రూ.110 కోట్లు, దీపం-2కు రూ.102 కోట్లు మంజూరుకానున్నట్టు వెల్లడించారు. వీఈఆర్‌లో 49 ప్రాజెక్టులు రూపొందించగా, అందులో 17 విశాఖ జిల్లాలోనే రాబోతున్నాయన్నారు. జిల్లాలో మూడు వర్కింగ్ వుమెన్స్ హాస్టల్స్ నిర్మాణంలో ఉన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన నిధులను మ్యాపింగ్ చేస్తూ పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. రాష్ట్ర జీవీఏలో జిల్లాకు సుమారు రూ.9.14 శాతం వాటా ఉందని, గత ఏడాదితో పోలిస్తే 11.27 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించారు. ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్, తయారీ, నిర్మాణం, రవాణా, నిల్వ వంటి ఉప రంగాలు జిల్లాలో ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్నాయన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పి.గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పి.విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణశ్రీనివాస్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడులు సూచనలు, సలహాలు అందించారు. పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ, వీఎంఆర్‌ఏ కమిషనర్లు కేతన్‌గార్గ్, తేజ్ భరత్, డీఆర్‌వో విశ్వేశ్వరనాయుడు, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధూర్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు సన్మానం
హరేంధిరప్రసాద్ సేవలు అభినందనీయం
జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రశంస
విశాఖపట్నం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి):
జిల్లా కలెక్టర్‌గా ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అందించిన సేవలు అభినందనీయమని ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో మంగళ వారం కలెక్టర్‌ను ఇన్‌చార్జి మంత్రి, పలువురు ఎమ్మెల్యేలు సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 20 నెలల్లో ప్రజ లకు ఉత్తమమైన సేవలు అందించారని ప్రశంసించారు. శాంతియుత వాతావరణంలో అందరి మన్ననలు పొందుతూ విధులు నిర్వర్తించారన్నారు. ప్రజా సమస్యలన్నా, ప్రజ లన్నా గౌరవంతో, బాధ్యతతో పనిచేశారని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యేలు గణబాబు, రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, ఎన్‌టీఆర్ వైద్య సేవ ట్రస్టు చైర్మన్ సీతంరాజు సుధాకర్‌లు మాట్లా డుతూ కలెక్టర్‌గా హరేంధిర ప్రసాద్ అందించిన సేవలు మరువలేనివన్నారు. చివరిగా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లా డుతూ తన విధి నిర్వహణలో ప్రభుత్వ పెద్దలు, ఇన్‌చార్జి మంత్రి, స్థానిక ప్రజా ప్రతి నిధులు, అధికారులు సంపూర్ణ సహకారం అందించారని పేర్కంటూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.