Share News

కలెక్టర్‌గా టి.నిశాంతి నియామకం

ABN , Publish Date - Mar 29 , 2026 | 11:26 PM

రాష్ట్రంలో పలువురు కలెక్టర్లకు బదిలీల నేపథ్యంలో అల్లూరి జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌కు స్థానచలనం కల్పించి ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రీస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌(ఏపీఐఐసీ) ఎండీగా ప్రభుత్వం నియమించింది.

కలెక్టర్‌గా టి.నిశాంతి నియామకం
టి.నిశాంతి

ఏపీఐఐసీ ఎండీగా ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

పాడేరు, మార్చి 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పలువురు కలెక్టర్లకు బదిలీల నేపథ్యంలో అల్లూరి జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌కు స్థానచలనం కల్పించి ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రీస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌(ఏపీఐఐసీ) ఎండీగా ప్రభుత్వం నియమించింది. అలాగే బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌గా పని చేస్తున్న టి.నిశాంతికి పదోన్నతి కల్పించి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ ఆదివారం ఉత్తర్వలు జారీ చేశారు.

ఉత్తమ అధికారిణిగా నిశాంతికి గుర్తింపు

బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పని చేస్తూ పదోన్నతిపై అల్లూరి జిల్లా కలెక్టర్‌గా నియమితులైన టి.నిశాంతి ఉత్తమ ఐఏఎస్‌ అధికారిణిగా గుర్తింపు పొందారు. తమిళనాడు రాష్ట్రం కొయంబత్తూర్‌ జిల్లాకు చెందిన టి.నిశాంతి బీటెక్‌, ఎంబీఏ చేసి, 2017లో ఐఏఎస్‌ సాధించారు. ప్రకాశం జిల్లాలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా శిక్షణ పొంది పెనుగొండ సబ్‌ కలెక్టర్‌గా, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో జాయింట్‌ కలెక్టర్‌, రాష్ట్ర ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో జాయింట్‌ సెక్రటరీగా చేసి 2024 జూలై 24న కోనసీమ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ధాన్యం సేకరణ సమయాల్లో ఏర్పడిన సమస్యలను పరిష్కరించడంతో రైతులకు చేరువయ్యారు. గోదావరి వరదల సమయాల్లో కీలకంగా వ్యవహరించారు. అక్కడ భూ సమస్యలు, ప్రజల సమస్యల పరిష్కారంలో ఆమె ప్రత్యేక శద్ధ కనబరిచారనే గుర్తింపు ఉంది.

Updated Date - Mar 29 , 2026 | 11:26 PM